Suryaa.co.in

Editorial

కురు సభను మించి.. కొండపై కొలువుదీరిన కొత్త బోర్డు

రోజుకు రెండువేలమంది టికెట్లు కొత్త సభ్యులకే
– ఇక కొండపై భక్తులకు రూములు కష్టమే
– టీటీడీ బోర్డు మీటింగు రూము నుంచి హాలుకు
– వెంకన్న ప్రతిష్ఠ పెంచిన జగనన్న
( మార్తి సుబ్రహ్మణ్యం)
హమ్మయ్య.. గండం గడిచి పిండం బయటపడినట్లు.. ఎట్టకేలకు పాలకప్రభువులు టీటీడీ బోర్డు సభ్యులను ప్రకటించి, వెంకన్న భక్తుల జీవితాలను చరితార్ధం చేశారు. ‘కేవలం 82 మంది సభ్యులను మాత్రమే’ బోర్డులో నియమించడం ద్వారా.. ఏపీ ఏలిక జగనన్న, హిందుమతంపై తనకున్న ‘అపార భక్తి ప్రపత్తులను’ ప్రకటించుకున్నారు. అంతేకాదు. వెంకన్న ప్రతిష్ఠను జగనన్న హిమాలయమంత ఎత్తుకు పెంచారు. దానితో ఇప్పటివరకూ ఎవరూ ‘తన ప్రతిష్ఠను ఇంతబాగా పెంచనందుకు’, అటు వెంకన్న కూడా మురిసిముక్కలయ్యారు. ఇప్పుడు జగనన్న చేసిన ప్రతిసృష్టికి ‘కురుసభ’ కూడా కుళ్లుకుంటోంది మరి! ఇకపై అఖిలాండకోటి వెంకన్న భక్తులు, అనన్యసామాన్యం..అద్భుతం.. అనితరసాధ్యం.. అపూర్వమైన బోర్డును దర్శించి తమ జీవితాలను ధన్యం చేసుకోనున్నారు. వెంకన్న దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇకపై.. ఆ కురుసభను మించిన, బోర్డు రూమును కూడా దర్శించుకునే మహద్భాగ్యం కలగనుంది. శుభమస్తు! బోర్డు రూము దర్శనప్రాప్తిరస్తు!!భారతదేశం నలుమూలల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఢిల్లీలో కేంద్రమంత్రులపై ఒత్తిళ్లు తెచ్చినా.. దేవెగౌడ వంటి మాజీ ప్రధానులు ఓ డెభ్భైసార్లు ఫోన్లు చేసినా తీయకుండా… ఆంధ్రా-తెలంగాణ లో తాను ముచ్చటపడ్డ పారిశ్రామికవేత్తలు, సర్కారీ స్వాములు ఎన్ని సిఫార్సులు పంపినా… తనతోపాటు కేసులతో సహజీవనం చేసిన వారెంత మొహమాటాలు పెట్టినా… ఎక్కడా లొంగకుండా.. ఏమీ చలించకుండా ‘కేవలం 82 మందిని మాత్రమే’ వడపోయడం ఒక్క జగనన్నకే చెల్లింది. సరే.. ‘‘జగన్ హిందువయితే వెంకన్న ప్రతిష్ఠ, బోర్డు విలువ తెలిసేది. కాదు కాబట్టే అంతమందిని బోర్డులో వేశారం’’టూ సొంత పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్ని ఎకసెక్కాలాడినా.. ‘‘ఇదేం బోర్డు? వాళ్లేం సభ్యులం’’టూ విపక్షాలు వెటకారాలాడినా.. జగనన్న కచ్చితంగా వెంకన్న ప్రతిష్ఠ పెంచారు. దట్సాల్!
టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన చాలాకాలం తర్వాత, ఎట్టకేలకు పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుకావడం సంతోషమే. అప్పట్లో కురుసభ వందమందితో కళకళలాడేది. ఇప్పుడు ఆ కురుసభ కూడా కుళ్లుకునేలా.. టీటీడీ బోర్డు సృష్టించిన జగనన్న, కచ్చితంగా మయసభ నిర్మించిన మరో మయుడు కిందే లెక్క. మొన్నటి వరకూ బోర్డు మీటింగు, కేవలం 28 మంది మాత్రమే పట్టే అన్నమయ్యభవన్‌లో జరిగేవి. ఇప్పుడు సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు, అధికారులు, వారి పీఎస్‌లతో కలిపి వందదాటింది. అంతా లెక్కిస్తే 104 మంది వరకూ బోర్డులో కొలువు దీరతారన్నది ఒక అంచనా. కాదంటే ‘కామందుల వారే’ లెక్కలు సెలవివ్వాలి.
ఇక టీటీడీ బోర్డు కొత్త సభ్యుల నియామకం వెనుక జరిగాయంటున్న పైరవీలు, మిగిలిన వ్యవహారాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, వెంకన్న-భక్తుల ఆరోగ్యానికి అంత మంచిది. వైసీపీ ఎంపీలే స్వయంగా కేంద్రమంత్రుల వద్దకు వెళ్లి సిఫార్సు లేఖలిస్తే, దానినే మహాప్రసాదంగా భావిస్తామని ప్రార్ధించారట. దానికి ఏనుగు అంబారీ ఎక్కినంత సంబరపడ్డ కేంద్రమంత్రులు వెంటనే సిపార్సు లేఖలిచ్చారట. కానీ, ఆ విషయం బీజేపీలో ఏజెంట్ గోపీలు కమలదళపతి ముందుపెట్టేసి, ఇలాంటి పనుల వల్ల పార్టీ పరువుపోతోందని వాపోయారట. దానితో నద్దా సాబ్ కూడా ఈ అడ్డదారి వ్యవహారంపై ఆరా తీస్తే, ఆ విధంగా 36 మంది కేంద్రమంత్రులు మన వైసీపీ ఎంపీలకు లేఖలిచ్చినట్లు తేలిందట.
అందులో రాధాకృష్ణన్ అనే ఒక్క మహానుభావుడికే, ఏకంగా 9 మంది కేంద్రమంత్రులు సిఫార్సు చేశారట. సదరు రాధాకృష్ణన్ పెద్ద పదవుల్లో ఉన్న వారికి.. శారీరకంగా-మానసికంగా ఎలాంటి కష్టం వచ్చినా, వెంటనే ఆయా రంగాల్లో ఉన్న నిష్ణాతులని రంగంలోకి దించి, వాటిని తీర్చే ఏర్పాట్లు చేయడంలో నిష్ణాతుడట. ఎవరి ప్రతిభ వారిది. అందుకే తమ మనసెరిగి మసులుకునే రాధాకృష్ణన్ పేరు, 9 మంది రికమండ్ చేయడంలో పెద్ద హాశ్చర్యమేమీ లేదు. కాదు కూడా! ఈ రికమండేషన్ గుట్టు కూడా రట్టవడంతో కేంద్రమంత్రి షెకావత్ నాలిక్కరుచుకున్నారు. అసలా రాధాకృష్ణన్ అనేవాడెవడో తనకు తెలియకుండా, పొరపాటున లేఖ ఇచ్చాను. అదంతా తూచ్ అని చివరాఖరకు సెలవిచ్చారు. ఇలాంటి అద్భుతాలన్నీ కొంచెం కష్టపడి పరిశోధిస్తే, కొత్త బోర్డులో బోలెడు తెలుస్తాయి.
కొత్త బోర్డులో మంత్రుల కంటే పవర్‌ఫుల్‌పర్సన్లు కూడా ఉన్నారన్నది మరో కొత్త విషయం. రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చేస్తానని స్వయంగా జగన్ ప్రకటించారు. ఆ ప్రకారంగా నవంబర్‌లో ప్రక్షాళన జరుగుతుందన్నది పార్టీవర్గాల టాక్. అలాంటిది.. టీటీడీ బోర్డులో ఉన్న పాత మెంబర్లే మళ్లీ కొనసాగించారంటే.. సదరు మహానుభావులంతా తీసేయబోయే మంత్రుల కంటే గొప్పన్నట్లే కదా?
ఇక టీటీడీ సభ్యుల్లో చాలామంది కొత్త ముఖాలయినా.. పోలీసులు, కోర్టులకు మాత్రం చాలా పాత బంధువులేనట. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ సారు జగన్ కేసులో సహనిందితుడే. హెటిరో అధినేత పార్ధసారథి కూడా జగన్ కేసులో ఉన్న పెద్దమనిషే. జగన్గురువు-జగద్గురువైన స్వామి వారు సిఫార్సు చేసిన, బూదాటి లక్ష్మీనారాయణపై రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కేసులున్నాయట. ఎంఎస్‌ఎస్ ల్యాబ్ ఫార్మా కంపెనీ మన్నె జీవన్‌రెడ్డికి, సాయిరెడ్డిగారి అల్లుడి కంపెనీతో అనుబంధం ఉందట. కాప్రి గ్లోబల్, ఎల్‌ఐసి హౌసింగ్ స్కాంలో ఉన్న రాజేష్‌శర్మ సీబీఐ వారికి సుపరిచితుడేనట. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ కేతన్‌దేశాయ్, ఎంసిఐలో ఉండగా అరెస్టయిన పుణ్యపురుషుడేనట.
ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌పై, ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే కేవలం రెండంటే రెండే క్రిమినల్ కేసులున్నాయట.
2018లో పీఎంఓ ఆదేశాలతో.. రైల్వే విజిలెన్స్ సీబీఐ విచారణ కోరిన, తమిళనాడు కన్నయ్య అనే చిట్టితండ్రిపై 1500 కోట్ల అక్రమ ఆస్తులున్నట్లు అభియోగాలున్నాయి. ఆ మహనీయుడు చైర్మన్‌గా రైల్వే సొసైటీకి సంబంధించి, కేవలం 108 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయట. లేటెస్ట్ నిజాయితీపరులయిన సీఎం జాబితాలో ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్, ఈ మహనీయుడి పేరు సిఫార్సు చేశారట. ఇక బీజేపీ జాతీయ నేత, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప మనుమడు శశిధర్, బెంగళూరులో జగన్ ఉన్న నివాసం ఇలాకాలోని బీజేపీ యలహంక ఎమ్మెల్యే విశ్వనాధరెడ్డి, మహారాష్ట్ర ఉద్ధవ్ ధాక్రే సన్నిహితుడయిన మిలింద్, అప్పుల్లో ఉన్న ఆంధ్రాను ఆదుకుంటున్న ఓ కేంద్రమంత్రి సిఫార్సు చేసిన ఎస్.శంకర్, కేసీఆర్ సిఫార్సు చేసిన మురంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు.. ఇలాంటి పులుకడిగిన పుణ్యపురుషులు, ఆణిముత్యాలు, జాతిరత్నాలన్నీ ఒకేచోట కొలువుదీరనున్న ఆ చూడముచ్చటయిన దృశ్యాలు చూడనివారు పాపాత్ముల కిందే లెక్క. ఎటొచ్చీ శేఖర్‌రెడ్డి అనే మరో పాత పుణ్యపురుషుడు లేకపోవడమే, బోర్డులో కనిపించే లోటు. మొత్తం 25 మంది అసలు బోర్డులో పదిమంది పారిశ్రామికవేత్తలే కాబట్టి, వారితో స్వామివారికొచ్చిన ప్రమాదమేమీ ఉండదు.
సరే.. మంచో చెడో టీటీడీకి బోర్డు వేశారు కాబట్టి, ఇక వారి గుణగణాల గురించి చర్చించుకోవడం వృధా ప్రయాస. అంతా బాగానే ఉంది. కానీ ఈ 104 లేదా 102 మంది సభ్యులు-అధికారులంతా, ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారన్నది ప్రశ్న. ఇప్పుడు అన్నమయ్యభవన్‌లో ఉన్న బోర్డు హాలు రూము, 28 మందికి మాత్రమే సరిపోతుంది. సో.. ఇప్పటి పరిస్థితుల ప్రకారం.. అన్నదాన భవనం పైనున్న హాల్‌లో, బోర్డు మీటింగు పెడతారట. పోనీ.. ఇంకాస్త వెసులుబాటు కోసం, పైనున్న కల్యాణమండపంలో పెడితే, బోర్డులో ఉన్న పొలిటీయషన్లకూ ఒక కార్యకర్తల సమావేశానికొచ్చినంత ఫీలింగ్ ఉంటుంది కదా?
కొండపై కొలువుదీరే వీరికి దర్శనాల కోటా ఒకటుంది కదా?! ఆ ప్రకారంగా 82 మంది సభ్యులు ఎంచక్కా రోజుకు రెండువేల మందిని దర్శనానికి సిఫార్సు చేయవచ్చన్నమాట. సరే..ఎలాగూ ఈఓ, జేఈఓ, విజిలెన్స్, చైర్మన్ విచక్షణాధికార కోటాలు, మరో వెయ్యి వరకూ ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలకు రోజుకు రెండొందల చొప్పున 300 రూపాయల టికెట్లు, మరో 20 ఇతర సౌకర్యాలున్న టికెట్లు ఇస్తున్నారన్నది బయట వినిపించే ప్రచారం. పాపం పిచ్చి భక్తులకు మాత్రం, ఆన్‌లైన్‌లో రోజుకు ఐదువేల మందికి మాత్రమే దర్శనభాగ్యమట. నిమిషానికి 160 మంది భక్తులను మహాలఘుదర్శనంలో అనుమతించే అధికారులు..జెఈఓల విచక్షణాధికారంతో, వీఐపీలను నేరుగా పంపించే ‘నో వెయిటింగ్’ కోటాకు లెక్కనే ఉండదు. వీఐపీలకు అదొక అదనపు వెసులుబాటు. ఎటొచ్చీ పాపం సామాన్య భక్తులకే, ఏడాదిన్నర నుంచి సాధారణ దర్శనాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం తిరుమలలో 30 వేల మంది భక్తులొస్తే, అందులో బుద్ధిగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకుని వచ్చే వారి సంఖ్య కేవలం 5 వేలు మాత్రమే. మరి మిగిలిన 25 వేలమంది ఏ మార్గంలో..ఎలా దర్శనం చేసుకోగలుగుతున్నారని ప్రశ్నించే వారు అమాయకులకిందే లెక్క.
ఆ ప్రకారంగా ఇప్పుడు బోర్డు మెంబర్లయిపోయిన వారంతా చేసే సిఫార్సు వల్ల, సుమారు 2 వేల రూములు వారికే దఖలు పడినట్లు లెక్క. ఇహ మిగిలిన భక్తులకు రూములెక్కడ దొరుకుతాయని ప్రశ్నించిన వారికి వెంకన్నే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం స్వామి వారు కూడా తన చుట్టూ జరుగుతున్న అత్యద్భుతాలు చూసి, ఇంకా తేరుకున్నట్లు లేదు. ఆయన తేరుకున్న తర్వాతయినా, భక్తులకు ఒక దారి చూపిస్తారేమో చూడాలి!

LEAVE A RESPONSE