Suryaa.co.in

Devotional

విశేష యాత్రలు

ఏ ఆలయానికి వెళ్ళినా, ముందు శిఖర దర్శనం చేయాలి. తర్వాత ధ్వజ స్తంభం, స్వామి వాహన దర్శనం చేయాలి. వారి అనుజ్ఞతో మూల విరాట్ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి దర్శనం ఇతర దేవతాదర్శనం చేయాలి. గంగాస్నానం చేసిన వారు గంగ నీటిని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. కాని గంగ మట్టిని మాత్రం ఇంటికి తీసుకు వెళ్ళరాదు అని శాస్త్రం చెబుతోంది.

కాశీ మహాస్మశానం కనుక ఆ మట్టి నిషిద్ధం అయి ఉంటుంది. మణికర్ణిక ఘాట్ లో రోజూ మధ్యాహ్నం 12-1గంటల మధ్య విధిగా స్నానం చేయాలి. ఆ సమయంలో సకల దేవతలు ఆ ఘాట్లో ఉంటారని పురాణ వచనం. పితృకార్యం చేసేటప్పుడు శిరోముండనం మగవారికి తప్పనిసరి. ప్రయాగ క్షేత్రంలో ముత్తైదువులు మాత్రమే వేణీదానం చేయాలి అంటే ఒక్క మూడంగులాల జుట్టు మాత్రమే తీయించుకోవాలి. ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్కసారి మాత్రమే వేణీదానం చేయాలి. ప్రతీసారీ చేయరాదు.

ఆయతన యాత్ర
నంది పురాణంలో ఈ యాత్ర గురించి ఉంది. మణికర్ణికలో స్నానం చేసి, విశ్వేశ్వర దర్శనం చేసి పూజించాలి. మళ్ళీ మణికర్ణికలోనే ఉన్న చక్రతీర్ధం లో, అంటే మణికర్ణికా కుండంలో స్నానం చేయాలి. మళ్ళీ విశ్వనాధ దర్శనం చేయటాన్ని ఆయతనయాత్ర అంటారు. ఇలా చేస్తే బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది. ద్వి ఆయతన ప్రాప్తి అంటే, పైన చెప్పినవి రెండేసి సార్లు చెయ్యటమే.

త్రిరాయతన, చతురాయతన, పంచాయతన యాత్ర
అవి ముక్తేశ్వర, స్వర్లీనేశ్వర,మధ్యమేశ్వర లింగాలను మూడింటిని దర్శించి, పూజించటమే ఈ యాత్ర. శైలేశ్వర, సంగమేశ్వర, స్వర్లీనేశ్వర, మధ్యమేశ్వర లింగాలను నాలుగింటిని దర్శించటమే అది.ఈ రెండు యాత్రాల్ని లింగపురాణం చెప్పింది. కృత్తివాశేశ్వర మధ్యమేశ్వర, ఓంకారేశ్వర, కపర్దీశ్వర, విశ్వేశ్వర లింగ దర్శనమే, పంచాయతన యాత్ర. ఈ యాత్రలన్నీ సర్వసిద్ధిప్రదం.

ఋతు యాత్ర
వసంత ఋతువు అంటే చైత్ర-వైశాఖ మాసాలలో, చౌక్ ఘాట్ లో ఉన్న మధురాపురి యాత్ర చేయాలి. దీన్నే అలయర్‌పురా అంటారు. ఇది ఉత్తరార్క్ నుండి, వరుణా తీరం మార్గంలో ఉంది.
గ్రీష్మ ఋతువులో అంటే, జ్యేష్ట ,ఆషాఢ మాసాలలో, అయోధ్యా పూరీ యాత్ర చేయాలి. పంచక్రోశ యాత్రలో కనిపించే రామేశ్వరమే ఇది.
వర్ష‌ఋతువులో అంటే శ్రావణ-భాద్రపద మాసాలలో, సంఖూ దారా వద్ద ఉన్న, ద్వారకాపూరీ యాత్ర, చేయాలి.
శరదృతువులో అంటే, ఆశ్వయుజ కార్తిక మాసాలలో, – పంచ గంగా ప్రాంతంలోనీ పంచగంగా స్నానం చేయటాన్ని, కాంచీ పూరీ యాత్ర అంటారు.
హేమంత ఋతువు అంటే, మార్గ శిర-పుష్య మాసాలలో, అవంతికా పుర యాత్ర చేయాలి. ఇది వృద్ధ కాళేశ్వరం నుండి, కృత్తివాసేశ్వరుని వరకు ప్రయాణం చేసి దర్శించటమే.
శిశిర రుతువు – అంటే మాఘ-ఫాల్గుణ మాసాలలో, మాయా పూరీ యాత్ర చేయాలి. ఇది అస్సీ సంగమంలో ఉంది.
చివరలో లలితా ఘాట్ లో స్నానం. అంటే ఒకే ఏడాదిలో ఈ ఋతు దర్శనాన్ని ముగించాలి. దీనికే ‘’సప్తరి యాత్ర ‘’అని కూడా అంటారు

మాస యాత్ర
చైత్రమాసంలో కామకుండంలో స్నానించి, కామేశ్వర పూజ చేయాలి. ఇప్పుడిది లేదు. వైశాఖంలో విమలకుండస్నానం విమలేశ్వర పూజా. ఇదీ ఇప్పుడు అలభ్యo. జ్యేష్టం లో రుద్రావాస తీర్ధ స్నానం, రుద్రా వాసేశ్వర పూజ, రుద్రా వాసేశ్వరుడిని దశాశ్వమేధ ఘాట్ లో దర్శించవచ్చు. ఈ మూడు నెలల్లో ముప్పది మూడు కోట్ల దేవతలు స్నానం చేశారని, పురాణ లిఖితం. ఆషాఢంలో లక్ష్మీ కుండ స్నానం, లక్ష్మీ దేవి దర్శనం, గంధర్వులు పదే పదే చేసే యాత్ర ఇది.

శ్రావణం లో కామాక్షీ కుండస్నానం, కామాక్షీ దేవి దర్శనం. భాద్రపదంలో కపాల విమోచన తీర్ధ స్నానం కుల స్తంభ దర్శనం. ఇది కిన్నరులు ఎక్కువగా ఇష్టపడే యాత్ర . ఆశ్వయుజ మాసంలో మార్కండేయ తీర్ధస్నానం మార్కండేయేశ్వర దర్శనం. జ్ఞానవాపి దగ్గర ఉంది. కార్తీకం లో పంచగంగా ఘాట్ స్నానం, బిందుమాధవ దర్శనం. మార్గశిరంలో పిశాచ విమోచన తీర్ధ స్నానం, కపర్దీశ్వర స్వామి దర్శనం.
విద్యాధరులకీ యాత్ర మహాప్రీతి. పుష్యంలో ధనదకుండ స్నానం, ధనదేశ్వర దర్శనం, దేవతలకు ఇష్టమైన యాత్ర ఇది. ఇప్పుడీ కుండం లేదు. ధనదేశ్వరుడు అన్నపూర్ణా మందిరంలో ఒక మూల ఉంటాడు. మాఘంలో కోటి తీర్ధ స్నానం, కోటీశ్వర స్వామి సందర్శనం. ఈ తీర్ధం గుప్తం. సాఖీ వినాయకస్తానం లో ఉందని అంటారు. ఫాల్గుణ మాసంలో గోకర్ణంలో స్నానం, గోకర్ణేశ్వర స్వామి దర్శనం చేస్తే, మాస యాత్ర పూర్తి అయినట్లే .

మరి కొన్ని విశేషాలు
జ్యేష్ట శుక్ల పక్షంలో దశాశ్వ మేధ ఘాట్ లో స్నానం విశేష ఫలం ఇస్తుంది . శ్రావణం లో శుక్లపక్షం పదిహేను రోజుల్లో దుర్గాకుండ స్నానం దుర్గాదేవి దర్శనం విశేషం. ఆశ్వయుజం లో కృష్ణ పక్షంలో గంగాజీ ఘాట్ లో తర్పణ శ్రాద్ధాలు విశేష ఫలితాలనిస్తాయి. కార్తీకంలో పూర్ణిమ వరకు ఆది మంగళ వారాలు కాక మిగిలిన రోజుల్లో కాశిలో ఉసిరి చెట్టును పూజించాలి. దానాలు, భోజనాలు శ్రేష్టం. మాఘంలో శుక్ల పక్షంలో వ్యాస పురిలోని, వేద వ్యాస ; లింగదర్శనం అతి ముఖ్యం .భాద్రపదంలో కృష్ణపక్షంలో దశాశ్వమేధ ఘాట్లో పిండ ప్రదానం, తర్పణాలు విశేష ఫలప్రదం.

సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE