Suryaa.co.in

Political News

పదహారణాల తెలుగువాడు!

ఆయన..
చతురుడా..
చాణక్యుడా..
రాజనీతి కోవిదుడా..
తాత్వికుడా..
సాత్వికుడా..
బహుభాషా పండితుడా…
ఒక మనిషిలో ఎన్ని గుణాలు..
ఒక రాజకీయవేత్తలో
ఎన్నెన్ని కోణాలు..
మోమున విజ్ఞానం
తెచ్చిన తేజస్సు…
మనిషిగా అంతేలేని యశస్సు..
అన్నిటినీ మించి పదహారణాల
తెనుంగు వాడు..మనవాడు…
పామలపర్తి నరసింహుడు..

ఎక్కడ లక్నేపల్లి..
ఇంకెక్కడి హస్తినాపురి…
ఎలా మోసుకెళ్ళావయా
ఈ అనంత ఝరి..
తాటికమ్మల బడిలో చదివి దేశాన్ని ఏకతాటిపై
నడిపించిన ఘనాపాటి..
పదమూడు భాషలు
ఎరిగిన సమ్రాట్టు..
తెలుగుదనానికి మూలవిరాట్టు

కలం నుంచి కంప్యూటర్ వరకు
అన్నీ ఆయన వ్యాసంగానికి
ఉపకరణాలే..,
కరీంనగర్ కళాశాలలో
మంచి బాలుడుగా
రేడియో రూం అజమాయిషీ
రాజీవ్ మరణానంతరం మంచి వ్యక్తిగా ప్రధాని పీఠంపై
ఇదే పెద్దమనిషి..
జవహర్ తో బోణీ కొట్టి
ఇందిరమ్మకు జై కొట్టి
రాజీవ్ కు పదవి కట్టబెట్టి…
అప్పుడే ప్రణబ్ నోట్లో మట్టికొట్టి
ఎన్ని కథలు నడిపావయ్యా
పామలపర్తీ..
చాణక్యుడంతటి చాతుర్యంతో
దిగ్గజాలను బురిడీ కొట్టించిన
ఘనశాల్తీ..

ఆర్థిక సంస్కరణల విరించి
నీ నిర్ణయాలే
భారతావనికి దిక్సూచి..
సాహసమే నీ పథమై..
చాతుర్యమే విధమై..
అభివృద్ధి శపథమై..
నడిపించావు జాతిని
ప్రపంచం మెచ్చిన రీతిని..
ఇంత చేసిన నరసింహుడికి
ఏమిచ్చింది కాంగిరేసు
శవదహనంలో తిరకాసు..
తెలుగువాడంటూ ఎన్టీఆర్
పెట్టలేదు పోటీ..
చచ్చాక సొంత పార్టీ
మాత్రం చేసేసింది
గౌరవం లూటీ..!
మతిలేని నాయకుల
సంగతి ఏల..
యావజ్జాతి నీరాజనాలు
లేవా నీ మ్రోల..!
తెలుగు తేజం..మాజీ ప్రధాని పి.వి.నరసింహా రావు
జయంతి సందర్భంగా ప్రణామాలు అర్పిస్తూ..

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE