– అందుకే ఆయనకు టీఆర్‌ఎస్ మద్దతు
– 10 వేల బైక్ లతో భారీ ర్యాలీ
– ర్యాలీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని, మహమూద్ అలీ
రాష్ట్రపతి అభ్యర్ధికి యశ్వంత్‌సిన్హానే సరైన అభ్యర్ధి కాబట్టే సీఎం కేసీఆర్ ఆయనకు మద్దతునిచ్చారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ అన్నారు. జలవిహార్ లో జులై 2న నిర్వహించే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిలు మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జులై 2న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారని తెలిపారు. బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలుకుతారని చెప్పారు.
10 వేల బైక్ లతో భారీ ర్యాలీగా బేగంపేట, రాజ్ భవన్ రోడ్, నెక్లెస్ రోడ్ మీదుగా జలవిహార్ చేరుకోవడం జరుగుతుందని వివరించారు. యశ్వంత్ సిన్హా కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అహంకారపూరితంగా, నియంతృత్వంగా దేశాన్ని పాలిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. న్యాయ కోవిదులు, భారత విదేశాంగ విధానం తెలిసిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారని తెలిపారు. యశ్వంత్ సిన్హాకు అద్భుతమైన స్వాగతం పలుకుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బాలరాజ్ యాదవ్, శైలేందర్, బాబురావు, కృష్ణగౌడ్ తదితరులు ఉన్నారు.