Suryaa.co.in

Andhra Pradesh Entertainment

రసాయన రహిత ప్రకృతి సాగు పట్ల మొగ్గు చూపాలి

-గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా
సందేశాత్మక చిత్రం అమృత భూమి పోస్టర్ ఆవిష్కరణ

రసాయన రహిత ప్రకృతి సాగు పెరగవలసిన అవశ్యకత ఉందని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులతో వ్యవసాయం చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజంలో మరింత అవగాహన కల్పించవలసి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సమితి ఆర్థిక సహకారంతో సహజ వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలు ప్రధాన కథాంశంగా రూపొందిన తెలుగు చిత్రం ‘అమృత భూమి’ పోస్టర్‌ను విజయవాడ రాజ్ భవన్ లో సిసోడియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సందేశంతో కూడిన చిత్రాన్ని రూపొందించడంలో డాక్టర్ పరినాయుడు కృషిని అభినందనీయమన్నారు. సహజసిద్దమైన సాగు ద్వారా లభించే ఆహారం మంచి షోషకాలను అందిస్తుందన్నారు.

చిత్ర నిర్మాత, రచయిత డా.డి.పరినాయుడు మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా అధిక రసాయనాలతో కూడిన వ్యవసాయం వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై ఎలా ప్రభావం చూపుతోందన్న అంశాన్ని వివరించామని పేర్కొన్నారు. అధిక పెట్టుబడులు, పంట నష్టాల కారణంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల సమస్యను కూడా తమ చిత్రం ఆవిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్ప శ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన విషయాన్నిసిసోడియాకు నిర్మాత వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడ అచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పూర్వపు విజయనగరం కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు చిత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం అందించారన్నారు. కోరుకొండ బ్రహ్మానందం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ జానపద గాయకుడు దివంగత వంగపండు ప్రసాదరావు కథ, పాటలు రాశారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు టి. విజయకుమార్ సందేశంతో చిత్రం ప్రారంభం అవుతుందని పరినాయుడు వివరించారు.

LEAVE A RESPONSE