Suryaa.co.in

Andhra Pradesh

ఇకపై పోలీసులు రౌడీల్లా ఇళ్లపైకి వెళ్లడం కుదరదు

-అలాచేస్తే కోర్టుధిక్కరణ ఎదుర్కోక తప్పదు
-టిడిపి కేంద్ర కార్యాలయ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ

అమరావతి: ఇకపై పోలీసులు పౌరులపై అనుచిత నిఘా పెట్టడం, రౌడీషీట్లు తెరవడం, ఫోటోలు సేకరించడం వంటివి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ న్యాయవిభాగం ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తాజాగా జస్టిస్ సోమయాజులు ఇచ్చిన తీర్పు ప్రకారం అనుమానితుల పేరుతో అర్థరాత్రి తనిఖీలపేరిట పౌరుల ఇళ్లపైకి వెళ్లడం కూడా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన పేర్కొన్నారు.

“పోలీసులు పౌరులపై అనుచిత నిఘా, రౌడీషీట్లు తెరవడం, ఫోటోలు సేకరించడం, స్టాండింగ్ ఆర్డర్‌ సాకుతో ఇళ్లను తనిఖీ చేయడం గోప్యతను (Privacy) ఉల్లంఘించడమే” – ఎపి హైకోర్టు.
గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా వెలువరించిన (డబ్ల్యు.పి.3568 ఆఫ్ 2022 అండ్ అదర్స్ ) తీర్పు ప్రకారం వ్యక్తులపై “రౌడీలు”గా ముద్రించి రౌడీ షీట్లను తెరవడం, వారి ఫోటోల సేకరణ, ప్రదర్శన, నివాస గృహాల తనిఖీలు, ప్రస్తుత పోలీసు స్టాండింగ్ ఆర్డర్‌ల ప్రకారం పోలీసు స్టేషన్‌ ద్వారా సమన్లు ఇవ్వడం గోప్యత (Privacy) హక్కు యొక్క ప్రత్యక్ష ఉల్లంఘనే అవుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం పోలీసు స్టాండింగ్ ఆర్డర్‌లు “చట్టం”గా అర్హత పొందవని, చట్టం యొక్క అనుమతి లేకుండా పోలీసులు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, నివాస గృహాల తనిఖీ నిర్వహించడం సాధ్యం కాదని కోర్టు పేర్కొంది.

పండుగలు/ఎన్నికలు/వారాంతాల్లో మొదలైన సమయంలో నిందితులు లేదా అనుమానితులను పోలీసు స్టేషన్‌లకు లేదా మరెక్కడైనా పిలవరాదు. వారిని ఏ కారణం చేతనైనా పోలీసు స్టేషన్‌ల వద్ద వేచి ఉండేలా చేయరాదు. పోలీసులు (ప్రస్తుతం ఉన్న ఆదేశాల ప్రకారం) అనుమానితుడు లేదా నిందితుడి ఇళ్లకు రాత్రిపూట సందర్శనలు, నివాస సందర్శనలు చేయరాదు.

“ఫోటోల సేకరణ, ఫోటోల ప్రదర్శన, ఒక వ్యక్తిని “రౌడీ”గా ముద్ర వేయడం; పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం, పెరేడింగ్ / వెయిటింగ్ డొమిసిలియరీ/ఇంటి సందర్శనలు మొదలైనవి పౌరుల యొక్క గోప్యత (Privacy) హక్కును నేరుగా ఉల్లంఘించడమే. ఇకనుండి పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఏదైనా ఇంటిని సందర్శించడం, నిఘా పెట్టడం, సమాచారాన్ని సేకరించడం, ఫోటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు తీయడం, ప్రదర్శించడం, ఒక వ్యక్తిని రౌడీగా వర్గీకరించడం/లేబుల్ చేయడం వంటివి పోలీసులు నిర్వహించలేరు” అని గౌరవ జస్టిస్ DVSS సోమజయులు తన తీర్పులో పేర్కొన్నారు.

పై తీర్పును తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ అమలుచేసి తీరాలి. అలా అమలుచేయని పక్షంలో సంబంధిత పోలీసు అధికారులు కోర్టుధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని పోలీసు అధికారలంతా గమనంలోకి తీసుకొని తక్షణమే కోర్టు ఉత్తర్వులను అమలుచేయాల్సిందిగా తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయ న్యాయ విభాగం ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ విజ్జప్తి చేశారు. కోర్టు ఉత్తర్వులు పెడచెవిన పెట్టే పోలీసు అధికారులు అందుకు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

LEAVE A RESPONSE