Suryaa.co.in

Andhra Pradesh

పురందరేశ్వరీ టిడిపి కోసం పనిచేస్తున్నారు

– టిడిపి తరుఫున వకాల్తా పుచ్చుకున్నారు
– ఆమె వైఖరిని బిజెపి నాయకులే తప్పు పడుతున్నారు
– బిజెపి అధ్యక్షురాలిగా కాకుండా చంద్రబాబు వదినగా మాట్లాడుతున్నారు
– మద్యంపై వాస్తవాలు తెలియకుండా పురందరేశ్వరి మాట్లాడారు
– ఈ రాష్ట్రంలో అన్ని డిస్టలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు
– సీఎం వైయస్ జగన్ ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు
– విజయసాయిరెడ్డిపై ఆమె వ్యాఖ్యలు హాస్యాస్పదం
– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలోని కనకదుర్గానగర్ లో ఆదివారం మూడు ఇండోర్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…

మద్యం పాలసీపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వాఖ్యలను ఖండించారు. ఈ రాష్ట్రంలో అన్ని మద్యం తయారీ డిస్టలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతులు ఇవ్వలేని స్పష్టం చేశారు. అది కూడా తెలియకుండానే పురందరేశ్వరి మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ఇదే విషయంలో వైయస్ఆర్ సిపి ఎంపి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

పురందరేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షరాలిగా కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడుతున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ తరుఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఆమె వైఖరిని బిజెపి నేతలే తప్పుపడుతున్నారు. చిత్తూరుజిల్లా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి తాజాగా పురందరేశ్వరి వైఖరిపై చేసిన విమర్శలు అందరూ చూశారు. పురందరేశ్వరీ బిజెపి నేతగా కాకుండా చంద్రబాబు వదినగా పనిచేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం కోసం పనిచేయడాన్ని అందరూ గర్హిస్తున్నారు.

‘తూర్పు నియోజకవర్గంలో రూ.40 కోట్ల అభివృద్ది పనులు’
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ద్వారా రూ.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కనకదుర్గానగర్, అయ్యప్పనగర్, మారుతీ కో-ఆపరేటీవ్ కాలనీల్లో దాదాపు రూ. 20.30 కోట్ల రూపాయల వ్యయంతో మూడు ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించామని, నేడు వాటిని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విజయవాడ నగరంలో స్థలం లభించడం ఇబ్బందిగా ఉండటం వల్ల ఇండోర్ సబ్ స్టేషన్లను నిర్మించి, నగరంలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

‘కరకట్ట నిర్మించాలనే ఆలోచన ఎవరూ చేయలేదు’
విజయవాడ నగరంలో కృష్ణలంక ప్రాంతంలోని ప్రజలకు వరదముంపు నుంచి రక్షణ కల్పించేందుకు కరకట్ట నిర్మించాలనే ఆలోచన ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి రాగానే కరకట్ట నిర్మాణంను పూర్తి చేసి, కృష్ణలంక ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కల్పించారని అన్నారు.

‘దేవినేని అవినాశ్ ను ఆశీర్వదించండి’
దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాశ్ ను ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు కేవలం నినాదాలు ఇవ్వడానికే పరిమితం కాకూడదని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి, మరింత మద్దతు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇన్ చార్జి దేవినేని అవినాశ్, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్, పుండ్కర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE