-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
దేశంలోనే అత్యున్నత ఉద్యోగాలు IAS, IPS స్థాయి వారంతా కొంతమంది వ్యక్తుల రాజకీయ ప్రయోజనాల కోసం కొమ్ముకాస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉద్యోగాలు చేయవలసి వస్తుంది.
“ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణానికి చిరునామా కోనసీమ”- నేడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఊపిరి తీసుకోవడం కూడా కష్టతరంగా మారింది ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులకు కారణం ఎవరు?
అల్లర్లకు ఆజ్యం పోసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే అమాయకులు మాత్రం కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతున్నారు. పై స్థాయి పోలీసు అధికారుల ప్రవర్తన కారణంగా క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసులు మాత్రం రాళ్ల దెబ్బలు కారణంగా రక్తం చిందిస్తున్నారు.
ప్రజల యొక్క స్వేచ్ఛాయుత జీవనానికి పాటు పడాల్సిన పోలీసు శాఖ రాజకీయ స్వార్థం కారణంగా ప్రజల స్వేచ్ఛను హరిస్తు, రోడ్లకు అడ్డంగా కంచెలు వేసి కాపలాకాయాల్సిన దుస్థితికి దిగజారింది రాష్ట్రం.
మాకు పోలీసులతో శత్రుత్వం లేదు పోలీసులే మమ్మల్ని రెచ్చగొట్టి, చట్టానికి విరుద్ధంగా ప్రైవేటు లారీలను మా వాహనాలకు అడ్డుపెట్టి గంటలపాటు రోడ్డుపైనే నిలువరిస్తూ ప్రతిఘటించే తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం?
పోలీసులు ఆపితే ఆగుతాము. పోలీసు వాహనాలు మోహరించినా ఆగుతాము. కానీ ఒక ప్రైవేటు లారీ మా వాహనాలకు అడ్డుగా ఎలా పెడతారు? లారీ డ్రైవర్ తప్పిదం కారణంగా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?
5ఏళ్ళు అధికారంలో ఉండే వ్యక్తుల కోసం ప్రజల భవిష్యత్తును నిర్ధారించాల్సిన అధికారులు తొత్తులుగా మారవద్దు. ఫలితంగా మీ భవిష్యత్తును ఇబ్బందుల్లో పెట్టొద్దు. అధికార దుర్వినియోగ కార్యక్రమాలకు పాల్పడవద్దు.