Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరేలా పాలసీలు

  • అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి
  • పీ-4 ప్రాజెక్టులతో తగ్గనున్న పేదరికం
  • పెద్దల సాయంతో సమాజంలో సమానత్వం
  • అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి : రాష్ట్రంలో ఒక్కో కుటుంబాన్ని ఒక్కో యూనిట్‌గా తీసుకుని వారి కుటుంబ సభ్యుల ప్రొఫైల్‌కు తగ్గట్టు ప్రభుత్వ పథకాలు అందించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంట్రప్రెన్యూర్ ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి, 1995 తర్వాత అనేక పరిపాలనా పరమైన సంస్కరణలు చేపట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేశామని చెప్పారు. ఇప్పుడు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అర్హులందరికీ పథకాలు అందించి, పేదరికం లేని సమాజాన్ని సాధించవచ్చన్నారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత అందించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

పేదరిక నిర్మూలనే లక్ష్యం

అభివృద్ధి-ఆర్ధిక రంగాల్లో ప్రజల్ని భాగస్వాములుగా చేస్తేనే రాష్ట్రంలో పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద మరిన్ని ప్రాజెక్టులు ప్రవేశపెడితే పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. పీ-4 ప్రాజెక్టుకు రాజధాని అమరావతి నిర్మాణం ఒక ఉత్తమ ఉదాహరణగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలు రాజధాని కోసం భూములు ఇచ్చారని, రాజధాని నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే, ప్రైవేటు సంస్థలు ఇందులో భాగస్వాములు అయ్యాయని.. ఆ విధంగా ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

అలాగే ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద ఇంటింటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం కూడా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైందన్నారు. ప్రతి గృహ వినియోగదారు తమ ఇంటిపై సోలార్ ప్యానల్స్ అమర్చుకోవడం, ఇందుకోసం ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం, వాటికి సంబంధించి నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు సంస్థలు చూసుకోవడం.. ఇలా సమిష్టి భాగస్వామ్యం ఉత్తమ ఫలితాలు తెస్తుందని చెప్పారు. ఈ తరహాలోనే మరిన్ని పీ-4 ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.

పేదరిక నిర్మూలనకు పెద్దల దాతృత్వం

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం పీ-4 వంటి కార్యక్రమాలు చేపడుతూనే, మరోవైపు సమాజంలో సంపన్నవర్గాల నుంచి సాయం కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. చిన్న సాయంతో-పెద్ద మార్పు సాధించవచ్చనే నమ్మకంతో, ప్రతి సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చూపేలా వారిని చైతన్య పరచాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. బిల్ – మిలిందా గేట్స్ ఫౌండేషన్, అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్, శివ్ నాడార్ ఫౌండేషన్, టాటా ఫౌండేషన్ వంటివి దాతృత్వంలో ముందున్నాయని అలాంటి సంస్థలతో పాటు, ప్రవాసాంధ్రుల సాయం ఇందుకోసం తీసుకోవాలని సూచించారు.

జనాభా వృద్ధి రేటు తగ్గుదలపై సమీక్ష :

రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు పెరిగేలా జపాన్, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా ఉండటం, వృద్ధుల సంఖ్య పెరుగుతూ – యువత సంఖ్య రోజురోజుకూ తగ్గడం, ఆధారపడి జీవించేవారు ఎక్కువుగా ఉండటంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

అత్యల్పంగా రాష్ట్ర జనాభా వృద్ధి

రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 2021 లెక్కల ప్రకారం అత్యల్ప స్థాయికి పడిపోయింది. జాతీయ సగటులో మూడోవంతు మాత్రమే వృద్ధిరేటు నమోదవుతోంది. దేశంలో జనాభా వృద్ధి రేటు 9 శాతం ఉంటే, రాష్ట్రంలో 3.5 శాతం మాత్రమే ఉంది. డటం 2011లో రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 7.10 శాతంగా ఉంటే, దశాబ్ద కాలంలో ఇది 3.5 శాతానికి పడిపోయింది. ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు దేశంలో 48 శాతం ఉండగా, రాష్ట్రంలో ఇంకాస్త ఎక్కువుగా 49.10 శాతం మంది ఉన్నారు.

పెరుగుతున్న వయో వృద్ధుల సంఖ్య

రాష్ట్రంలో 0 – 14 ఏళ్ల లోపు చిన్నారులు 20.51 శాతం ఉంటే, 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు 67.10 శాతంగా ఉన్నారు. 60 ఏళ్ల వయసు పైబడిన వారి శాతం 12.40గా ఉంది. రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 2016తో పోలిస్తే 2021 నాటికి పెరుగుతూ వస్తోంది. అటు ఒక్కో కుటుంబంలోని సగటు సభ్యుల సంఖ్య జాతీయ స్థాయితో పోల్చుకుంటే రాష్ట్రంలో తక్కువుంది. దేశంలో ఒక్కో కుటుంబంలో సగటున 4.1 మంది ఉండగా, రాష్ట్రంలో 3.2 మంది మాత్రమే ఉన్నారు.

సంతానోత్పత్తిలో తగ్గుదల

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోగా, జీవనకాలం రేటు పెరిగిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020 సంవత్సరానికి గాను సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు 2.0 ఉంటే, ఆంధ్రప్రదేశ్ సగటు 1.5 మాత్రమే ఉంది. దేశంలో కన్నా రాష్ట్రంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జీవనకాలం కూడా దేశీయ సగటు కన్నా ఏపీలో ఎక్కువే ఉంది. జాతీయ సగటు ఆయుర్ధాయం 69 ఏళ్లు ఉంటే, రాష్ట్రంలో ఇది 70 ఏళ్లకు చేరింది. అలాగే శిశుమరణాల రేటులోనూ రాష్ట్రంలో తగ్గుదల కనిపించింది. ప్రతి వెయ్యి శిశు జననాలకు ఐఎంఆర్ దేశంలో 28, రాష్ట్రంలో 24గా నమోదైంది. సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE