-‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ లక్ష్యమిదే
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-మొదటి దశ బైక్ ర్యాలీలపై తరుణ్ చుగ్ తో కలిసి సమీక్ష
-రెండో దశ కార్యక్రమాలపై కార్యాచరణ
‘‘ గ్రామ గ్రామానికి వెళ్లండి… ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించండి. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించండి. ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించండి. ప్రజా గోస – బీజేపీ భరోసా ప్రధాన లక్ష్యమిదే..’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో కలిసి ‘‘ప్రజా గోస – బీజేపీ భరోసా’’ తొలి దశ కార్యక్రమం అమలు తీరు తెన్నులను సమీక్షించారు. రెండో దశ బైక్ ర్యాలీల కార్యక్రమాల నిర్వహణపై కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు తదితరులు హాజరై ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని, నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీల్లో పాల్గొన్నారని వివరించారు.
• మరోవైపు మొదటి దశ ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ప్రారంభించి 605 గ్రామాల్లో పర్యటించారు. దాదాపు 2 వేల కి.మీల మేర బైక్ ర్యాలీలు నిర్వహించిన పార్టీ నాయకులు రైతులు, మహిళలు, కార్మికులు, కూలీలు సహా వివిధ వర్గాలకు సంబంధించి లక్షలాది మంది ప్రజలతో మమేకమయ్యారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించడంతోపాటు స్థానిక ఆలయాలను సందర్శించారు. రైతులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా’ రెండో దశ కార్యక్రమాన్ని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభించాలని నిర్ణయించారు.
• ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రెండో దశలో భాగంగా బైక్ ర్యాలీలు నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో తప్పనిసరిగా పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. బైక్ ర్యాలీల్లో భాగంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బస చేయాలని, ప్రజలతో మమేకం కావాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించడంతోపాటు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను, తెలంగాణకు కేంద్రం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
• ఈ బైక్ ర్యాలీల్లో సంబంధిత జిల్లా, పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా నేతలను, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా సీనియర్లను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని సూచించారు. తరుణ్ చుగ్ మాట్లాడుతూ ప్రజా గోస – బీజేపీ భరోసా బైక్ ర్యాలీల్లో భాగంగా స్థానిక దేవాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. స్థానికంగా పార్టీ కోసం నిరంతరం పాటుపడే సామాన్య కార్యకర్తల ఇంట్లో తప్పనిసరిగా రాత్రి బస చేయాలని కోరారు.
• మరోవైపు రెండో దశ ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’లో భాగంగా సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, ఖానాపూర్, భూపాలపల్లి, వైరా, సూర్యాపేట, మహబూబాబాద్, బాల్కొండ, కామారెడ్డి, మంచిర్యాల, వికారాబాద్, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.