* భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ గ్రామ సింహాలు మొరుగుతున్నాయ్
* గడప గడపకు ప్రజలు కొట్టే దెబ్బలతో మైండ్ బ్లాక్ అయ్యి మాట్లాడుతున్నారు
* సీఎంకు దమ్ముంటే 10 నియోజకవర్గాల్లో గడప గడపకు తిరగాలి
* ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది
* దోచుకోవడం… దాచుకోవడమే వైసీపీ అజెండా
* ప్రత్యేక హోదాపై మెడలు వంచుతామని సాష్టాంగ నమస్కారాలు చేశారు
* విజయవాడ మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరులో జరిగిన కౌలు రైతు భరోసా సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి తాడేపల్లి ప్యాలస్ వణికిపోయిందని, అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు గ్రామ సింహాలు మొరగడం మొదలుపెట్టాయని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు. ఈ గ్రామ సింహాలు పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, తాట తీస్తామని హెచ్చరించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటే… రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా రైతాంగం అప్పుల్లో ఊబిలో కూరుకుపోయారని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతమందికి రూ. 7 లక్షల నష్టపరిహారం అందించారు? కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన మేలు ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “కష్టాల్లో ఉన్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపి, ఆర్థికంగా ఎంతోకొంత ఆదుకోవాలనే సదుద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తుంటే దానిపై వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దాదాపు 272 కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. వాళ్ల పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను కూడా అందిస్తామని హామీ ఇచ్చి రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకుంటే… మీరు మాత్రం అన్నం పెట్టే రైతుకు కులాలు ఆపాదించి రైతు ద్రోహిగా పేరు తెచ్చుకున్నారు. జనసేన పార్టీ ఆర్థిక సాయం చేస్తున్న వాళ్లలో నిజమైన కౌలు రైతులు లేరని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఎందుకు నాదెండ్ల మనోహర్ విసిరిన సవాల్ ను స్వీకరించలేక పారిపోయారు. గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యే, మంత్రులను ప్రజలు బాదుతుంటే మైండ్ బ్లాక్ అయ్యి నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు.
ఏనాడైనా జేబు నుంచి ఒక్క పైసా తీసి పేదల కోసం ఖర్చు పెట్టారా?
రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటే కేవలం లక్షన్నర మందికే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేశారు. కులాలు, మతాలు అంటగట్టి మిగిలిన పన్నెండున్నర లక్షల మంది కౌలు రైతులను మోసం చేశారు. రైతు భరోసా పథకం కింద రూ. 13,500 ఇస్తామని చెప్పి దానిని రూ. 7500 కు కుదించిన మాట వాస్తవం కాదా? దీనిని రైతు భరోసా పథకం అంటారా? రైతులను మోసం చేయడం అంటారా? మీరే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ఎంతో బాధ్యతతో రైతుల పిల్లల చదువుల బాధ్యత తీసుకుంటుంటే వైసీపీ పిచ్చి కుక్కలు ఇష్టారీతిన మాట్లాడుతున్నాయి. మీ జేబుల నుంచి ఏనాడైనా ఒక్క పైసా తీసి పేద ప్రజలకు సాయం చేశారా? సంక్షేమం పేరిట దాదాపు 8 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి దానిలో పదో, పదిహేను శాతమో పంచి మిగిలింది దోచుకొని హైదరాబాద్, బెంగుళూరు ప్యాలస్ లో దాచుకున్నారు. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానాలు చెప్పలేక పారిపోతున్నారు. ఇలాంటి అవినీతిపరులు, కబ్జాకోరులు, అమ్మాయిల వ్యసనపరులా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విమర్శించేది.
ఆయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్
అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి ఆరితేరిపోయారు. పాదయాత్ర సమయంలో నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చమంటే ముఖం చాటేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పడంలో రాటుదేలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే. అబద్ధాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. సున్నా వడ్డీ పథకం కింద ఎంతమంది రైతులకు రుణాలు ఇచ్చారు? రైతు రుణమాఫి కింద ఒక్క రైతుకైనా రుణం మాఫీ చేశారా?
ఇప్పుడు రైతుల దగ్గర వేలకు వేలు విద్యుత్ ఛార్జీలు గుంజడానికి వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారు. పంటబీమా గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం… ఎంతమందికి బీమా అందించింది. అకాల వర్షాలు, తుపాన్లు వల్ల దాదాపు 55 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాదాపు రూ. 20వేల కోట్లు రైతులు నష్టపోయారు. బీమా కింద ఈ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం కేవలం రూ. 1900 కోట్లు. అంటే నష్టంతో పోలిస్తే ఇచ్చిన బీమా సొమ్ము పది శాతం కూడా లేదు.
అకాల వర్షాలు, తుపాన్లతో పంట నష్టం వాటిల్లితే హెలికాప్టర్ లో తిరిగి ఏరియల్ సర్వే చేయడం తప్ప… ఏనాడైనా పవన్ కళ్యాణ్ లా క్షేత్రస్థాయి పర్యటన చేశారా ఈ ముఖ్యమంత్రి. ఏనాడైనా చిన్న మట్టి ఆయన కాలికి అంటిందా? ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు బకాయిలు దాదాపు రూ. 4వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై మంత్రులెవరూ స్పందించరు.
దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించండి ముఖ్యమంత్రి గారు
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా వచ్చే నెలలో కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. కడప జిల్లాలో దాదాపు 132 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే 13 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి సొంత నియోజకవర్గం రైతులనే ఆదుకోలేకపోయారంటే ఇంకా మిగతా వాళ్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ తరఫున సవాల్ విసురుతున్నాం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మీకు నచ్చిన 10 నియోజకవర్గాలను ఎంచుకొని గడప గడపకు కార్యక్రమం చేసే దమ్ముందా? అలా చేస్తే అప్పుడు అర్ధమవుతుంది వైసీపీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో.
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారు
పవన్ కళ్యాణ్ కి బలమైన దృక్పథం ఉంది కనుకే ఓటమి పాలైనా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. సామాన్యులతో మమేకమై తిరుగుతున్నారు. అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి… ఇప్పుడు కేసుల భయంలో కేంద్రం ముందు సాష్టాంగ నమస్కారం చేసి 6 కోట్ల మంది ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు. మరికొంతమంది వైసీపీ నాయకులు జనసేన పార్టీ అజెండా లేదని మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడం, సామాన్యులకు అండగా ఉండటమే మా పార్టీ అజెండా. అంతే తప్ప లక్షల కోట్లు దోచేసి, నచ్చిన యాంకర్లకు బీ.ఎం.డబ్ల్యూ. కార్లు బహుమతులుగా ఇవ్వడం మా అజెండా కాదు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దోచేసే రాజకీయ పరిజ్ఞానం పవన్ కళ్యాణ్ కి లేదు. ఆ పరిజ్ఞానం కేవలం జగన్మోహన్ రెడ్డి కే సొంతం.
సామాన్యుడు పరిగెత్తించిన సంగతి అప్పుడే మరిచిపోతే ఎలా?
పవన్ కళ్యాణ్ గురించి బెజవాడ బ్రహ్మానందం వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ ని విమర్శించే స్థాయా నీది. గడప గడపకు వెళ్లి నిన్న ప్రశ్నించాడని నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ల మీదే కేసులు పెట్టావు. నీవా ఆర్యవైశ్యులకు అండగా ఉండేది. అమ్మవారి గుడిలో కాంట్రాక్టుల పేరుతో కోట్లు దోచేశావు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెల్లంపల్లి ట్రస్టు పెట్టావు. భోగవల్లి సత్రం భూములు కాజేయడానికి ప్లాన్ చేసింది వాస్తవం కాదా? దర్గా భూములు మీ సేహ్నితుల చెరలో ఉన్న మాట వాస్తవం కాదా? ఇన్ని అవినీతి మరకలు ఉన్న నువ్వా మా నాయకులు గురించి మాట్లాడేది. నీ అవినీతి గురించి సామాన్యుడు ప్రశ్నిస్తే తట్టుకోలేక పారిపోయావు అప్పుడే మరిచిపోతే ఎలా? ఈసారి వెల్లంపల్లికి వైసీపీ టికెట్ ఇవ్వదు. ఇచ్చినా డిపాజిట్లు కూడా రావని” అన్నారు.