హైదరాబాద్: రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల కన్నా పాలకుల స్వీయ నైతికతే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందని చెప్పిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాటలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అంతఃకరణశుద్ధితో ఆచరిస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అన్నారు.
రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26, జాతీయ న్యాయ దినోత్సవం) సందర్భంగా రాజ్యాంగం రూపకల్పనకు సుదీర్ఘకాలం శ్రమించిన మేధావుల కృషిని మంత్రి సురేఖ స్మరించుకున్నారు. భారత రాజ్యాంగానికి ఆమోదం లభించిన నవంబర్ 26 భారతదేశ ప్రజలందరికీ ఎంతో ప్రత్యేకమైనదని మంత్రి అన్నారు. స్వాతంత్ర్యానంతరం దశ దిశ లేని భారతదేశానికి నూతన రాజ్యాంగంతో జవసత్వాలు సమాకూరి, గొప్పగా పురోగమించిందని అన్నారు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలు పలు కమిటీలకు చైర్మన్ లుగా వ్యవహరించిన జవహర్ లాల్ నెహ్రూ, పటేల్, జెబి కృపలాని వంటి వారి సమిష్టి కృషితో రూపొందిన భారత రాజ్యాంగం నేడు ప్రపంచంలోని శక్తివంతమైన రాజ్యాంగాల్లో ఒకటిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తితో మన రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను గౌరవించుకుంటూ, ప్రగతిశీల, శాంతియుత భారతాన్ని ఆవిష్కరించుకునేందుకు ప్రజలంతా ఏకం కావాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల వికాసానికై కాంగ్రెస్ ప్రభుత్వం ‘పనుల జాతర’ను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ. 2,750 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.