హైకోర్టు పేరుతో కల్పిత సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్లపై పోలీసులకు ఫిర్యాదు

– హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపర్తి గిరిధర్
• డబ్బులిస్తే ఉద్యోగాలిస్తామని మోసగించే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు సూచన

హైకోర్టు పేరుతో ఒక కల్పిత సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ పై అప్పటి రిజిస్ట్రార్ (పరిపాలన) సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించామని, వాస్తవానికి అలాంటి సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ ని హైకోర్టు జారీ చేయలేదని హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) ఆలపర్తి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు మోసగాళ్లను న్యాయస్థానం ముందు హాజరుపర్చడానికి హైకోర్టు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

డబ్బులిస్తే ఉద్యోగాలిప్పిస్తామని, రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రభావితం చేస్తామని మోసగాళ్లు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దని హైకోర్టు సూచించిందన్నారు. అభ్యర్థులను ప్రభావితం చేసేలా రిక్రూట్ మెంట్ ప్రక్రియపై కామెంట్లు చేయడం, పేర్లను ప్రస్తావించి డబ్బులు చెల్లించడానికి ప్రొత్సహించడం వంటివి చేయడానికి ప్రయత్నించే మోసగాళ్లపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఏదైనా తప్పుడు వార్తలు, సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా స్ప్రెడ్ చేసే వారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

అభ్యర్థులు రిక్రూట్‌మెంట్, నోటిఫికేషన్, పరీక్ష తేదీ-స్థలం, మార్కుల జాబితా, ప్రొవిజనల్ తదితర వివరాలకై హైకోర్టు అధికారిక వెబ్ సైట్ https://hc.ap.nic.in ను సందర్శించాలని హైకోర్టు సూచించిందన్నారు. ఏదైనా కల్పిత, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా నకిలీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, ఫలితాలు లేదా పోస్టింగ్ లెటర్‌లు తదితర వాటిని అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా గమనించినట్లైతే హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని కోరారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సదరు మోసగాళ్లను చట్ట ప్రకారం త్వరితగతిన విచారించడానికి హైకోర్టు అనుమతించిందని రిజిస్ట్రార్ ఆలపర్తి గిరిధర్ తెలియజేశారు.

Leave a Reply