Suryaa.co.in

Entertainment

పుండరీకాక్ష..సినిమా ఆయన కాంక్ష!

నీ జీవితం మీద
నాకు విరక్తి కలుగుతోంది..
ఈ మాట
కర్తవ్యం సినిమాలో అన్నాడేమో గాని
ఆ పెద్దమనిషికి బైస్కోపంటే
వల్లమాలిన అనురక్తి..
ఎన్టీరామారావంటే
మహా పిచ్చి!
ఈ రెండే ఆయన్ను సినిమా వైపు నడిపాయి..
వాటితోనే ఆయనయ్యాడు ఎన్టీఆర్ సైన్యంలో వీరసిపాయి!!

నేడే తెలిసింది..
ఈనాడే తెలిసింది..
కమ్మని పాటకు రూపం వస్తే
అది రఫీలాగే ఉంటుందని..
పుండరీకాక్షయ్యకు
రఫీ అంటే “ఆరాధన”..
అందుకే ఏరికోరి
ఆ మధురగాయకుడి నోట
గోపాల బాల నిన్నే కోరి..
ఆయన గళాన్ని
రెండు సినిమాల్లో
తెలుగు వారి
సన్నిధి చేర్చి..
అద్భుత గీతాలు పేర్చారు..!

తెనాలి రామకృష్ణ
తర్వాత ఎన్టీఆర్ కు మరోసారి
దేవరాయలు వేషం కట్టబెట్టి
తెలుగు వల్లభుండనుచు
రాజసంగా చూపెట్టి
గుమ్మడిని తిమ్మరుసుగా
నిలబెట్టి నాటి
రాయల కథను
నేటికిని తలపోయు రీతిగా తీసిన పుండరీకాక్షయ్య
నందమూరికి వరసకి బావ
ఎన్టీఆరే చూపించారు ఆయనకి
సినిమా త్రోవ..
అందుకే సమ్మోహనంగా శ్రీకృష్ణావతారం తీసి
చేసుకున్నాడు
తన జన్మధన్యం
అలా తీర్చుకున్నాడు
నందమూరి రుణం..!

అఖిలాంధ్రకు అన్నని
భలేతమ్ముడు చేసి
నీ నామం వింటూ ఉంటే నిలువెల్లా పులకించేను
నీ రూపం కంటూ ఉంటే నన్ను నేనే మరిచేను..
అంటూ నందమూరిని
మనుషుల్లో దేవుడుగా
కొలిచాడు..తరించాడు
ఈ అట్లూరి సినిమా
పుండరీ”కాంక్ష”య్య..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE