హైదరాబాద్: ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ శాసనసభలో చేసిన ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. సోమవారం జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. అసెంబ్లీలోని మొదటి కమిటీ హాల్‌లో 2 ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. అసెంబ్లీలో 119 తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని పేర్కొన్నారు. ఏపీ కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి హైదరాబాద్‌లోనే ఓటు వేస్తారని తెలిపారు. ఓటేసేందుకు ఈసీ ఇచ్చిన పెన్నునే ఎమ్మెల్యేలు వాడాలని చెప్పారు. ఇతర పెన్నులు వాడితే ఓటు చెల్లదు అని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రంలో కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని వికాస్ రాజ్ సూచించారు.