Suryaa.co.in

Features

తెలుగు నాట తొలి విజనరీ.. రామోజీ

– విక్రమ్‌ పూల

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం నాతోపాటు అందర్నీ ఆవేదనకు, బాధకు గురి చేస్తుంది. రామోజీరావు గారు తెలుగు సమాజానికి, దేశానికి చేసిన సేవలు విస్తృతం, అనన్య సామాన్యం. ఓ దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ విలువలు పతనం అవుతున్న దశలో రామోజీరావు గారు ఈనాడు ద్వారా సాగించిన అక్షర యజ్ఞం, రాజీలేని పోరాటం తెలుగునాట రాజకీయ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అప్పుడేకాదు.. నిన్నటి వరకూ తన చివరి శ్వాస వరకు అదే పంథా సాగించడం వల్లనే నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది.

తెలుగువారిలో మొదటి విజనరీ రామోజీరావు గారేనంటే చాలా మందికి అభ్యంతరం ఉండకపోవచ్చు. పత్రికా రంగంలో, సాంకేతికరంగంలో రాబోయే మార్పులను ముందుగానే ఊహించి తన సంస్థలలో వాటిని అమలు చేసిన ఘనత ఆయనది. దినపత్రికలో వార్తలతోపాటు వివిధ వర్గాల పాఠకుల అభిరుచిని గమనంలోకి తీసుకొని ఆరోగ్యం, సినిమా, వ్యాపారం, విద్య మొదలైన అంశాలపై ప్రత్యేక పేజీలు వెలువరించడం, జిల్లా పేజీలు.. మళ్లీ అందులో పట్టణాల వారీగా, డివిజన్‌ల వారీగా వార్తలు అందించి పత్రిక వ్యాప్తిని నలుమూలలకు తీసుకెళ్లగలిగారు. ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంచడంలో ఈనాడు పాత్రను ఎంత ఎక్కువగా చెప్పినా అది తక్కువే అవుతుంది. జర్నలిజంలో ఆయన నెలకొల్పిన ప్రమాణాలు అత్యున్నతమైనది. సెన్సు, బ్యాలెన్సు ఉన్న పత్రికాధిపతిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పుట్టుకతోనే జర్నలిస్ట్‌లు (బార్న్‌ జర్నలిస్ట్స్‌) అవుతారనే నానుడిని మార్చి.. సామాన్యుల్ని కూడా సానబెట్టి అసాధారణ జర్నలిస్ట్‌లుగా తయారుచేయవచ్చునని నిరూపించిన మహోన్నతులు. తన పత్రికను పంచప్రాణాలు పెట్టి చూసుకున్న ఏకైక పత్రికాధిపతి. ఒక చిన్న తప్పు కూడా జరగకుండా ప్రతి అంశాన్ని పరిశీలించి, పరిశోధించి, పరిష్కరించి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్న నిత్యాన్వేషి.

1984 ఆగస్ట్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దించివేసినపుడు.. ఎన్టీఆర్‌ సాగించిన ప్రజాస్వామ్య పోరాటానికి రామోజీరావు అందించిన నైతిక బలం, సహకారం వెలకట్టలేనివి. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం పాల్పడిన అప్రజాస్వామిక అనైతిక చర్య దేశ ప్రజలందరికీ తెలియజెప్పడానికి ఆనాడు ‘ఎడిటర్స్‌ గిల్డ్‌’ అధ్యక్షుడిగా ఉన్న రామోజీరావు గారు.. ప్రముఖ జర్నలిస్ట్‌లందర్నీ హైదరాబాద్‌కు ఆహ్వానించి వారందరికీ స్వయంగా తానే ఆతిథ్యం కల్పించి క్షేత్ర స్థాయి రాజకీయ పరిణామాలు ఏవిధంగా ఉన్నాయో పరిశీలించి వారు ప్రత్యక్షంగా రిపోర్టింగ్‌ చేసేందుకు దోహదం చేశారు. కులదీప్‌ నయ్యర్‌, వీర్‌సంఫ్వీు, శేఖర్‌ గుప్తా, ఎస్‌. వెంకట నారాయణ, అరుణ్‌శౌరి మొదలైన దాదాపు 50 మంది ప్రసిద్ధ జాతీయ జర్నలిస్ట్‌లందర్నీ అప్పుడే నేను ఈనాడు కాంపౌండ్‌లో చూసి పులకరించిపోయాను. వారందరూ పంపిన క్షేత్రస్థాయి వార్తలతో.. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం దేశ ప్రజలందరికీ తెలిసింది. దాంతో, ఢిల్లీ కాంగ్రెస్‌ అధిష్టానం ఉలిక్కిపడి.. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తిరిగి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అది దేశ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. అంతకుముందు కేరళలో ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని అన్యాయంగా కూలగొట్టినప్పటికీ ఆయన తిరిగి అధికారంలోకి రాలేకపోయారు. ఒక్క ఎన్టీఆర్‌ విషయంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన తప్పును సరిదిద్దుకుంది. అందుకు కారణం రామోజీరావు గారు సాగించిన రాజీలేని అక్షరయజ్ఞమే. అక్షరాలను అంకుశంగా మార్చి అక్రమార్కుల భరతం పట్టిన ఘనత తెలుగునాట తొలుత రామోజీరావు గారికే దక్కుతుంది. 1984లో రామోజీరావు గారు నన్ను ఇంటర్వ్యూ చేసిన సంఘటన నేనెప్పటీ మర్చిపోలేను. రామోజీరావు గారి ‘ఈ టీవీ-2’ నిర్వహించే రాజకీయ చర్చల్లో నాకూ భాగస్వామ్యం కల్పించడం ఓ గౌరవంగా పరిగణిస్తాను.

ఇక, తెలుగు భాష, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు, వాటి ఔన్నత్యాన్ని దశదిశలా చాటడానికి రామోజీరావు గారు చేసిన కృషి అసామాన్యం. తెలుగువారి చరిత్రలో తనకంటూ రామోజీరావు ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకొని వెళ్లిపోయారు. ఆయన నమ్మిన విలువలు, నమ్మకాలను ఆచరించడమే మనం ఆయనకు అందించే ఘనమైన నివాళి కాగలదు.

LEAVE A RESPONSE