– అదే మద్యం పాలసీ. వైన్‌షాప్‌ల కేటాయింపు
– మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్
విశాఖపట్నం: చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టికి అర్ధం.. కేవలం తెలుగుదేశం పార్టీతో పాటు, కూటమి నాయకులకు మాత్రమే సంపద సృష్టించడం అన్నట్లుగా తేలిందని ఆయన వెల్లడించారు. ఆ దిశలోనే నిన్న జరిగిన మద్యం షాప్‌ల కేటాయింపుల్లో అన్ని చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రజా ప్రతినిధులకు ఎక్కువ షాప్‌లు దక్కాయని గుర్తు చేశారు.
‘రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, తెలుగుదేశం నాయకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మద్యం పాలసీ ఉంది. అందుకు అనుగుణంగానే వైన్‌షాప్‌ల కేటాయింపు కూడా జరిగింది’ అని గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
2019లో తాము అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేశామని, అలాగే 4500 వైన్‌షాప్‌లు ఉంటే, వాటిని 2900కి తగ్గించామని.. ఆ విధంగా పేద కుటుంబాలను రక్షించి, వారిని మద్యం బారి నుంచి కాపాడాలని చూశామని చెప్పారు.
నాడు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రభుత్వ సేవలు అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికీ మద్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని.. రానున్న రోజుల్లో వీధికో బెల్టు షాప్ ఉంటుందని, అలాగే ఇంటికే మద్యం సరఫరా మొదలుపెడతారని తెలిపారు. కీలకమైన విద్య, వైద్య రంగాలను పూర్తిగా పక్కన పెట్టేసి, వాటికి బదులు మద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆక్షేపించారు.
అందుకే వెంటనే మద్యం పాలసీ రద్దు చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే, ప్రజల పక్షాన పోరాడతామని ప్రకటించారు. మద్యంపై పేదప్రజలు కూడా తప్పకుండా తిరగబడతారని ఆయన అన్నారు