Suryaa.co.in

Political News

టీడీపీ గ్రాఫ్ పైకా….కిందికా!?

2019 ఎన్నికల్లో కుదేలై పోయి….,రాష్ట్రాధికారాన్ని వైసీపీ కి అప్పగించేసిన తరువాత; టీడీపీ మళ్లీ ఇప్పుడు కోలుకుంటున్నది. కాలూ, చెయ్యీ కూడదీసుకుంటున్న వాతావరణం కనిపిస్తున్నది. నోరు పెగులుతున్నది. నారా లోకేష్ ను ముందు పెట్టి, చంద్రబాబు నాయుడు వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారనే భావం రాజకీయ వర్గాల్లో ఉంది.
డ్రైవింగ్ స్కూల్ వాళ్లు- స్టీరింగ్ చక్రం ముందు మనల్ని కూర్చోబెట్టి, లీవర్స్ వారి చేతిలో పెట్టుకుని, మనకు డ్రైవింగ్ నేర్పిస్తారు. కారు ను మనమే నడుపుతున్న అనుభూతికి లోనవుతుంటాము. అలా, టీడీపీ డ్రైవింగ్ సీట్లో లోకేష్ ను కూర్చోబెట్టి…లీవర్స్ అన్నీ చంద్రబాబు పట్టుకుని, టీడీపి ని నడిపిస్తున్నారు. తప్పు ఏమీ లేదు. తప్పు పట్టవలసింది కూడా ఏమీ లేదు. టీడీపీ శ్రేణులు సైతం లోకేష్ ను ముందు పెట్టుకుని -వైసీపీ పై యుద్ధానికి బయలు దేరుతున్నాయి. రాష్ట్రం లో ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలిగినా…; లోకేష్ బయలుదేరుతున్నారు…., వారిని పరామర్శించడానికి. ఇందులోనూ తప్పు పట్టవలసింది ఏమీ లేదు. ప్రతిపక్షం లో ఉన్న తెలుగు దేశం పార్టీ విధుల్లో -అది కూడా ఒకటి. బాధితుల్ని పరామర్శించడం….వారికి న్యాయం జరిగేవరకు నిద్రపోము అని చెప్పడం సహజం. ఈ ప్రతిపక్ష ‘పోరాటానికి’ – వెనుక నుంచి మద్దతు ఇచ్చే న్యూస్ చానెల్స్ ఇస్తున్నాయి. అవసరమైన దానికంటే పది,పదిహేను రెట్లు ఎక్కువగా పోలీసులను మోహరింప చేసి, వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీ పోరాటాలకు బాగా సాయం పడుతున్నది. వీటన్నింటి వల్ల, టీడీపీ బాగా పుంజుకున్నదనే భావం వ్యాప్తి చెందింది అనడానికి రాష్ట్రంలో గట్టి ప్రయత్నం జరుగుతోంది అనిపిస్తున్నది.
నిజంగానే టీడీపీ పుంజుకుందా?
ఇంకో రెండు…రెండున్నర ఏళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో- వైసీపీ ని సవాలు చేసే స్థితికి టీడీపీ సమాయత్తం అవుతున్నదా? అయితే, ఇక్కడో విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
ఓటర్ల లో 99 శాతం మంది సైలెంట్ ఓటర్లే. వారు మాట్లాడరు. పేపర్ చదవరు. టీవీ ల్లో డిబేట్స్ చూడరు. వాదోపవాదాల్లో తల దూర్చరు. దేనికీ రియాక్ట్ అవ్వరు. ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల తమకు ఎదురైన అనుభవాలు, భావనలతో వారు ఒక అభిప్రాయానికి వస్తారు. దీనిని పెర్సెప్షన్ అంటారు. పోలింగ్ సమయంలో…సైలెంట్ గా… పోలింగ్ బూత్ కు వెళ్లి, ఓటు వేసేసి ఇంటికెళ్లి పోతారు.
ఆ మిగిలిన ఒక్క శాతం మందే…. పేపర్లు చదువుతారు. టీవీ డిబేట్లు చూస్తారు.వాటిల్లో బల్లలు గుద్ది వాదిస్తారు. ప్రభుత్వ మంచి చెడ్డలపై గొంతులు చించుకుంటారు. ప్రభుత్వ తీరు తెన్నులపై తీవ్రంగా స్పందిస్తారు. సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడతారు. అల్లరల్లరి చేస్తారు.వీటివల్ల వచ్చిన మైలేజ్ -‘సూపర్’ అనుకుంటారు.
టీడీపీ ఈ ఒక్క శాతం మంది ‘ ఒపీనియన్ మేకర్స్’ పై ఆధారపడుతున్నదా అనిపిస్తున్నది, చూసేవారికి.
వైసీపీ మాత్రం ఈ ఒక్క శాతం ‘ఒపీనియన్ మేకర్స్’ ను పూర్తి గా వదిలేసి, మిగిలిన 99 శాతం మంది ‘సైలెంట్ ఓటర్స్’ పై ఆధార పడుతుంది. అందుకే- టీవీ డిబేట్స్ ను, పేపర్స్ ను, విమర్శకులను, ధర్నాలను, చంద్రబాబు నాయుడు లను, నారా లోకేష్ లను, వర్ల రామయ్యలను సీపీఐ రామకృష్ణలను పట్టించుకోవడం మానేసింది.
ఆ 99 శాతం మందిలో నిరుపేదలు ఉన్నారు. రెక్కాడితే గానీ….డొక్కాడని బడుగులు ఉన్నారు. పూట గడవని గ్రామీణులున్నారు. నోరూ…వాయి లేని అభాగ్యులున్నారు. ఏదో ఒక పథకం పేరుతో జగన్ ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలలో జమ చేసే నగదు తో -తాత్కాలికం గా అయినా ఏదో ఒక మేరకు సేద తీరుతున్నారు. అదే మహాప్రసాదం అన్నట్టుగా- ‘జయహో …జగన్’ అంటున్నారు. అటువంటి వారే-తమకు శ్రీరామ రక్ష అని వైసీపీ భావిస్తున్నది. మరి ,ఆ వర్గాలను టీడీపీ చేరుకుంటున్నదా? వైసీపీ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని చెబుతున్నదా? వైసీపీ కంటే టీడీపీ ఏ విధంగా మంచిదో వివరిస్తున్నదా? టీడీపీ కి ఓట్ వేస్తే- ముఖ్యమంత్రి ఎవరో చెబుతున్నదా? ఇటువంటివే సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా…టీడీపీ పుంజుకుంది…పుంజుకుంది అనే ప్రచారం వల్ల- టీడీపీ కి పోలింగ్ సమయంలో వచ్చే లాభం గానీ, వైసీపీ కి వచ్చే నష్టం గానీ కనపడడం లేదు….; ఓ పది,పదిహేను పైసలు అటు ఇటు తప్పించి.
వైసీపీ కి 150 మంది శాసనసభ్యులు ఉన్నారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయి, మరో 60 స్థానాలు కోల్పోయినా, ఇబ్బంది లేదు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుంది. నిజానికి, వైసీపీ గ్రాఫ్ కొంత తగ్గింది అనడం లో అనుమానం లేదు. కానీ, ఆ మేరకు టీడీపీ గ్రాఫ్ పెరగలేదు అని టీడీపీ నాయకులు కొందరు గట్టిగా అభిప్రాయ పడుతున్నారు కూడా. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ ఎం.ఎల్.ఏ గా ఉన్న బుచ్చయ్య చౌదరి కూడా అదే భయం తో రాజకీయాలకు స్వస్తి చెబుదామనుకున్నారు. ఇప్పుడు నడుస్తున్న పద్ధతుల్లో పార్టీ నడిస్తే, 2024 ఎన్నికల్లో- పార్టీ సత్ఫలితాలు సాధించలేదని ఆయన బలంగా నమ్ముతున్నారు. పార్టీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి వీసమెత్తు మారలేదన్నది ఆయన అభిప్రాయం. ‘ఆత్మ స్తుతి-పరనింద’ తో పని జరగదు.
‘ఎందుకని’ అనే విషయాన్ని టీడీపీ అధ్యయనం చేసుకోవాలి. వైసీపీ కారెక్టర్ ను విశ్లేషించుకోవాలి. అర్ధం చేసుకోవాలి .తగిన విరుగుడు చర్యలు చేపట్టాలి. ఇది టీడీపీ లో జరుగుతున్న సూచనలు లేవు. వైసీపీ పైనా; ప్రభుత్వం పైనా టీడీపీ నేతల విమర్శల తీరు చూస్తుంటే- ‘పాత చింతకాయ’ పద్ధతుల్లోనే ఆ పార్టీ రాజకీయం కొనసాగుతున్నట్టు కనబడుతున్నది.ఒక ముక్కలో చెప్పాలి అంటే- వైసీపీ ది ‘కొత్త’ రాజకీయం- టీడీపీ ది పాత విమర్శల సరళి.
నిజానికి, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై టీడీపీ కొంత ఆశలు పెట్టుకున్నట్టు కనపడింది. బెయిల్ రద్దయ్యి, జగన్ జైల్ కు వెడితే, రాజకీయ చక్రం తిప్పడం బాగా సులువవుతుందనే భావం టీడీపీ వర్గాల్లో కనిపించింది. మూడు నాలుగు ముక్కలుగా వైసీపీ చీలిపోతుందని; దీనితో ఆ పార్టీ ని తేలికగా హ్యాండిల్ చేయవచ్చునన్న ఆశావహులు కూడా టీడీపీ లో కనిపించారు. నిజానికి, బెయిల్ రద్దు అనేది మూడంచెల పోరాటం. మొదటి అంచెలో జగన్ గెలిచారు. ఇప్పుడు తెలంగాణ హై కోర్టు కు మారుతోంది.ఇది సెకండ్ రౌండ్. ఆ తరువాత సుప్రీమ్ కోర్టు ఉన్నదని రఘురామరాజు ఇప్పటికే ప్రకటించారు.
ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలకు పైగా సమయం ఉంది. ఇప్పటికైతే, వైసీపీ గ్రాఫ్ తగ్గినట్టు కనబడుతున్నది.ఇటీవల నేను కొన్ని గ్రామాలలో తిరిగి చూసినప్పుడు- వైసీపీ ని దూషిస్తున్నవారే తప్ప; అనుకూలంగా మాట్లాడిన వారు కనిపించ లేదు. గానీ….; కానీ, వైసీపీ గ్రాఫ్ తగ్గిందో- లేదో తెలుసుకునే మార్గం అయితే లేదు.
‘ఫాల్స్ ప్రెస్టిజ్ ‘ ను పక్కన బెట్టి, ..తమ గ్రాఫ్ పెరిగిందో లేదో టీడీపీ నేతలు నిజాయతీగా అధ్యయనం చేసుకుని, అడుగు ముందుకు వేయక పోతే….!
చెప్పేదేముంది!?

భోగాది వేంకట రాయుడు
bhogadirayudu2152@gmail.com

LEAVE A RESPONSE