Suryaa.co.in

Devotional

తపస్సు అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?

తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు.భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే ‘తపస్సు’ అంటారు. మనోవాక్కాయ కర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు.నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు.ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు.

అలా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగి పోతాయి.శ్రవణం చేత మల దోషం, మననం చేత విక్షేప దోషం మరియు నిరంతర ధ్యానమనే నిధిధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది.ఈ విధంగా మనస్సుని శుద్ధి చేసుకున్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వాసనా క్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపి తొలగుతాయి. ఆ విధంగా మనస్సు పాప వాసనా క్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది.

శారీరకమైన ఆవేదనల్ని, ఇంద్రియ లోలత్వాన్ని బుద్ది పుర్వకంగా నిగ్రహించుకోవటం వలన మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కావున శారీరకంగాను, మానసికంగాను, తపస్సనే ధనాన్ని పొందాలి.
ప్రతి మానవుడు తానూ జీవించే విధానంలో, తన పరిసరాల్లో తపో వాతావరణంను పెంపొందించుకోవాలి.
తన ఇల్లే తనకు, తపస్సుకు కూడ అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి.

మొదట తానూ మారాలి? ఎందుకు?ఎందుకంటే నిత్యమైన, శాశ్వతమైన దానిని తెలుసుకున్నాము మరియు జీవిత లక్ష్యము తెలుసుకున్నాము, అదియే మోక్షము. ఆ మోక్ష సాధన కోసం మారాలి.
మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు ,ఉద్దేశించాడు) ఏర్పరచినాడు. మానవుడు దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్దిగా తపస్సంపన్నుడు కావాలి.

మోక్షం అంటే జీవించి వుండగానే దేహమును, ఇంద్రియాలను, మనసును, తెలివిని దేదీప్యమానముగా ఉంచే ఆత్మను దర్శించడం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. అదే మోక్షం. ఆత్మానుభూతి, ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి.

సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE