– వైసీపీ ఎంపి కంపెనీకి ఇంకా ‘రెడ్డి’ కార్పెట్
– పీసీబీ చట్టాలు రాంకీకి చుట్టమేనా?
– ఉల్లంఘనలపై కనిపించని ఉక్కుపాదం
– పీసీబీ నోటీసులిచ్చినా లెక్కలేనితనం
– తాజాగా మరోసారి బయటపడిన ఉల్లంఘన
– కాల్వలోకి విష వ్యర్ధాలు వదిలిన బేఖాతరిజం
– తాజాగా మల్లోడిగెడ్డలోకి రాంకీ వ్యర్థాలు
– మీడియాలో వచ్చినా చర్యలు తీసుకునే దమ్మేది?
– సీఐటీయు ఫిర్యాదుకూ స్పందించని పీసీబీ
– క్రిమినల్ కేసులు పెట్టాలని సీఐటియు నేత గనిశెట్టి డిమాండ్
– ప్రజల ప్రాణాల కంటే పరిశ్రమల ఆదాయమే ఎక్కువా అని ఆగ్రహం
– రాంకీ ఉల్లంఘనలపై వైసీపీ మౌనం
– కొరడా ఝళిపించని కూటమి సర్కారు
– ఫలించని వామపక్షాలు, కాంగ్రెస్ ఆర్తనాదాలు
– ‘మేఘా’ మాదిరిగా గళం విప్పని షర్మిల
– దానితో రాంకీ యధేచ్చగా ఉల్లంఘనలు
‘అయోధ్య’ రాజ్యం ‘ లో అడ్డగోలు ఉల్లంఘనలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది వైసీపీ ఎంపీ రెడ్డిగారు బలంగా నిర్మించుకున్న రాంకీ ఫార్మా సామ్రాజ్యం. సారుకు అన్ని పార్టీల అధినేతలు, వారి కుటుంబంతో సత్సంబంధాలుంటాయి. పేరుకే పార్టీ. తీరుకు మాత్రం ఫక్తు వ్యాపారం. ఎన్నికలప్పుడు అన్ని పార్టీలకూ ఆయన చేసే శ్రమదానం అందరికీ ఎరుకే. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బేఫికర్. అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పినట్లు.. ‘ఊరు మనదే తోసెయ్’ నినాదమే. అందుకే సదరు రెడ్డి గారి రాంకీ కంపెనీ ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడినా ఎవరూ కన్నెత్తిచూసే సాహసం చేయరు.
నిజానికి సదరు కంపెనీపై ఒక్క ఏపీలోనే కాదు. బయట రాష్ట్రాల్లోనూ బోలెడు ఫిర్యాదు. అయినా డోంట్ కేర్! కేసులు పెడతారా?.. నోటీసులిస్తారా? అయితే ఏంటట? ఇదే ధీమా కొన్ని దశాబ్దాల నుంచి విజయవంతంగా రెడ్డిగారి కంపెనీలో కనిపిస్తోంది. ఇప్పుడూ అంతే! గత వైసీపీ సర్కారులో ఆయన కంపెనీ కత్తికి ఎదురులేదు. ఎందుకంటే ఆ పార్టీ ఎంపీనే ఆయన కాబట్టి!
మరిప్పుడు వైసీపీకి బద్ధ శత్రువైన కూటమి అధికారంలో ఉంది కాబట్టి.. రెడ్డిగారి కంపెనీపై చర్యల కొరడా ఝళిపించవచ్చు కదా అని అడిగిన వారు, అమాయకుల కిందే లెక్క. ఎందుకో ఓసారి చూద్దాం. రండి!
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ ఎంపి అయోధ్య రామిరెడ్డికి చె ందిన రాంకీ ఫార్మా కంపెనీ కూటమి జమానాలోనూ హవా కొనసాగిస్తోంది. గత కొన్ని నెలలనుంచి నిర్నిరోధంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న రాంకీ దారుణాలను, స్వయంగా పీసీబీ ఉన్నతాధికారులే పరిశీలించి నోటీసులిచ్చినా ఇప్పటివరకూ దానిపై చర్యలకు దిక్కూ దివాణం లేదు.
భూమి, నీటిలో రాంకీ ఫార్మా వదిలే స్తున్న విష వ్యర్థాల బండారం మీడియా లెక్కలేనన్ని సార్లు బయటపెట్టినప్పటికీ, ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదంటే.. కూటమి సర్కారులోనూ రాంకీ హవా ఏ స్థాయిలో సాగుతోంది?. పీసీబీ అధికారులు ఎన్ని డిగ్రీల్లో సదరు సంస్ధకు సాగిలబడుతున్నారు? చివరాఖరకు ఎవరినీ లెక్కచేయరన్న ప్రచారం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం.. రాంకీకి ఎంత భయపడుతున్నారో స్పష్టమయింది. అసలు నిజానికి ఆయన.. రాంకీ లాంటి ఉల్లంఘనులపై ఎప్పుడో చర్యల కొరడా ఝళిపించాల్సింది.
గెడ్డవాగులో రాంకీ వ్యర్ధాలు
తాజాగా పరవాడ ప్రాంతంలోని గెడ్డవాగులో ఇష్టారాజ్యంగా ఫార్మా వ్యర్ధాలు పారబోస్తున్న వైనం కలకలం రేపింది. మండల కేంద్రమైన పరవాడ నుంచి భరణికం వెళ్లే ప్రధాన రహదారికి అనుకుని ఉన్న మల్లోడిగెడ్డలో, రాంకీ ఫార్మా కంపెనీ వ్యర్ధ జలాలను పారబోసిన వైనం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దానితో విషయం తెలుసుకున్న సీఐటియు జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ.. స్థానికులు, సీఐటియు కార్యకర్తలతో కలసి మల్లోడిగెడ్డను పరిశీలించారు. అక్కడ రంగుమారిన జలాలను పరిశీలించి నిర్ఘాంతపోయారు.
రాంకీ పారబోసిన వ్యర్ధాలను మోటారుతో తోడించాలన్న డిమాండ్‌ను, పీసీబీ కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మేరకు రాంకీపై ఒత్తిడి చేసే ధైర్యం విశాఖ జిల్లా పీసీబీ అధికారులు చేయరని, దానికి కారణం ‘మామూలే’నన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటం: గనిశెట్టి
‘‘ రాంకీ యాజమాన్యం ఫార్మా వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నే రుగా మల్లోడిగెడ్డ వాగులోకి విడిచిపెట్టడంతో ఆ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. దీనివల్ల భూగర్భ జలాలకు ప్రమాదం పొంచి ఉంది. వ్యర్ధ జలాలను సీఈటీపీ ద్వారా శుద్ధి చేసి సముద్రంలోకి విడిచిపెట్టాల్సి ఉన్నప్పటికీ, అందుకు భిన్నంగా నేరుగా బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెడుతూ, రాంకీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రాంకీ కారణంగా పరవాడ, భరణికం, తానాం, తాడి, ఇ.బోనంగి, లంకెలపాలెం, సాలాసివాపుపాలెం ప్రజలు కాలుష్యంతో నరకయాతన పడుతున్నా పీసీబీ పట్టించుకోవడం లేదు. అంటే రాంకీతో పీసీబీ పైస్థాయి అధికారుల కుమ్మక్కు స్పష్టం. రాంకీకి పీసీబీకి కంటితుడుపు నోటీసులిచ్చి వదిలేస్తున్నారే తప్ప, దానిపై కఠిన చర్యలకు సాహసించడం లేదు. దీన్నిబట్టి పైస్థాయిలో ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే రాంకీతో బంధమే ముఖ్యమయిపోయింద’’ని గనిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ పోస్టింగు కోసం పోటాపోటీ
సుదీర్ఘకాలం నుంచి విశాఖలో పనిచేస్తున్న పీసీబీ అధికారులు-సిబ్బందిని, తక్షణం మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాంకీ-ఇతర ఫార్మా కంపెనీలతో ఉన్న అనుబంధం కారణంగానే, వీరు వాటిపై చర్యలు వెనుకంజ వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘‘వీళ్లకు ఫార్మా-కెమికల్ కంపెనీల నుంచి ముడుపులు వస్తున్నాయి కాబట్టే చర్యలు తీసుకోవడం లేదు. అలా కాకపోతే ఎందుకు చ ర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటిదాకా రాంకీపై చర్యలు తీసుకోలేదంటే దాని అర్ధం ఏమిటి’’ అని గనిశెట్టి ప్రశ్నించారు.
‘‘విశాఖలో పనిచేసే పీసీబీ అధికారులు, సిబ్బంది ఇళ్లపై ఏసీబీ దాడులు చేస్తే ఈ కథ మొత్తం బయటపడుతుంది. కానీ ఏసీబీ ఇప్పటివరకూ ఆ పని ఎందుకు చేయలేదో అర్ధం కావడం లేదని’’ గనిశెట్టి వ్యాఖ్యానించారు.
కాగా కామధేనువు లాంటి విశాఖలో పోస్టింగ్ కోసం పీసీబీలో విపరీతమైన పోటీ ఉంటుంది. తాజాగా రాయలసీమలో పనిచేసే ఓ అధికారి, తనకు ప్రమోషన్‌తోపాటు- విశాఖ పోస్టింగు కోసం.. ఇటీవలే బదిలీ అయిన ఓ సీనియర్ ఐఏఎస్‌కు భారీ స్థాయిలో తాంబూలం సమర్పించుకున్నట్లు, పీసీబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బదిలీ అయిన ఆ అధికారి వద్ద పనిచేసే ఓఎస్డీ మాత్రం, ఇంకా అదే పేషీలో చక్రం తిప్పుతుండటం విశేషం. ఆయన ‘కృప’తోనే సదరు సీమ అధికారి, ప్రమోషన్ కమ్ విశాఖ బదిలీకి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి సదరు అధికారిపై గతంలో శ్రీకాకుళంలో అనేక ఆరోపణలున్నట్లు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
సారీ.. రాంకీని ఏం చేయలేం!
కాగా రాంకీ ఉల్లంఘనలపై శరపరంపరగా ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, ఏమీ చేయలేమని పీసీబీకి చెందిన ఓ అధికారి నిజాయితీగా తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘ రాంకీ కంపెనీ యజమాని పేరుకే వైసీపీ ఎంపి అయినప్పటికీ, అన్ని పార్టీలతో సంబంధాలున్నాయన్న సంగతి తెలుసు. అందువల్ల ఆ కంపెనీ వైపు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. మీడియాలో రెగ్యులర్‌గా రాంకీ ఉల్లంఘనలపై వార్తలు వస్తున్నా చర్యలు తీసుకోవడం లేదంటే, మా పరిస్థితి ఏమిటో మీరే అర్ధం చేసుకోండి. నిజానికి రాంకీ తన వ్యర్ధాలు సముద్రంలో కలిపే సమయంలో మా అధికారులు తనిఖీ చేయాలి. దానికి సమాంతరంగా మరో లైన్ వేసి, అక్కడి నుంచి వ్యర్ధాలు కలిపేస్తున్నారా? లేదా అని తనిఖీ చేయాలి. కానీ అక్కడికి వె ళ్లే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఏదైనా యాక్షన్ తీసుకుంటే మా వాళ్లే మాకు ఫోన్ చేస్తారు. అసలు రాంకీ లైజనింగ్ ఆఫీసర్ రోజూ మా ఆఫీసులోనే తిరుగుతుంటారు. వాళ్లకు పైస్థాయి వారితో సన్నిహిత సంబంధాలుంటాయి. కాబట్టి మీరు రాంకీపై ఎన్ని వార్తలు రాసినా ఫలితం లేదు’’ అని ఆ అధికారి అసలు రహస్యం బయటపెట్టారు.
‘రాంకీపై ఇప్పటిదాకా మీడియాలో అనే కథనాలు సాక్షాధారాలతో వచ్చాయి. మీరు కూడా లెక్కలేనన్ని కథనాలు రాశారు. కానీ ఇప్పటిదాకా ఏమైనా చర్యలు తీసుకున్నారా? కాబట్టి పీసీబీలో ఏం జరుగుతుందో మీరు అర్ధం చేసుకోవాలి’’ అని సదరు అధికారి వ్యాఖ్యానించారు.
————-
ప్రజల ప్రాణాలు ముఖ్యమా? పరిశ్రమలు ప్రధాన మా?
కూటమి సర్కారు వచ్చిన తర్వాత మారిన విధానం.. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలకు వరంగా పరిణమించింది. గతంలో ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై జరిమానా విధించ డమో, నోటీసులు ఇవ్వడమో, ఏదైనా ప్రమాదం జరిగితే దానిని మూసివేయడమో జరిగేది.
కానీ కూటమి వచ్చిన తర్వాత పద్ధతి మారింది. పీసీబీ నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘిస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్న వైచిత్రి. దానికి పాలకులు చెప్పే కారణం.. వారిపై చర్యలు తీసుకుంటే, అవి మరో రాష్ట్రానికి వెళ్లిపోతాయని, దానితో ఉద్యోగులు రోడ్డున పడతారన్న వాదన!
ప్రభుత్వ కోణంలో ఆ వాదన బాగానే ఉన్నప్పటికీ.. ప్రజాప్రయోజనాల కోణంలో మాత్రం, ప్రజల ప్రాణాలు హరించే కంపెనీలను రక్షించడం ఎంతవరకూ సమంజసమన్న చర్చ జరుగుతోంది. ‘‘ ఆదాయం కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడతారా? ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యమే. కానీ ప్రజల ప్రాణాలు, కాలుష్య నివారణ అంతకంటే ముఖ్యం. ఇప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలు, పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితిలో లేవు.
ఎందుకంటే వాటికి మన రాష్ట్రమే సురక్షితం. కానీ ఆ వాస్తవాన్ని గ్రహించకుండా చర్యలు తీసుకుంటే అవి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతాయని ప్రభుత్వమే ప్రకటిస్తే, ఇక పరిశ్రమలు ప్రభుత్వం మాట ఎందుకు వింటాయి? ఇది వారికి ప్రభుత్వమే అలుసు ఇచ్చినట్లు కదా? ఒకవైపు పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే.. మరో వైపు ప్రజల ప్రాణాలు భక్షించకుండా చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానిదే. రాంకీలాంటి ఉల్లంఘనులపై చర్య తీసుకుంటే మిగిలిన కంపెనీలు క్రమశిక్షణతో పనిచేస్తాయ’’ని ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ సూచించారు.
———–
లక్కంటే.. రాంకీదే!
సహజంగా అధికారంలో ఉన్న పార్టీపై.. ప్రధాన ప్రతిపక్షపార్టీ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని విరుచుపడుతుంది. ప్రధానంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అంశాలపై అయితే ప్రజాందోళన నిర్మించి, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు విరుద్ధం. విశాఖలో ఫార్మా వ్యర్ధాలను కాల్వల్లో పారబోసి, ప్రజల ప్రాణాలతో పరిహాసమాడుతోందన్న విమర్శలు ఎదుర్కొంటున్న రాంకీ ఫార్మా.. స్వయంగా వైసీపీ ఎంపీదే కాబట్టి, ప్రతిపక్షమైన వైసీపీ దానిపై మౌనంగా ఉంటుంది. తన పార్టీ ఎంపీ కంపెనీపై తాను మాట్లాడలేదు. రాంకీకి అదొక వెసులుబాటు.
ఇక కూటమిలోని భాగస్వామ్యపార్టీలకు.. పరిశ్రమల పరిరక్షణ కోణమే ప్రధానం కాబట్టి, అవి కూడా రాీం కి వ్యతిరేకంగా మాట్లాడలేవు. ఇదో పెద్ద వెసులుబాటు. ఉన్న వామపక్షాల బలం తక్కువ. అయినా సరే అవి శక్తిమేరకు ప్రతిఘటిస్తున్నాయి. ఇక గతంలో మేఘా కంపెనీ అక్రమాలపై కేంద్ర హోంశాఖకు స్వయంగా ఫిర్యాదు చేసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, రాంకీ ఉల్లంఘనలపై ఇప్పటివరకూ పెదవి విప్పిన దాఖలాలు లేవు.
మీడియాలో తరచూ రాంకీ ఉల్లంఘనలపై కథనాలు వస్తున్నా, వాటిపై స్పందించాల్సిన పీసీబీ మౌనరాగం ఆలపిస్తోంది. కారణం ‘మామూలే’. ఏతావతా.. ఏ ఒక్కరూ రాంకీ ఉల్లంఘనలను ప్రశ్నించలేని వెసులుబాటు. బహుశా ఇంత అదృష్టం దేశంలో ఏ కంపెనీకి ఉండకపోవచ్చేమో?! అంటే రాంకీకి అదృష్టం జెర్రిగొడ్డులా పట్టిందన్నమాట!!