– పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలి
– నాడు మద్యపాన నిషేదం అన్న జగన్ నేడు మద్యంపై టార్గెట్లు పెట్టి అమ్మిస్తున్నారు
– నారా చంద్రబాబు నాయుడు
పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికే టీడీపీ అధికారంలోకి వచ్చాక పదవులిస్తామని, వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వైసీపీ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కడప జిల్లా రాజంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ….. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడి చేసిన వారికే అధికారంలోకి వచ్చాక పదవులిస్తాం. పనిచేయనివారికి పక్కనపెడతాం. ఎవరు పనిచేస్తున్నారో. ఎవరు పనిచేయటం లేదో అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. రేపు అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త నుంచి నాయకుని వరకు అందరికీ న్యాయం చేస్తాం. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్ కి అప్పులు చేయటం తప్ప పాలన చేయటం చేతకాదు. చేతికందినకాడికి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్దిక సంక్షోభంలోకి నెట్టారు. నాడు నేడు పేరుతో అవినీతి చేశారు తప్ప ఎక్కడైనా పాఠశాలలు అభివృద్ది చేశారా?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవు. అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 14 వేలిచ్చి నాన్న బుడ్డి ద్వారా రూ.36 వేలు లాక్కుంటున్నారు. ప్రభుత్వ అధికారుల చేత మద్యం అమ్మకాలపై సమీక్షలు నిర్వహించే పరిస్థితి తెచ్చారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేదం అన్న జగన్ నేడు మద్యంపై టార్గెట్లు పెట్టి అమ్మిస్తున్నారు. అధికారం కోసం అనేక హామీలిచ్చిన జగన్ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. వైసీపీ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బూత్ కమిటీలు వేసుకుని పార్టీని బలోపేతం చేయాలి, బూత్ కమిటీ మెంబర్లను అధికారంలోకి వచ్చాక ప్రజా సేవకు వినియోగిస్తాం. రాష్ట్రంలోని యువతంతా టీడీపీ వైపు చూస్తున్నారు.
పార్టీ కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి. వైసీపీ నేతల అరాచకాలు, కేసులకు భయపడొద్దు. పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడినా అభ్యర్ధులు లొంగకుండా పార్టీ కోసం నిజాయితీగా పనిచేసినందుకు అభినంధనలు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ..టీడీపీ నాయకులే కొంతమంది వైసీపీకి సహకరించారని చంద్రబాబు దృష్టికి తీసుకురాగా.. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యహరిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై చర్యలు తప్పవని చంద్రబాబు అన్నారు.
రాజంపేట ఇన్ చార్జ్ విషయంలో వైసీపీ లేనిపోని అపోహలు ప్రచారం చేస్తుందని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకురాగా ఇప్పుడు ఇన్ చార్జ్ లుగా ఉన్న వారినే వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులుగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం రూ. 30 లక్షల విరాళం ఇచ్చిన చంద్రశేఖరావును చంద్రబాబు అభినందించారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ లోని అన్ని స్ధానాల్లో టీడీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ సమీక్షలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కడప పార్లమెంట్ అధ్యక్ష్యులు శ్రీనివాసులు రెడ్డి, బత్యాల చెంగల్రాయుడు, రైల్వే కోడూరు ఇన్ చార్జ్ పంతగాని నరసింహ ప్రసాద్, రిటైర్డ్ ఐఏయస్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పర్వీన్ తాజ్, చెన్నూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.