Suryaa.co.in

International National

షింజో అబే మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ…

=భారత్ లో రేపు సంతాప దినం

జపాన్ మాజీ ప్రధాని మరణించారన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తనకున్న అతి కొద్దిమంది సన్నిహితుల్లో షింజో అబే ఒకరని, ఆయన ఇక లేరన్న విషయం తీవ్ర విషాదం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇవాళ ఈ విషాదకర పరిస్థితుల్లో యావత్ భారతదేశం జపాన్ శోకాన్ని పంచుకుంటోందని, ఈ కష్ట సమయంలో జపాన్ సోదరసోదరీమణులకు భారత్ తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

షింజో అబే ప్రపంచస్థాయి రాజనీతిజ్ఞుడని, సమున్నత వ్యవహారవేత్త అని, అద్భుతమైన నాయకుడు అని కొనియాడారు. జపాన్ ను, తక్కిన ప్రపంచాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు తన జీవితాన్ని ధారపోశారని కీర్తించారు.

“చాన్నాళ్ల కిందట నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అబేతో పరిచయం ఏర్పడింది. నేను ప్రధానమంత్రి అయ్యాక మా స్నేహం మరింత కొనసాగింది. ఆర్థిక అంశాలు, ప్రపంచ పరిణామాలపై షింజో అబే నిశిత దృష్టితో విశ్లేషించేవారు. ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది. ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగసామ్య రంగాల్లో భారత్-జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది.

ఇటీవల నేను జపాన్ లో పర్యటించినప్పుడు కూడా అబేను మరోసారి కలిసే అవకాశం వచ్చింది. ఇరువురం ఎన్నో అంశాలపై చర్చించుకున్నాం. ఎంతో సరదాగా, చమత్కారంగా మాట్లాడడమే కాదు, ప్రతి అంశంపైనా లోతైన అభిప్రాయాలు కలిగి ఉండేవారు. దురదృష్టవశాత్తు అదే మా చివరి సమావేశం అయింది. ఆయన కుటుంబానికి, జపాన్ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలుకుంటున్నాను” అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ లో స్పందించారు. అంతేకాదు, భారత్ లో రేపు (జులై 9) షింజో అబే మృతికి సంతాప దినంగా పాటించనున్నట్టు ప్రకటించారు.
Screenshot-2022-07-08-172045
Screenshot-2022-07-08-172023
Screenshot-2022-07-08-172104

LEAVE A RESPONSE