Suryaa.co.in

Editorial

ప్రవీణ్ ఆశలకు గండికొట్టిందెవరు?

– అడిషనల్ సెక్రటరీ ఆశలు ఆవిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రవీణ్ ప్రకాష్, ఐఏఎస్. కొన్నేళ్ల క్రితం విశాఖ, గుంటూరు, విజయవాడ ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసు. ఆయనక్కడ కమిషనర్‌గా పనిచేశారు కాబట్టి. కానీ.. గత రెండున్నరేళ్ల నుంచి ఆయనంటే ఏమిటో ఏపీ ప్రజలందరికీ తెలిసిపోయింది. సీఎంఓ చీఫ్‌గా పనిచేశారు కాబట్టి. ఇక వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారుల సంగతి చెప్పనవసరం లేదు. ఆయనంటే హడల్. ఎప్పుడేం నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని సాగనంపుతారో తెలియని భయం. ఒక్క వారికేమిటి? అంత లావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకే ప్రవీణుడంటే వణుకు.

మరి అంత లావు పలుకుబడి ఉన్న ప్రకాష్ ‘ప్రావీణ్యం’ కేంద్రం వరకూ ఎందుకు వెళ్లలేకపోయింది? ఢిల్లీ వెళ్లి సెంట్రల్ అడిషనల్ సెక్రటరీ కావాలన్న ఆయన ఆశ ఎందుకు ఆవిరయింది చెప్మా? రెండు పదవులూ కావాలని జగన్ సారుపై ఒత్తిళ్లు తెచ్చినా, ప్రవీణ్ జమిలి ఆశలకు ఝలక్ ఇచ్చిందెవరు? చివరాఖరకు సర్దుకుని ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సివచ్చింది? ఇప్పుడు అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చలివి.

కుదరకపోతే ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెన్స్ కమిషనర్‌తోపాటు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి పదవులు జమిలిగా అనుభవించడం.. కుదిరితే కేంద్ర అదనపు కార్యదర్శిగా వెళ్లాలన్న ప్రవీణ్ ప్రకాష్ ఆశలు ఆవిరయిపోవడానికి, ఏపీ అధికారులే కారణమన్న చర్చ ఏపీ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎవరైనా ఐఏఎస్ అధికారి కేంద్ర సర్వీసులకు వెళ్లాలంటే దానికి బోలెడన్ని నిబంధనలు ఉంటాయి. ఆ ప్రకారం కేంద్ర కార్యదర్శి, అదనపు కార్యదర్శి హోదా లభిస్తుంటాయి.

అయితే ఇక్కడే ఓ తిరకాసు ఉంటుందని సీనియర్ ఐఏఎస్ అధికారులు అసలు గుట్టు విప్పారు. అదనపు కార్యదర్శిగా తీసుకోబోయే సదరు అధికారి గుణగుణాలపై కేంద్రం కింది నుంచి పై వరకూ నిశితంగా విచారణ నిర్వహిస్తుంది. దీన్ని వారి పరిభాషలో ‘360 డిగ్రీస్’ అని అర్ధం. అంటే సదరు అధికారితో కలసి
praveen1 పనిచేసిన అధికారులు, ఆయన కింద పనిచేసిన అధికారులు, ఆయనపైన పనిచేసిన అధికారులతో పాటు.. వివిధ మార్గాల్లో సదరు అధికారి గురించి విచారిస్తారు. ఆ పరీక్షలో కేంద్రం సంతృప్తి చెందితేనే సదరు అధికారికి ఆ హోదా ఇస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే కేంద్రం సదరు అధికారిని పూర్తి స్థాయిలో స్కానింగ్ చేస్తుందట.

ఇప్పుడు ఇదంతా ఎందుకనే సందేహం రావచ్చు. మోకాలికి-బట్టతలకూ ముడిపెట్టినట్లు.. ప్రవీణ్‌ప్రకాష్ ఆశలు గండిపడేందుకు- ఈ నిబంధనలకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించవచ్చు. అసలు తిరకాసు అక్కడే ఉందట. దానివల్లే ప్రవీణ్‌కు కేంద్ర సర్వీసులకు వెళ్లే అవకాశాలు మూసుకుపోయాయట. సీనియర్ అధికారుల సమాచారం ప్రకారం.. ప్రవీణ్ ప్రకాష్ గురించి కేంద్రం నిర్వహించిన ‘360 డిగ్రీల’ పరీక్షలో, ఆయన గురించి మెజారిటీ అధికారులు వ్యతిరేకంగానే సమాచారం ఇచ్చారట. ప్రవీణ్‌తో కలసి పనిచేసిన వారు, ఆయనపై అధికారులు, ఆయన కింద వివిధ శాఖల్లో పనిచేసిన అధికారులతోపాటు.. ప్రధాన కార్యదర్శుల స్థాయిలో పనిచేసి రిటైరయిన వారిని కూడా.. ప్రవీణ్ వ్యక్తిగత వ్యవహార శైలి, పనితీరు గురించి కేంద్రం వాకబు చేసిందట.

అయితే విచిత్రంగా మెజారిటీ సంఖ్యలోని అధికారులు, ప్రవీణ్‌కు వ్యతిరేకంగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కరు కూడా ఆయనకు సానుకూలంగా చెప్పలేదని, దూకుడు- ఒంటెత్తు పోకడ- వయసు-అనుభవం-సీనియారిటీతో సంబంధం లేకుండా అందరినీ అవమానిస్తారని.. సదరు అధికారులు, తమకు ఫోన్ చేసిన కేంద్ర ఉన్నతాధికారులకు పూసగుచ్చినట్లు సమాచారమిచ్చారట. అర్ధరాత్రి-అపరాత్రి కూడా వచ్చి పనిచేయడంతోపాటు, మిగిలిన వారిని కూడా వచ్చి తనతో పనిచేయమని ఒత్తిడి చేసేవారని ఆయన కింద పనిచేసిన అధికారులు కేంద్ర అధికారుల ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దానితో కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న ప్రవీణ్ ఆశలకు గండిపడినట్టయింది.

అవే కీలకమయ్యాయా..?
సీనియర్ అధికారుల సమాచారం ప్రకారం.. ఢిల్లీలో టీటీడీకి చెందిన ఆలయ నిధుల వ్యవహారంపై కూడా కేంద్రం తన దగ్గర ఉన్న సమాచారాన్ని, ఆయన కంటే సీనియర్ అధికారుల వద్ద వాకబు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రవీణ్‌కు ఢిల్లీలోని టీటీడీ ఆలయ అభివృద్ధి కోసం కొంత నిధులు కేటాయించింది. అయితే ఆయన వాటిని కురుక్షేత్ర, ఢిల్లీలోని ఆలయాలకు ఖర్చు పెట్టానని నివేదిక ఇవ్వగా.. ఢిల్లీకి చెందిన కొందరు, అందులో అవకతవకలు జరిగాయంటూ టీటీడీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈఓగా ఉన్న సింఘాల్ ఈ నిధులు విడుదల చేసినట్లు చెబుతున్నారు.

దానితో స్పందించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఆ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ మేరకు విజిలెన్స్ అధికారులు కొంతమేరకు విచారణ నిర్వహించిన క్రమంలో, ప్రవీణ్ సీఎంఓలో భాగమైన జీఏడీకి బదిలీ అయ్యారు. దానితో ఆ విజిలెన్స్ విచారణ ఏమయిందన్నది ఎవరికీ తెలియకుండా పోయింది. దీన్నిబట్టి.. ప్రవీణ్‌కు అదనపు కార్యదర్శి ఇచ్చే క్రమంలో జరిగిన 360 డిగ్రీల విచారణలో, ఆయనపై అధికారిగా ఉన్న నాటి టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ అభిప్రాయం కూడా కేంద్ర ఉన్నతాధికారులు తీసుకుని ఉంచవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి.

ప్రవీణ్ అర్బన్ వ్యవహారాల శాఖలో ఉన్నప్పుడు, ఆయనపై అధికారిగా ఉన్న నేటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అభిప్రాయం కూడా తెలుసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. ఇక ప్రవీణ్‌ప్రకాష్‌కు చార్జిమెమో ఇచ్చిన, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అభిప్రాయం కూడా తీసుకుని ఉండవచ్చని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రవీణ్‌కు సన్నిహితుడైన సింఘాల్ ఆయనకు అనుకూలంగా చెప్పినా, మిగిలిన ఇద్దరు ‘ఉన్నది ఉన్నట్లే’ చెప్పి ఉంచవచ్చని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఏదేమైనా ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ వారితో కీలకమైన పోస్టింగులు-పలుకుబడి కోసం అత్యంత సన్నిహితంగా ఉండాలని కోరుకునే అధికారులందరికీ ఇది ఓ గుణపాఠ’మని ఓ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు.

ఇటు సీఎంఓలో పనిచేస్తూనే, అటు ఢిల్లీ ఏపీ భవన్ బాసుగా కూడా ఏకకాలంలో జమిలిగా పనిచేస్తానని చివరిదాకా పట్టుపట్టినప్పటికీ ప్రవీణ్ కోరిక అక్కడా నెరవేరలేదు. ఒక్కచోట మాత్రమే పనిచేయాలని స్పష్టం చేయడంతో, విధిలేక ఢిల్లీకి వెళ్లక తప్పలేదని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీ ఏపీభవన్ చీఫ్‌గా వెళ్లడంతో, అప్పటివరకూ ఆ పోస్టులో ఉన్న ఆయన సతీమణి ఇప్పుడు కేంద్ర సర్వీసుకు వెళ్లారు.

LEAVE A RESPONSE