ప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాలకు కన్నాలు వేయడం ఏమిటో?

-చట్టాల ఉల్లంఘన కోర్టు దృష్టికి తీసుకు వెళ్దాం
-ఇది ధృతరాష్ట్ర పాలన… కంస ప్రభుత్వం
-జగనన్న విద్యా వంచన పథకం ఆపివేయాలి
-పోలీసులు… ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండదు
-ప్రభుత్వం, పోలీసుల నుంచి రక్షణ కోరుకునే పరిస్థితి సామాన్యుడికి ఎదురుకావడం దురదృష్టకరం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న తీరును న్యాయస్థానాల దృష్టికి తీసుకు వెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి, ప్రత్యేకించి పోలీసుల నుంచి రక్షణ కోరుకునే పరిస్థితి రాష్ట్రంలో తలెత్తడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పెద్దలు చెప్పినట్లుగా ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అంటే ఓటు వేసి గెలిపించినందుకు ఇబ్బందులు పడక తప్పదన్నారు.

మనల్ని అడుక్కుంటే, మన దయాదాక్షిన్యాలతో పరిమిత కాలానికి ఏర్పడిన ప్రభుత్వం …దిగిపోయే వరకు ఈ తిప్పలు తప్ప ఉన్నారు. అయితే సామాన్యులు న్యాయస్థానాలను ఆశ్రయించాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని అని, సామాన్యులకు న్యాయం అందజేయడానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవారు, న్యాయవాదులు ముందుకొచ్చి ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి, వారి తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాలకు కన్నాలు వేయడం విడ్డూరమని మండిపడ్డారు.

గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల నుంచి 800 కోట్ల రూపాయలను కొట్టివేయడం, గాలికి పొంతనలేని కథ వినిపించడం హాస్యాస్పదమన్నారు. ఈ తరహా అకౌంట్ మిస్ మేనేజ్మెంట్ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వమే తన ఖాతాలలోని డబ్బులను దొంగిలించిందని… దొంగ వారి మీద ఫిర్యాదు చేసినట్లుగా ప్రభుత్వంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్న ఆయన, పోలీసులు ఫిర్యాదులు తీసుకోక పోగా, ఫిర్యాదు దారుడు పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందుకే ఉద్యోగులు తమ ఖాతాలలో నుంచి డబ్బు మాయమైన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.. న్యాయం జరగడానికి ఆలస్యం కావచ్చు కానీ, అంతకంటే మరో మార్గం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ధృతరాష్ట్ర పాలన, కంస ప్రభుత్వమని రఘురామకృష్ణం రాజు విరుచుకు పడ్డారు. ఈ కౌరవుల నుంచి మనలను రక్షించడానికి ఏ కృష్ణుడు లేడని, ఒకవేళ శ్రీకృష్ణుడు వచ్చిన ఏమి చేయలేరన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగులో ఉన్న డిఏ బకాయిలను చెల్లించాలంటే పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పుచేసి ఒక్క నెలలోనే ఖర్చు చేసిందన్నారు.

ఇంకా మా ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదన్నారు. వైయస్సార్ ఖాతా కాళీ పథకం కింద ప్రైవేటు అకౌంట్లో నుంచి కూడా డబ్బులు ఎక్కడ ఖాళీ చేస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు, అయితే, ప్రైవేటు అకౌంట్లో నుంచి ప్రభుత్వం డబ్బులు ఖాళీ చేసే అవకాశం లేదన్న ఆయన , అది కేవలం హ్యాకర్లకు మాత్రమే సాధ్యమని, ప్రభుత్వం చేయబోదని… ప్రజలు ఆందోళన చెందవలసిన పని చెప్పారు.

14 వేల పోస్టులు భర్తీ చేయకుండా రద్దు చేసేందుకు కుట్ర
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14వేల ఉపాధ్యాయ పోస్టులను ఖాళీ చేయకుండా, రద్దు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు అంటూ కాకి గోల చేస్తున్న ముఖ్యమంత్రి, నిబంధనలను దుర్వినియోగం చేస్తూ స్కూల్ లను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బుద్ధి జీవులైన పాలకులు ప్రతి గ్రామంలో ఒక ప్రైమరీ పాఠశాల ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. క్లాస్ కు 20 మంది విద్యార్థులు ఉంటే, వారిపై ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టడమే కాకుండా… విద్యార్థులకు టీచర్లు చెప్పే పాఠాలు అర్థమవుతాయన్నారు.

కానీ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గ్రామాలలోని ప్రైమరీ పాఠశాలలను ఎత్తివేస్తూ, స్కూలుకు ఒక టీచరే ఉండేలా కుట్ర చేస్తుందన్నారు. స్కూళ్ళ ఎత్తివేతపై ఇప్పటికే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు రోడెక్కరన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతోనైనా ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయకపోయినా, ఉన్నవి తొలగించుకుంటే చాలు రా బాబు అని రాష్ట్ర ప్రజలు అనుకునే పరిస్థితి దాపురించిందన్నారు.

విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి… విద్యా వసతిని కల్పిస్తున్నామంటే… దాన్ని విద్యా వసతి అనలా?, విద్యా వంచన అనలా అని ఆయన ప్రశ్నించారు. నూతన ఉపాధ్యాయ నియామకాలు లేకపోగా, ఉన్న ఉపాధ్యాయులకు జీతభత్యాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నానని చెప్పుకునే ముఖ్యమంత్రి, విద్యా వ్యవస్థ పై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓ పది ఓట్లు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పడవని చెప్పిన ఆయన, ఆ పది ఓట్లు కూడా పాఠశాలలలో చదివే పిల్లలు లేని తల్లిదండ్రులు మాత్రమే వేస్తారు అన్నారు.

నాణ్యమైన విద్య అంటే, నోటుబుక్కు లు, టెస్ట్ బుక్ లను అందించలేకపోవడమేనా? అంటూ ఎద్దేవా చేశారు. వద్దురా బాబు నీ అమ్మ ఒడి పథకం అని ప్రజలు అనుకుంటున్నారని… అమ్మ ఒడి పథకం చెల్లించాల్సి వస్తుందని ఇంకా ఎంతమంది విద్యార్థులను ఫెయిల్ చేస్తావంటూ వారు మండిపడుతున్నారని చెప్పారు. ఉత్తీర్ణతా శాతం పడిపోవడానికి కరోనానే కారణమని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారని, మరి తెలంగాణలో లేదా? , అక్కడ ఎందుకు ఉత్తీర్ణత శాతం అధికంగా ఉందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ విద్యా వంచన పథకాన్ని కల్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని ఈ ప్రభుత్వం ఆపివేయాలని తన విజ్ఞప్తి అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

అర్ధరాత్రి హంగామా అవసరమా?
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి అదుపులోకి తీసుకోవడం పై రఘురామకృష్ణం రాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అంటే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతారని, దానికి అర్థరాత్రి ఇంటి పైకి వెళ్లి బీభత్సం చేయడం అవసరమా ?అని ప్రశ్నించారు. గతంలో నే న్యాయస్థానం 41 ఏ కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని స్పష్టమైన తీర్పును ఇచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్య మంత్రి పోలీసుల గురించి ఏమి మాట్లాడారో, ఈ సందర్భంగా వీడియోలను ఆయన ప్రదర్శించారు. ఎల్లకాలము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదని, ప్రజల పక్షాన ఉండాలని పోలీసులను కోరిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు. ఎల్లకాలము జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉండరని పోలీసులు నియమ నిబంధనలను పాటిస్తే మంచిదని రఘురామకృష్ణం రాజు అన్నారు. సిఐడి చీఫ్ వెళ్లి పట్టుకు రమ్మన్నాడు కదా అని.. అర్ధరాత్రి, అపరాత్రి ప్రజల ఇళ్లపైకి వెళ్లవద్దని హెచ్చరించారు.

సీఎం ఫెయిల్ అయినట్టే కదా
ముఖ్యమంత్రికి తెలియకుండానే ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో కల్పించిన వసతి గృహాలను ఖాళీ చేయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారంటే, ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టే కదా? అ ని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులను వసతి గృహాల నుంచి ఖాళీ చేయమని ఉత్తర్వులు వెలువడిన రెండు గంటల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిస్తూ… మరో రెండు నెలల పాటు ఉద్యోగులకు వసతి గృహాలలో ఉండే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దానికి ఓ ఉద్యోగ సంఘం నేత జగన్మోహన్ రెడ్డి దయార్ధ హృదయుడని కితాబునిస్తూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.. రెండు నెలల పాటు వసతి సౌకర్యాన్ని కల్పించినందుకు అముల్ పాలతో అభిషేకం చేసి సన్మానాలు చేయండి అంటూ ఎద్దేవా చేశారు.

కోర్టు నుంచి రక్షణ కోరుతా…
భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. లంచ్ మోషన్, లేదంటే హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాని పాల్గొన్న బహిరంగ సభకు హాజరయ్యేందుకు తనకు రక్షణ కల్పించాలని, తనకు ఏమైనా జరిగితే రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దే బాధ్యత అని పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు.

గతంలో ప్రభుత్వ పెద్దలు దొంగ పోలీసుల చేత తనని కిడ్నాప్ చేయించి హత్య చేయాలని పథక రచన చేశారని పేర్కొన్నారు. రామకృష్ణారెడ్డి అనేవాడు తన ఇంటి వద్ద రెక్క నిర్వహించాలని చెప్పినా , ఇప్పటివరకు పోలీసులు ఆ కేసును విచారించిన పాపాన పోలేదన్నారు. చంపుకుంటూ… ప్రత్యర్ధులను లేపుకుంటూ పోవడమే ఈ ప్రభుత్వ పరిపాలన అన్న ఆయన, తాను ఏ కారణం చేతనైనా ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు హాజరు కాలేకపోతే… సభను విజయవంతం చేయాలని కోరారు. తాను భీమవరం లో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేది… లేనిది స్పష్టం చేస్తానని చెప్పారు.

Leave a Reply