Suryaa.co.in

Andhra Pradesh

1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు, పంచదార

• కిలో కందిపప్పు రూ.67… అర్ధ కిలో పంచదార రూ.17
• రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్ధ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కారుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిలో కందిపప్పు ధర రూ.67, అర్ధ కిలో పంచదార రూ.17గా నిర్ణయించారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కిలో రూ.163 ధర ఉన్న కందిపప్పును రేషన్ కార్డుదారులకు రూ.67కి అందిస్తున్నాం. రూ.96 సబ్సిడీ ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో రెండుమార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశాం. రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం రూ.150కి, బియ్యం (స్టీమ్డ్ – బీపీటీ/సోనా మసూరి) రూ.48, బియ్యం (పచ్చి – బీపీటీ/సోనా మసూరి) రూ.47కి విక్రయించేలా చూశాం.

ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటే … ప్రజలకు, పేదలకు నిత్యావసరాలు అందుబాటు ధరల్లోకి తీసుకురావడమే. అదే విధంగా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న ప్రజలకు నిత్యవసరాలు ఇచ్చేలా శాఖను సన్నద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. ఇటీవల సంభవించిన వరదల సమయంలో బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు అందించాం” అన్నారు.

LEAVE A RESPONSE