శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది.రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. కౌంట్ డౌన్ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన పిదప వాహకనౌక నింగిలోకి పయనించింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) వాణిజ్య పరమైన రెండో మిషన్ ఇది. సింగపూర్, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.డీఎస్-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్‌ను కలిగి ఉంది. ఎన్‌ఇయూఎస్‌ఏఆర్ అనేది ఎస్‌ఏఆర్ పేలోడ్‌ను మోసుకెళ్లే సింగపూర్‌కు చెందిన మొట్టమొదటి బుల్లి వాణిజ్య ఉపగ్రహం. పీఎస్‌ఎల్వీ సీ53 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.