Suryaa.co.in

Editorial

జగన్.. రఘురామకృష్ణంరాజుకు ఎందుకు జంకుతున్నారు?

– వేటుపై లేటు ఎందుకు?
– వైసీపీ ఎమ్మేల్యే,ఎంపీ, మంత్రుల విస్మయం
– బీజేపీలో చేరినా బేఫికరంటున్న నర్సాపురం వైసీపీ నేతలు
– నర్సాపురంలో రాజు లేకున్నా స్థానిక సమరంలో గెలిచిన వైసీపీ
– బహిష్కరించకుండా జగన్‌ను తప్పుదోవపట్టిస్తున్న సీనియర్లు
( మార్తి సుబ్మ్రహ్మణ్యం)
పక్కలోబల్లెం.. కాలిలో ముల్లు.. చంకలోపుండు.. కంట్లో నలుసు.. చెవిలో జోరీగ.. ఇంటిపోరు.. చెప్పులో రాయి. వీటిని ఎవరూ భరించరు. భరించలేరు. తెలివైనవారెవరయినా వదిలించుకోవడతానికే ప్రయత్నిస్తారు. ఒక్క ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగనన్న తప్ప! గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పార్టీ పరువును బజారుకు ఈడ్చి ప్రతిరోజూ రచ్బబండ పేరిట చాకిరేవు పెడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేయకుండా లేటెందుకు చేస్తున్నారు? ప్రపంచంలో ఎవరికీ భయపడని జగనన్న, ఆయనొక్కరికే ఎందుకు భయపడుతున్నారు? బహిష్కరించకుండా ఎందుకు మీనమేషాలు లెక్కబెడుతున్నారు?.. ఇదీ ఇప్పుడు వైసీపీలో, మంత్రుల నుంచి మండల నేతల వరకూ అందరినీ తొలుస్తున్న సందేహాలు. ఎమ్మెల్యేలు-ఎంపీల మధ్య జరుగుతున్న చర్చ.
ఆయన అప్పట్లో ప్రపంచంలో అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకరైన సోనియాగాంధీనే ఢీకొన్న యువనేత. ఆమెనే ఖాతరుచేయకుండా తిరుగుబాటు చేసిన నేత. జైలుకయినా వెళ్లేందుకయినా సిద్ధపడ్డారు తప్ప, కాంగ్రెస్ బెదిరింపులకు లొంగని పోరాట యోద్ధ. ఎవరు చెప్పినా లెక్కచేయకుండా, తాను అనుకున్నదే చేసే జగమొండి. ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలం చేసుకోగల వ్యూహకర్త. ఎవరైనా తాను చెప్పిందే చేయాలే తప్ప, వారు చెప్పింది వినే అలవాటులేని నేత. మరి అలాంటి నేత కేవలం ఒక ఎంపీకి భయపడటం ఏమిటి? తనపై తిరుగుబాటు చేసినా, వేటు వేయకుండా లేటు చేయడమేమిటి? అంటే అంత పెద్ద యోద్ధ కూడా ఆ ఎంపీకి భయపడుతున్నారా?.. ఆ ఎంపీని తాను వెలి వేస్తే బీజేపీలో చేరతారని భయపడుతున్నారా? ఇదీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ఆశ్చర్యం. ఇంతకూ ఆ యోద్ధ జగనన్న అయితే, ఆ ఎంపీ రఘురామకృష్ణంరాజు.
ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుకెక్కిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేయకుండా, ఉపేక్షించడంపై పార్టీ వర్గాల్లో విస్మయంతోపాటు అసంతృప్తి వ్యక్తమవుతోంది. లోక్‌సభలో ఎంపీ రాజు వ్యవహారశైలి వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని, మీ పార్టీ వాళ్లే ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఇతర పార్టీ ఎంపీ సహచరులు తమను ప్రశ్నిస్తుంటే, తమకు అవమానంగా ఉందని ఎంపీలు తలపట్టుకుంటున్నారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో.. మిగిలిన రాష్ట్రాల ఎంపీలయితే మీ పార్టీ చీలిపోయిందా అని ప్రశ్నిస్తుంటే, ఏం చెప్పాలో అర్ధం కాని పరిస్థితి ఉందంటున్నారు.
‘ఆయనను మాతో తిట్టించడమెందుకు? తిరిగి తిట్టించుకోవడం ఎందుకు? మేం రాజును తిడుతుంటే ఆయన మమ్మల్ని పట్టించుకోకుండా, మళ్లీ తిరిగి మా నాయకుడైన జగన్ గారినే తిడుతున్నారు. అసలు ఆయన మమ్మల్ని లెక్కచేయడం లేదు. ఇది మాకూ ఎబ్బెట్టుగానే ఉంది. ఈరోజు ఏపీలో లిక్కర్ అమ్మకాల గురించి రాజు లోక్‌సభలో మాట్లాడారు. దానితో డిజిటల్ చెల్లింపులు లేకుండా లిక్కర్ అమ్ముతున్న విషయం దేశంలోని మిగిలిన ఎంపీలందరికీ తెలసిపోయింది. హౌస్ జరుగుతున్నప్పుడల్లా ఆయన మా గవర్నమెండుకు వ్యతిరేకంగా ఏం మాట్లాడతారో తెలియడం లేదు. ఏ కేంద్రమంత్రికి వెళ్లి ఏం ఫిర్యాదులు చేస్తున్నారో అర్ధంకాని పరిస్థితి. ఇదంతా అవసరమా? ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే పోయేది. అలా కాకుండా గోటితో పోయేది గొడ్డలివరకూ తెచ్చుకున్నట్లుంది. కానీ మేం ఇవన్నీ మా సార్‌కు చెప్పలేం కదా’ అని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఏపీకి సంబంధించిన సమస్యలపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కంటే, సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజే ప్రధాని, స్పీకర్, హోంమంత్రికి ఎక్కువ ఫిర్యాదులు చేశారని ఎంపీలు గుర్తు చేస్తున్నారు. ఆయన ఫిర్యాదులు ఇప్పటికీ ప్రివిలేజ్ కమిటీతోపాటు, జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు,సీబీఐలో పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు.
‘మేం ఏ కేంద్రమంత్రి దగ్గరకు వెళ్లినా మా కంటే ముందు రాజు ఇచ్చిన ఫిర్యాదులో, వినతిపత్రాలో ఉంటున్నాయి. వాళ్లు కూడా మాకంటే ఆయనకే ఎక్కువ సేపు సమయం ఇస్తున్నారు. అమిత్‌షా లాంటి మంత్రులయితే, మా పార్టీ ఎంపీలకు 5 నిమిషాల సమయం ఇస్తుంటే రాజుకు అరగంట సమయం ఇస్తున్నారు. దీన్నిబట్టి ఆయనను వెలివేయకుండా మా పార్టీ నాయకత్వం ఎంత తప్పుచేసిందో అర్ధమవుతోందని’ని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.
మతమార్పిళ్లు, పోలీసుల వేధింపు, అప్పులు, మత్తుమందులు, మానవహక్కుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుల కంటే, రఘరామకృష్ణంరాజు కేంద్రానికి ఇచ్చిన ఫిర్యాదులే ఎక్కువ అని ఆ ఎంపీ వివరించారు.
రాజును అలాగే వదిలేస్తే పార్టీని సాధ్యమయినంత వేగంగా అప్రతిష్ఠపాలుచేస్తారని వైసీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివర కు పార్టీ అధినేత బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కూడా, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడం, లేదా సస్పెండ్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోలేదంటే.. తమ అధినేత, ఎంపీ రాజుకు భయపడుతున్నారన్న తప్పుడు సంకేతాలు అటు పార్టీ శ్రేణుల్లోనూ వెళుతున్నాయని వాపోతున్నారు.
రోజూ ప్రెస్‌మీట్లు, చానెళ్లలో పార్టీకి-ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. ఆయనపై చర్య తీసుకోలేని నిస్సహాయత, ఇతర నేతలకు ఆదర్శంగా మారే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఈ విషయంలో తమ పార్టీ సీనియర్లు, సలహాదారులు జగన్‌ను తప్పుదోవపట్టిస్తున్నట్లుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎంపీ రాజును వెలివేయడాన్ని తమ నాయకత్వం ప్రతిష్ఠగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.
‘‘రోజూ పార్టీని, జగన్‌గారిని ప్రెస్‌మీట్లలో విమర్శిస్తున్న రాజును ఇప్పటిదాకా బహిష్కరించడమో, సస్పెండ్ చేయాల్సి ఉంది. కానీ ఆయనను సస్పెండ్ చేస్తే బీజేపీలో చేరతారని కొంతమంది జగన్‌సారుకు చెప్పినట్లుంది. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఎటు పోతే మాకెందుకు? సస్పెండ్ తర్వాత రాజు చేసే విమర్శలు, ఆరోపణలకు విలువ-ప్రాధాన్యం ఏమాత్రం ఉండదు. జనం పట్టించుకోరు. ఇప్పుడాయన పార్టీలో ఉన్నందుకే రాజు విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజు కూడా ప్రెస్‌మీట్లలో మా ప్రభుత్వం- మా పార్టీ అని చెబుతుంటే, సొంత పార్టీ ఎంపీనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న భావన ప్రజల్లో బలపడే ప్రమాదం ఉంది. అదే ఆయనను సస్పెండ్ చేస్తే ఇదే మీడియా ఆయనను పట్టించుకోదు. ఈ చిన్న లాజిక్‌ను మా సార్ దగ్గరుండే సీనియర్లు, సలహాదారులు ఎందుకు మిస్సయ్యారో ఆశ్చర్యంగా ఉంది. మాకు మాత్రం పార్లమెంటుకు వెళ్లినప్పుడల్లా రాజు విమర్శలు వింటే చూస్తే కడుపుమండుతోంది. మాపాటి కోపం నాయకత్వానికి లేకపోవడమే ఆశ్చర్యంగా ఉంద’ని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.
ఒకవేళ తమ పార్టీ సస్పెండ్ చేస్తే, రాజు బీజేపీలో చేరినా ఏం సాధిస్తారని మరికొందరు ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఎంత బలం ఉందో తెలిసి కూడా, ఎంపీ రాజుకు జగన్ భయపడటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. గతంలో టీడీపీపై తిరుగుబాటు చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని సస్పెండ్ చేసిన తర్వాత, అదే మీడియా ఆమెకు ప్రాధాన్యం ఇవ్వని విషయాన్ని ఎంపీలు గుర్తు చేస్తున్నారు. టీడీపీలో దేవేంద్‌గౌడ్, మోత్కుపల్లి, టీఆర్‌ఎస్‌లో విజయశాంతి, నరేంద్ర కూడా ఇదేవిధంగా తిరుగుబాటు చేసినప్పడు మీడియా ప్రాధాన్యం ఇచ్చిందని, వారు ఇతర పార్టీల్లో చేరినప్పుడు ఎవరూ పట్టించుకోని విషయాన్ని ఓ ఎంపీ ఉదహరించారు. టీడీపీ నుంచి తమ పార్టీలో చేరిన తర్వాత, వల్లభనేని వంశీ టీడీపీని ఎన్ని తిట్టినా దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని గుర్తు చేశారు.
‘మా నాయకత్వం అనుకున్నట్లు ఎంపీ రాజు రేపు బీజేపీ నుంచి పోటీ చేశారే అనుకుందాం. నర్సాపురం నియోజకవర్గంలో బీజేపీకి ఏం బలం ఉంది? మొన్నటి ఎన్నికల్లో చూశాం కదా? పోటీ మాకూ-టీడీపీ మధ్యనే ఉంటుంది. పైగా రాజు ఆ నియోజకవర్గానికి వెళ్లి చాలాకాలమయింది. అక్కడ బీజేపీకి క్యాడర్ లేదు. టీడీపీ,జనసేన తర్వాత స్థానమే దానిది. అన్ని ఎన్నికల్లోనూ మా పార్టీనే గెలిచింది. నర్సాపురం పార్లమెంటు పరిథిలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాలన్నీ మా పార్టీనే గెలిచింది. రాజు ప్రమేయం లేకుండానే మేం అన్ని ఎన్నికల్లో విజయం సాధించాం. అలాంటి పార్టీ నుంచి పోటీ చేసే రాజు గురించి మా నాయకత్వం ఎందుకు భయపడుతోందో మాకు అర్ధం కావడం లేదు. సీఎం గారిని, పార్టీని ఆయనరోజూ తిడుతున్నా చర్యలు తీసుకోవడం లేదంటే.. బహుశా ఎంపీ రాజు, మా సీఎం కంటే బలంగా ఉన్నట్లు, జగన్ కంటే రాజుకే ఎక్కువ ఇమేజ్ ఉన్నట్లు మా పార్టీ సీనియర్లు, సలహాదారులు భావిస్తున్నట్లున్నార’ని ఓ మంత్రి వ్యాఖ్యానించారు.
కాగా రాజును పార్టీ నుంచి వెలివేసే బదులు, రోజూ ఆయనను తమతో తిట్టించడం.. అందుకు రాజు తిరిగి మమ్మల్ని కాకుండా, జగన్‌ను తిట్టడం తమకే సిగ్గుగా ఉందని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. అనవసరంగా తామే సీఎంను రాజుతో తిట్టిస్తున్నట్లుందని చెబుతున్నారు. ఇది ఆయనకు జనంలో సానుభూతి పెంచే ప్రమాదానికి తీసుకువెళుతోందంటున్నారు. నర్సాపురం నియోజకవర్గంలో ఇప్పుడు రాజు పక్కన ఒక్క వైసీపీ నేత కూడా లేరని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఇదే తగిన సమయని చెబుతున్నారు. రాజుపై వేటు లేటు చేసే కొద్దీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్ష త్రియ సామాజికవర్గం వైసీపీకి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని, కాపు సామాజికవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రాజుపై పోలీసు వేధింపు తర్వాత క్షత్రియుల్లో అసంతృప్తి పెరిగిందని గుర్తు చేస్తున్నారు.
‘రాజులు మిగిలిన కులాల మాదిరిగా వెంటనే రోడ్డెక్కడం గానీ, ప్రెస్‌మీట్లు పెట్టడం గానీ చేయరు. సమయం వచ్చినప్పుడు అంతా కలసిపోతారు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఎవరూ మా పార్టీకి వ్యతిరేకంగా ముందుకురారు. రేపు ఎన్నికలొస్తే అంతా ఒకటవుతారు. దానివల్ల కాపులకూ ప్రమాదం. అందువల్ల రాజును ఇప్పుడు బహిష్కరిస్తేనే మంచిది. మా దగ్గర బీజేపీకి ఏమాత్రం బలం లేదు. కొద్దో గొప్ప పేరున్న గోకరాజు కుటుంబం కూడా మా పార్టీలోనే చేరింది. ఇక రాజు ఆ పార్టీలో చేరి సాధించేది కూడా ఏమీ ఉండదు. మా నాయకత్వం, జగన్‌గారికి సలహాలిచ్చే వారు రాజును భూతద్దంలో చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ గారు రాజుకు భయపడుతున్నందునే, ఆయనను బహిష్కరించడతం లేదన్న అభిప్రాయం మా దగ్గర బాగా బలంగా ఉంది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు పెడితే వైసీపీ అభ్యర్ధి ఎవరయినా సరే, లక్ష మెజారిటీతో సులభంగా గెలుస్తారు. మొన్న లోకల్‌బాడీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్ధులు, రాజు సాయం లేకపోయినా గెలిచాం కదా’ అని నర్సాపురం లోక్‌సభ పరిథిలోని ఓ వైసీపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు.
దీన్నిబట్టి..ఎంపీ రాజుపై వేటు అంశంలో, వైసీపీ నాయకత్వ ఆలోచనలకు – నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిథిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల వాదన మధ్య భిన్నాభియ్రాలున్నట్లు స్పష్టమవుతోంది.

LEAVE A RESPONSE