Home » కాలుష్యపు కోరల్లో ఢిల్లీ నగరం

కాలుష్యపు కోరల్లో ఢిల్లీ నగరం

దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటింది. ప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరాలు ఏదైనా ఉన్నదా అంటే దానికి సమాధానం ఢిల్లీ అని చెప్పవచ్చు. తీవ్ర స్థాయిలో విషపూరిత పొగమంచు దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. దేశ రాజధాని నగరం నరకంలా మారింది. ఢిల్లీలో వరుసగా మూడో రోజూ, వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఇవాళ వాయు నాణ్యత సూచీ 504కి చేరింది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని నరకంగా మార్చేసిన వాయు కాలుష్యం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్‌ కమర్షియల్‌ వాహనాలు, డీజిల్‌ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ ప్రకటించింది. కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్తాన్‌లోని హనుమాన్‌గఢ్, భివాడీ, శ్రీగంగానగర్, హరియాణాలోని హిసార్, ఫతేబాద్, జింద్, రోహ్‌తక్, బహదూర్‌గఢ్, సోనేపట్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, బాఘ్‌పట్, మీరట్, నోయిడా, గ్రేటర్‌ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది.

ఢిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, యుపి, హర్యానా పంజాబ్ రాష్ట్రాలలో పంటలను తగులపెట్టడం వలన అలాగే పరిశ్రమల నుండి వెలువడుతున్న విష వాయువుల వల్ల విపరీతమైన దుస్థితి ఏర్పడింది.

ఈ పాపం నాది కాదు అంటే నాది కాదని రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వాయుకాలుష్యం ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 507, అలాగే రెస్పిరబుల్ పార్టీకులెట్ మ్యాటర్ 538, నైట్రోజెన్ డయాక్సయిడ్ 36, సల్ఫర్ డయాక్సయిడ్ 15, ఓజోన్ 75, కార్బన్ మోనాక్సయిడ్ 24 గా ఉంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వయోజనులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది.

అందుక్కారణం కరోనా కొత్త వేవ్ కాదు. కోరలు చాచిన వాయు కాలుష్యం ఈ దుస్థితిని తీసుకొచ్చింది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారుతుంది. రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే మానవ తప్పిదాలు ఈ వాయు కాలుష్యం స్థాయిలను మరింత పెంచి పీల్చే గాలిని విషతుల్యం చేస్తున్నాయి. ఢిల్లీ నగరంలోని వాహన ఉద్గారాలు తోడు పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ శీతాకాలంలో సహజసిద్ధంగా ఏర్పడే పొగమంచులో కలిసిపోయి ఊపిరి పీల్చుకోలేని ఉక్కిరిబిక్కిరి పరిస్థితి సృష్టిస్తున్నాయి. భవన నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే దుమ్ము, ధూళి అన్నీ కలగలిపి గాలి నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

పొల్యూషన్ మానిటరింగ్ మెకానిజం లేక, ప్రజలకు కాలుష్యం దుష్ప్రభావాలు తెలియక తీవ్ర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక మరియు సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ మరియు నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి మరియు వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి తోడ్పడుతుంది. వాయువులు, కణాలు మరియు జీవ అణువులతో సహా హానికరమైన లేదా అధిక పరిమాణంలో ఉన్న పదార్థాలను భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశపెట్టినప్పుడు వాయు కాలుష్యం సంభవిస్తుంది. ఇది మానవులకు వ్యాధులు, అలెర్జీలు మరియు మరణానికి కారణం కావచ్చు; ఇది జంతువులు మరియు ఆహార పంటలు వంటి ఇతర జీవులకు కూడా హాని కలిగించవచ్చు మరియు సహజమైన లేదా నిర్మించిన వాతావరణాన్ని దెబ్బతీస్తుంది.

మానవ కార్యకలాపాలు మరియు సహజ ప్రక్రియలు రెండూ వాయు కాలుష్యాన్ని సృష్టించగలవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, వాయు కాలుష్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 మిలియన్ల మంది మరణాలకు కారణమైంది. పరిశ్రమలు, రవాణా మొదలైన ప్రజల కార్యకలాపాల ద్వారా తయారైన విష పదార్థాలు సమాజాన్ని చుట్టే గాలిని కలుషితం చేస్తాయి. ప్రధాన కాలుష్య కారకాలు దహన, చెత్తను తగులబెట్టినప్పుడు, రసాయన ప్రతిచర్యల వల్ల దుమ్ము మరియు మసి. ఆటోమొబైల్ పెట్రోలియం వాహనాల ద్వారా ఎగ్జాస్ట్ గ్యాస్ వంటి సల్ఫరస్ వాయువులో ఉండే నత్రజని ఆక్సైడ్లు . కాలుష్యం ప్రజల ఆరోగ్యన్ని , ఆస్తిని , జంతువులు మరియు మొక్కలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

సహజ పరిస్థితులు, క్షీణత మరియు శ్వాసకోశ వ్యాధులు వంటి శ్వాసకోశ వ్యాధులు, శ్వాసనాళ ఆస్తమా (ఉబ్బసం) వంటి వివిధ వ్యాధుల ప్రేరణ. వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే PM 2.5 , PM 0.5 వంటి చక్కటి రేణువుల హానికరమైన పదార్థాలను కలిగి ఉంది. వేగవంతమైన పారిశ్రామికీకరణకు అనుగుణమైన బొగ్గు, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ గ్యాస్‌లో కంబషన్ పెరుగుదల, పెద్ద నగరాల్లో ఇంధనం వినియోగం వేగంగా పెరగడం వంటి పెట్రోకెమికల్ ఇంధన ఇంధనాల యొక్క అధిక వినియోగం కాలుష్యానికి కారణమని చెప్పబడింది. పర్యావరణ సాంకేతికతలు మరియు పర్యావరణం సరిగా లేకపోవడం. పరిశ్రమల ద్వారా భయంకరమైన పొగలు, వ్యర్థాలు, వాసనలు వస్తున్నా పట్టించుకోని కాలుష్య నియంత్రణ అధికారులుతో నివాసితులకు అసౌకర్యానికి అనారోగ్యానికి గురి అవుతున్నారు.

వాయు కాలుష్యంతో సహా పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎంతో అవసరం. ఏసీ లు, రిఫ్రిజిరేటర్లు విపరీతంగా వాడడం వలన క్లోరోఫ్లోరో కార్బన్లు, ద్రావకాలు మరియు రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే వాయువుల ద్వారా ఓజోన్ పొరను నాశనం చేసి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు సాంద్రత పెరగడం వల్ల గ్రీన్హౌస్ ప్రభావం వాతావరణంలో పర్యావరణ విధ్వంసం సమస్యగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కరోనా పారద్రోలడానికి యజ్ఞాలు యాగాలు,లైట్లు ఆర్పీ మొబత్తి వెలిగించి, చప్పట్లు కొట్టి వైరస్ ని నియంత్రించవచ్చు, కాషాయాలు త్రాగి స్వస్థత చేకూర్చమని ప్రజలకు సలహాలిస్తున్న దేశంలో. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే లక్ష్మీదేవి ఫోటో పెడితే ఆర్థిక రంగం పరిగెడుతుంది అన్న మేధావులున్న దేశంలో కాలుష్య సమస్యకు పరిష్కారం దొరక్కపోదు.

డా. యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక
9989988912

Leave a Reply