బ్రహ్మకడిగిన పాదము

– బ్రహ్మ విష్ణుపాదాన్ని కడిగిన సందర్భం ఏమిటి?

గంగాదేవి దేవతా మూర్తిగా హిమవంతుని పెద్ద కుమార్తె. ఆమెను బ్రహ్మదేవుడు దత్తపుత్రికగా స్వీకరించి, బ్రహ్మ (సత్య) లోకంలో శివుని కిచ్చి వివాహం చేశాడు. శివుని వెంట వెళుతున్న గంగను చూసి, బ్రహ్మదేవుడు పుత్రికావాత్సల్యంతో దుఃఖించాడు. అతనిని ఓదార్చిన గంగ, జల రూపంలో బ్రహ్మకమండలంలో ఉంటానని చెప్పి, వనితా రూపంతో శివునివెంట వెళ్ళింది.

కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు వామనునిగా అవతరించాడు. బలి నుండి మూడడుగుల నేలను దానమడిగి, ముల్లోకాలను ఆక్రమించుతూ ఒక పాదంతో సత్యలోకాన్ని ఆక్రమించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శ్రీహరి పాదాన్ని చూసి భక్తిపారవశ్యంతో తన కమండలాంతర్గత గంగాజలంతో కడిగాడు. పరమ పావన విష్ణుపాదాన్ని చేరిన గంగ అక్కడే సుస్థిరంగా ఉండిపోయింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగనే భగీరధుడు తపస్సుతో రప్పించాడు. ఆ విధంగా గంగ ‘విష్ణుపాదోద్భవ’ అయ్యింది. ‘బ్రహ్మకడిగినపాదము ‘అనే వాక్యం వెనుకనున్న పురాణ కథ ఇది.

ఈ కథను స్మరింపజేస్తూ, వామనావతార వృత్తాంతాన్ని తెలియజేస్తూ-
“చెలగి వసుధ గోలచిన నీ పాదము
బలితలం మోపిన పాదము ”
అనే చరణాల మాటలతో స్పష్టపరచాడు అన్నమయ్య. పల్లవిలోని మొదటి వాక్యం – “బ్రహ్మ కడిగిన పాదము”, తొలి చరణం లోని పై రెండు వాక్యాలు కలిపి త్రివిక్రముని త్రిపాదాలనీ తెలియజేస్తున్నాయి. అంతేగాక – వేంకటేశ్వరునికి తొలిసారిగా ఉత్సవాలు జరిపి పూజించివాడు బ్రహ్మదేవుడే.

Leave a Reply