ఆకాశవాణి శ్రోతలకు ప్రయాగ నరసింహ శాస్త్రి సుపరిచితులు .వారిని ఈరోజు జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం ….
ప్రయాగ నరసింహ శాస్త్రి (నవంబరు 20, 1909 – సెప్టెంబరు 11, 1983) ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు.
జీవిత సంగ్రహం
తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన వ్యక్తి ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ‘ సెబాస్ ‘ అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో ప్రయాగ ఆకాశవాణి మదరాసు కేంద్రంలో నిలయ విద్వాంసుడుగా చేరారు. ‘ బావగారి కబుర్లు ద్వారా వీరు శ్రోతలకి చేరువయ్యారు. వీరు, గాడేపల్లి సూర్యనారాయణ గారు కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు. అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి. ‘ ఏమండోయ్ బావగారు ! రావాలి ! రావాలి ! ‘ అనే పలకరింపులు సహజమయ్యాయి. స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ.
జననం:నరసింహశాస్త్రి 1909 నవంబరు 20 న విశాఖపట్నం జిల్లా పెదగాడి గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై అపారమైన ప్రీతి. విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకొని పట్టభద్రులయ్యారు. శ్రీశ్రీ, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి వీరి సహాధ్యాయులు. ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్ద హరికథా గానంలో మెళుకువలు నేర్చుకొన్నారు. చక్కని గాత్రము రూపము ఉన్న ప్రయాగ 1935లో చలన చిత్రరంగ ప్రవేశం చేశారు.
భీష్మ చిత్రంలో విచిత్రవీర్యుని పాత్రను పోషించారు. నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో గణపతి పాత్రను పోషించారు. అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. 1969లో ఆకాశవాణిలో పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ చిత్రరంగంలో ప్రవేశించారు. చీకటి వెలుగులు, అందాల రాముడు, డబ్బుకు లోకం దాసోహం వంటి సినిమాలలో నటించారు.
ఆకాశవాణి మదరాసు కేంద్రంలో 1936 నుండి రెండు దశాబ్దాలు పనిచేశారు. అక్కడ వీరు ప్రసారం చేసిన మొద్దబ్బాయ్ HMV గ్రామఫోన్ రికార్డు కంపెని వారు రికార్డు చేసి విడుదల చేశారు. 20కి పైగా HMV రికార్డులు ప్రయాగ రిలీజ్ చేశారు. శ్రోతలలో వీరికంత ప్రశస్తి వుండేది. 1956లో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి బదలీ అయి వచ్చారు. అక్కడ సర్వశ్రీ పింగళి లక్ష్మీకాంతం, బందా కనకలింగేశ్వరరావు, బాలాంత్రపు రజనీకాంతారావు, జరుక్ శాస్త్రి, బాలమురళి, ఓలేటి వంటి పండితుల సాహచర్యం లభించింది.
విజయవాడలో ప్రయాగ గ్రామీణ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. ఎన్నో జానపద గేయాలను పాడి, పాడించి శ్రోతల మన్ననలందుకొన్నారు. హరికథలు స్వయంగా రచించి గానం చేశారు. త్యాగరాజ చరిత్ర, కన్యాకుమారి, గాంధీజీ, శంకర విజయం హరికథలు ప్రముఖాలు. 1962లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో గాంధీజీ బుర్రకథను వినిపించి బంగారు పతకంతో సన్మానించబడ్డారు. వీరి బుర్రకథలు HMV గ్రామఫోను రికార్డులుగా విడుదలైనాయి.
వినోదాల వీరయ్యగా విజయవాడ కేంద్రం నుండి ఎన్నో కార్యక్రమాలు సమర్పించారు. ఆకాశవాణి ప్రయాగకు ఆరోప్రాణం. 1969లో పదవీ విరమణ చేసేంతవరకు ఆయన ప్రయోక్తగా ఎన్నో కార్యక్రమాలు వెలువడ్డాయి. 1970 నుండి ఐదు సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీవారి పక్షాన ‘ బాలాజీ ఆర్ట్ థియేటర్ ‘ పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. 1980 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళా పీఠంలో యక్షగానాలు, హరికథల అధ్యాపకులుగా పనిచేశారు. హిందు ధర్మ ప్రచార పరిషత్ లో జానపద కళా ప్రచారకులుగా వ్యవహరించారు.
మరణం:1983 సెప్టెంబరు 11న పరమపదించారు. మాట, పాట, ఆటలతో శ్రోతల్ని సంబరపెట్టిన ప్రయాగ నిత్యోత్సాహి. ప్రయాగ నరసింహశాస్త్రి కుమార్తె వేదవతి ఆకాశవాణిలో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా నిజామాబాద్ లో పనిచేస్తున్నారు.
నటించిన సినిమాలు
భీష్మ – విచిత్రవీర్యుడు
త్యాగయ్య – గణపతి
చీకటి వెలుగులు
అందాల రాముడు
డబ్బుకు లోకం దాసోహం