– సహజ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి : స్వయం సహాయక సంఘాల కోసం రూపొందించిన సూక్ష్మ రుణ ప్రణాళికను బ్యాంకులకు అందజేసి, సాంకేతిక సమస్యల పరిష్కారంతో ప్రతీ సంఘానికి రుణాలను త్వరిత గతిన అందించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం మధ్యాహ్నం మంత్రి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ సీవీడ్(సముద్రపునాచు), వెదురు సాగు, మునగ సాగు(మునగ ఆకు పొడి), మిల్లెట్స్ ఉత్పత్తులలో తగిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఎఫ్ పీవో (ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్)లను బలోపేతం చేయాలని, అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంబంధిత సంస్థల నుంచి తీసుకుని త్వరిత గతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేతి సంస్థ నుంచి తీసుకుంటున్న షేడ్ నెట్లను సకాలంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.