Suryaa.co.in

Entertainment

కడవెత్తుకొచ్చి కలెక్షన్లు..!

ఒక సూపర్ హిట్టు నవల
దానికి దృశ్యకావ్యరూపం..
అద్భుతమైన వాణిశ్రీ రూపం
అంతకంటే అద్భుతం
అక్కినేని అభినయం..
కె.ఎస్.ప్రకాశరావు
దర్శకత్వ పటిమ..
మామ పాటల పాటవం
ఘంటసాల,సుశీల..
మధ్యలో ఎల్లార్ ఈశ్వరి
ఉర్రూతలూగించే పాటలు..
భారీ సెట్టింగులు..
అన్నిటినీ మించి

రామానాయుడు లక్కు..
వెరసి ప్రేమనగర్ కిక్కు…!

అంతము లేని
ఈ భువనమంత
పురాతన పాంధశాల..
సినిమా పొద్దుపొద్దునే
అదరగొట్టిన ఘంటసాల..
ఎవరి కోసం..ఎవరి కోసం
అంటూ చివరి సీన్ వరకు
అదే మెరుపు..
అదే మైమరపు
మధ్యలో ఓ వెలుగు..
తేట తేట తెలుగు..
ఎవరో రావాలి
నీ హృదయం కదిలించాలి..
నీ తీగలు సవరించాలి
వాణిశ్రీ ఆవేదన..
సుశీలమ్మ గొంతులో వేదన..
అంతకు ముందు
అదే గొంతు సవరించి
ఉంటే ఈ ఊళ్ళో ఉండు
పోతే నీ దేశం పోరా..
ఆ గొంతులో ఏం మత్తు..
అదోలాంటి గమ్మత్తు..
మధురగాయని మహత్తు..!
లే లే లే లేలేలే నా రాజా
లేలే నారాజా..
కుర్రకారును కుదిపేసిన
ఈశ్వరి పాట..
జ్యోతిలక్ష్మి ఆట
కళ్యాణ్ బాబు సయ్యాట..
ఆత్రేయ కలం
పండించిన పంట
వాణిశ్రీకి ఒళ్ళు మంట..!

మనసు కవి
అద్భుత ఆవిష్కరణ..
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే..
ఓ చారిత్రక డిక్లరేషన్..
ఆత్రేయ మాత్రమే
క్రియేట్ చేయగల సెన్సేషన్..
చివరగా నాగయ్య గారి ఆపరేషన్..
ముక్కచెక్కలైన హృదయం..
బద్దలైన గ్లాసు..
రక్తం నింపి లత ఇచ్చిన డోసు
మొత్తంగా సినిమా
హై కలాసు!

జమీందారీల్లో పిల్లల పెంపకం
నౌకర్ల ప్రాపకం..
ఆస్తుల కోసం కుట్రలు..
వదినమ్మల యుక్తులు
మరీ పులి మీద పుట్రలు..
హీరోయిన్ ఇంట
కుంటి తండ్రి..
పనికిరాని అన్న..
వగలాడి వదిన..
అన్నీ సినిమా కష్టాలు..
వాటి నడుమ
అలసిపోని ఆత్మాభిమానం
లతా..ఎందుకు చేసావీ పని
ఒక్క మాటకే
ఉద్యోగానికి రాజీనామా..
ప్రేమకు పంచనామా..
విషం తాగే దాకా
నిమిషం కూడా తగ్గని రోషం..
చివర్లో సంతోషం!!

ఆది నుంచి అంతం వరకు
అదే బిగి..
వ్యసనపరుడిగా..
ప్రేమికుడిగా
ఏయెన్నార్ నటవిశ్వరూపం
వాణిశ్రీ తలకట్టు..చీరకట్టు..
వాచీ సెట్టు..అంతా అపురూపమైన కనికట్టు..
ఎస్వీఆర్ విరాగం..
శాంతకుమారి సరాగం..
గుమ్మడి కుంటికులాసం..
కాకరాల రేసోత్సాహం..
సత్యనారాయణ విలనీవిలాసం
కిన్నెరసాని రమాప్రభని దొరసానిగా చూపించి
రాజబాబు ఉల్లాసం..
ఉన్ని బట్టలు కాదు తన్ని ఉన్న బట్టలు ఊడ్పిస్తాడంటూ
కెవి చలం ఉక్రోషం..
ఎవరి పాత్రలో వారు..
పాత్రోచితంగా నటించినా
ఇది అక్కినేని బొమ్మ..
వాణిశ్రీ సినిమా..
ఓ అపురూప కథకు
అపూర్వ వీలునామా!
సురేష్ ప్రొడక్షన్స్ దృశ్యకావ్యం ప్రేమనగర్ కు యాభై రెండేళ్లు..

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE