– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశ భద్రతకు, రక్షణ శాఖకు సంబంధించి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెలంగాణకు రావడం శుభప్రదం. భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ప్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ (రాడార్ సెంటర్) ఏర్పాటు కోసం ప్రాజెక్టుకు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా భూమిపూజ జరగడం సంతోషకరం.
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో స్ట్రాటజిక్ ప్లేస్ లో రాడార్ స్టేషన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలోని మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది.
ఇప్పటికే అధునాతన వెరీ లో ఫ్రీక్వెన్సీ (VLF) నావల్ కమ్యూనికేషన్ స్టేషన్ తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ప్రారంభించడం జరిగింది.దేశంలో రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ను వికారాబాద్‌లో ఏర్పాటు చేయనుంది.షిప్స్, సబ్ మెరైన్ లకు సంబంధించి కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు.
యుద్ధ సమయంలో, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ లో ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో కమ్యూనికేషన్ చేసుకునేలా రాడార్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో 2010లో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత అనేక రకాల అనుమతులు పొందడం జరిగింది.
2017 డిసెంబర్ 12వ తేదీన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అనుమతులు ఇస్తూ జీవో నెం. 44 ను విడుదల చేశారు.1100 హెక్టార్ల భూమిని హైదరాబాద్ ఫారెస్ట్ డివిజన్ లోని దామగుండం అటవీ ప్రాంతంలో భూమిని వెరీ లో ప్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ (రాడార్ సెంటర్) ఏర్పాటు కోసం ఇవ్వడం జరిగింది.
ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం బాధ్యతారహితంగా, రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది. ఇది బీఆర్ఎస్ దివాళాకోరుతనానికి నిదర్శనం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జీవోలు విడుదల చేసి, ప్రాజెక్టు పనులు మొదలు పెట్టగానే ,సికింద్రాబాద్ లోని బైసన్ పోలో ల్యాండ్ సెక్రటేరియట్ కోసం ఇవ్వాలని, అప్పుడే పంచనామా చేసి భూమి కేటాయిస్తామని చెప్పింది.
సెక్రటేరియట్ నిర్మాణానికి బైసన్ పోలో ల్యాండ్ ఇవ్వకూడదంటూ, ఇబ్బందులు వస్తాయని చాలామంది క్రీడాకారులు, పర్యావరణవేత్తలు రక్షణశాఖకు ఉత్తరాలు రాయడంతో పాటు కోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఒకమాట.. ప్రతిపక్షంలో ఉన్నపుడు మరోమాట మాట్లాడటం అలవాటే.
దేశ భద్రత, రక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ గతంలో చైనా సైనికులతో ఘర్షణలో, భారత సైనికులు పారిపోయి వచ్చారంటూ దేశ భద్రత గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ పై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ పై ఆధారాలు, సాక్ష్యాలు ఏవి అంటూ బీఆర్ఎస్ నాయకులు బాధ్యతారాహితంగా మాట్లాడారు. దేశ రక్షణకు సంబంధించి కార్యక్రమాలను ఏ పౌరుడు కూడా వ్యతిరేకించడం సరికాదు. భారత రక్షణశాఖకు సహకరించాల్సిందిపోయి, తమకు ఇష్టం లేదంటూ దేశ భద్రత, సమగ్రతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను సభ్యసమాజం ఖండించాలి.
గత 14 సంవత్సరాల క్రితమే దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దామగుండం అటవీ ప్రాంతంలో చెట్లు, రక్షణ కోసం రూ. 130 కోట్లు అటవీశాఖకు రక్షణశాఖ కేటాయించింది. 209 ఎకరాల్లో కొంత ప్రాంతంలో మాత్రమే రాడార్ వ్యవస్థలో పనిచేసే నేవీ సిబ్బందికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. అయితే, కొందరు ఈ విషయంలో చెట్లు నరికివేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు.
మరికొందరు దామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులను వెళ్లనివ్వరంటూ తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. దామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా రక్షణశాఖతో సంప్రదిస్తాం. గుడి విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరుతున్నా.
పర్యావరణ పరిరక్షణ, అడవులను, పచ్చదనాన్ని పెంపొందించడంలో భారతదేశం అగ్రభాగాన ఉంది. ఎక్కడ మిలటరీ ఉంటుందో.. అక్కడ పచ్చదనాన్ని పెంపొందిస్తారు. సైనికులు వేసుకునే యూనిఫాం గ్రీన్. రక్షణ శాఖ సైనికులు గ్రీనరీతో మమేకమై అటవీ బిడ్డలతో మమేకమై, ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం పనిచేస్తారు.
ఈ ప్రాజెక్టు విషయంలో ఆందోళన చేస్తామంటున్న కేటీఆర్.. గతంలో ఉన్న తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామన్నట్లుగానే భావించాలి. గతంలో అనేక జీవోలు జారీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. 2017 సంవత్సరంలోనే ప్రాజెక్టుకు సంబంధించి, అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత అన్ని అనుమతులు పొందడం జరిగింది.
జాతీయ రహదారులు, రైల్వేలైన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మొదలగు ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నపుడు అడవులకు నష్టం కలగకుండా మొక్కలను నాటేలా, కంపా నిధులతో ప్రి ప్లాంటేషన్ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
14 సంవత్సరాల తర్వాత అనేక రకాల సంప్రదింపులు, చర్చలు జరిగిన తర్వాత, అన్ని అనుమతులు పొందిన తర్వాత తెలంగాణకు సంబంధించిన కొందరు ఆందోళనలు చేయడం ఏమాత్రం సరికాదు.
సర్జికల్ స్ట్రయిక్స్, ఎయిర్ స్ట్రయిక్స్ జరిగిన సందర్భంలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే వెరీ లో ప్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ నిర్మాణం విషయంలో కొంతమంది స్వార్థ రాజకీయాలతో, దుందుడుకు విధానాలతో వ్యవహరిస్తున్నారు.
లక్షా 95 వేల చెట్లు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఇందులో కేవలం 1500 చెట్లను రీలొకేట్ చేస్తారు. దీనికి సంబంధించిన రిపోర్టును అటవీశాఖకు ఇవ్వడం జరిగింది. కానీ, కేవలం తమ రాజకీయ అస్థిత్వం కోసం ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం సరికాదు.
ఇప్పటికే కంటోన్మెంట్, డీఆర్ డీఓ, డీఆర్డీఏ, భారత డైనమిక్ లిమిటెడ్, ఎయిర్ ఫోర్స్ బేస్ వంటి డిఫెన్స్ కు సంబంధించి అనేక ప్రాజెక్టులు తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు నేవీ బేస్ సెంటర్ తెలంగాణకు రావడం సంతోషకరమైన విషయం.
భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ప్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ (రాడార్ సెంటర్) ఏర్పాటుతో అనేక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
దేశ రక్షణ విషయంలో, దేశ సైనికుల విషయంలో రాజకీయాలు చేయకూడదని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కోరుతున్నాను.