– లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలి
– గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, డయాలసిస్ పేషంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
– మూడు రోజులు ప్రజలందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండేలా అప్రమత్తం చేయండి
–– జోనల్ ప్రత్యేక అధికారి ఆర్పీ సిసోడియా
మచిలీపట్నం : మొంథా తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తుపాను జోనల్ ప్రత్యేక అధికారి, చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో సంభవించనున్న భారీ వర్షాలు, ఈదురు గాలులకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై శాఖల వారీగా అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు.
జిల్లాలో తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా ముందుగానే లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, డయాలసిస్ పేషెంట్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పునరావాస కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు బిస్కెట్లు, బ్రెడ్లు, తాగునీరు ఎక్కువమొత్తంలో నిల్వ చేసుకోవాలని, అవసరమైన ఔషధాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
మూడు రోజులు ప్రజలందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండేలా దండోరా వేయించి అప్రమత్తం చేయాలని, వారు ముందుగానే నిత్యవసర సరుకులు నిల్వ చేసుకోవాలని, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు, బ్యాటరీ బ్యాకప్ లు సిద్ధంగా ఉంచుకునే విధంగా క్షేత్రస్థాయి అధికారుల ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. కాజువేలపై ఎలాంటి వాహనాల రాకపోకలను అనుమతించవద్దని, బీచ్ ల వైపు సందర్శకులెవరినీ అనుమతించకుండా పోలీసు అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కే చంద్రశేఖర రావు, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, బందరు ఆర్డిఒ కే స్వాతి, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ మోహన్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, పశు, మత్స్య, విద్యుత్, ఆర్ అండ్ బి, వ్యవసాయ శాఖల అధికారులు చిన్న నరసింహులు, అయ్యా నాగరాజా, సత్యానంద్, లోకేశ్వరరావు, ఎన్ పద్మావతి, డిపిఓ డాక్టర్ జె అరుణ, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.