Suryaa.co.in

Devotional

శబరీ..శబరీ…ఏదీ మరియొకసారీ..

శబరీ..
ఇంతకాలము వేచినది
ఆ పిలుపుకే..
ఆశ పరుగిడి
అడుగు తడబడి
రామపాదము కన్నది..
వంగిపోయిన నడుముతో
నగుమోము చూడగలేక అపుడు కనుల నీరిడి
ఆ రామపాదము
కడిగినది శబరి..
పదముల ఒదిగినది శబరి!

ఏమి రామకథ శబరీ శబరీ
ఏదీ మరియొక సారి..
ఎప్పుడు విన్నదో
మాతంగి నోట
రామా అనే మాట…
అదే శబరి పాలి వరాలమూట..
అనుక్షణం
ఆ రాముని ధ్యాసే..
ఆ మోహనరూపం చూడాలనే ఆశే..!

మాతంగి నేర్పిన నామం..
ఆయన వెళ్ళినా
శబరిని వీడక…
ఆమె హృదయఫలకంపై
వాడక..ఆ పేరు వింటేనే
ఓ వేడుక..
రామనామస్మరణమే వాడుక
అతడెవరో తెలియదు..
వస్తాడో రాడో ఎరగదు..
చూస్తానని విశ్వాసం..
ఆ ఆశతోనే నిలబడుతున్న
ఉచ్వాసం..నిశ్వాసం..
ఈలోగా రామయ్య వనవాసం..!

ప్రతిరోజూ ఎదురుచూపే
గుమ్మం కాడ కాపే
ఆ అరుగుపై
భక్తితో చల్లిన కల్లాపే..
రామయ్యా..నువ్వు వస్తావని
ఉద్ధరిస్తావని..
కనులు కాయలై..
ఒడలంతా ఆ కనులే అయి..!

ఆ రోజు రానే వచ్చింది..
శబరి కథ కబంధుని
ద్వారా తెలిసి రామయ్య
బయలుదేరినాడట
శబరి దరికి..
చేరినాడట ఆ దారికి..
ఆ వగ్గు జీవితాన
అపుడు కురిసింది తొలకరి
ఆకు కదిలినా..
కోయిల కూసినా..
రాయి..తురాయి..
ఏ సద్దు చేసినా
రామయ్య వచ్చినంత సందడి..
అవ్వ గుండెలో
అంతులేని అలజడి..!

తీరా రామయ్య వచ్చినాక
నీరు నిండిన
కనులు కనబడక..
మసకగా దివ్యమంగళ
రూపు దర్శనం..
ప్రేమ మీరగ రాముడప్పుడు
శబరి కనులు తుడిచి
కోరి కోరి శబరి కొరికిన
దోరపండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు..
ఆ శబరిదెంతటి పుణ్యము..
అలా అయింది
శబరి కథ పురాణము!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE