ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం

68

– సాయుధ అటవీబృందాలతో తనిఖీలు
– సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు
– గ్రామాలపై ఏనుగుల దాడులు జరగకుండా ముందు జాగ్రత్తలు
– అటవీభూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు
– ఆదాయాన్ని ఇచ్చే వన ఉత్పత్తులకు ప్రోత్సాహం
– నగరవనాల ఏర్పాటుపై దృష్టి సారించాలి
– ఎకో టూరిజం ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యం
– అటవీప్రాంతంలో మైనింగ్ అనుమతుల విషయంలో నిర్ధిష్ట నిబంధనలు
– మైనింగ్ పూర్తయిన తరువాత అభివృద్ధి బాధ్యత లీజుదారులదే
: మంత్రి పెద్దిరెడ్డి రామంచద్రారెడ్డి

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యంత విలువైన ఎర్రచందనం స్మగ్లర్ల బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. సాయుధ అటవీ బృందాలతో ఎర్రచందనం నిల్వలు విస్తరించిన ప్రాంతాల్లో నిరంతర గస్తీ నిర్వహించాలని అన్నారు. అలాగే ఎర్రచందనంపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ను కూడా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అవసరమైతే డ్రోన్ల సహకారంతో నిఘాను ముమ్మరం చేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిచుకోవాలని సూచించారు. అలాగే సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని, ఇప్పటికే కర్ణాటక అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించామని అన్నారు. త్వరలోనే తమిళనాడు అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటవీఉత్పత్తులు, కలప ద్వారా మొత్తం 95.24 కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టేకు, వెదురు, ఫైర్ ఉడ్, చార్ కోల్, బీడి ఆకు, జీడిమామిడి తదితర వనరులపై దృష్టి సారించాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్ లు పనిచేస్తున్నాయని, వాటితో పాటు పులికాట్, నేలపట్టు, కోరింగ, పాపికొండలు ప్రాంతాల్లో కూడా ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అరకు ప్రాంతంలో జంగిల్ రిసార్ట్స్ ను ఏర్పాటు చేస్తే పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. అలాగే సోమశిల బ్యాక్ వాటర్ లో పర్యాటక ఏర్పాట్లు, తిరుపతిలో కపిలతీర్థం నుంచి జూ పార్క్ వరకు ట్రామ్ ట్రైన్ వంటి పర్యాటక ప్రోత్సాహ ప్రాజెక్ట్ లను చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలో కేవలం రెండు జూపార్క్ లు మాత్రమే ఉన్నాయని, వాటిల్లో ప్రస్తుతం ఉన్న జంతువులతో పాటు కొత్త జాతులను కూడా తీసుకువస్తే, ప్రజల నుంచి మరింత ఆసక్తి, ఆదరణ పెరుగుతుందని అన్నారు. దీనిపై అటవీశాఖ, వన్యప్రాణి విభాగం అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల సరిహద్దు అడవుల నుంచి ఎనుగులు మనరాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలపైకి వస్తున్నాయని, అలాగే పంటలను నాశనం చేస్తున్నాయని, ఇటువంటి ఘటనలపై శాశ్వత పరిష్కరాలను పరిశీలించాలని అన్నారు. వన్యప్రాణులకు హాని లేకుండా, అటవీప్రాంతంలోని ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

నగరవనం కింద అర్భన్ ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రజలకు స్వచ్చమైన గాలి, అహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనంతో ఆరోగ్యకర పరిసరాలను అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఇప్పటికే 28 ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేశామని తెలిపారు. ఈ ఏడాది 14.94 కోట్ల రూపాయలతో ఆరు జిల్లాల్లో 16 నగరవనాల నిర్మాణంను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు.

అటవీభూముల్లో మైనింగ్ అనుమతుల విషయంలో అన్ని ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. మైనింగ్ కార్యక్రమాలు పూర్తయిన తరువాత సదరు భూమిలో మొక్కలను పెంచి, పచ్చదనంను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మైనింగ్ లీజుదారులపైనే ఉందని, అందుకోసం ముందస్తుగా వారి నుంచి డిపాజిట్ లను తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (అటవీ, పర్యవరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై. మధుసూదన్ రెడ్డి, స్పెషల్ కమిషనర్ (పిఆర్&ఆర్డీ) శాంతిప్రియ పాండే, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, పిసిసిఎఫ్ బికె సింగ్, పిసిపిఎఫ్ ఎకె ఝా, స్పెషల్ సెక్రటరీ రాహూల్ పాండే తదితరులు పాల్గొన్నారు.