మంత్రి జూపల్లి
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ అని, వారి సేవలు చిరస్మరణీయమని ఎక్సైజ్. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించకుని కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వారి చిత్ర పటానికి మంత్రి జూపల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నే ఆశ, శ్వాసగా జీవించి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాడి మలి దశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్ మార్గదర్శనంగా నిలిచారన్నారు. ఆచార్య జయశంకర్ మన మధ్య లేనప్పటికీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.. ఆచార్యుని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు.