Suryaa.co.in

Andhra Pradesh

హాట్ టాపిక్ గా మారిన “రాధా- రావి” ఆత్మీయ కలయిక

– సరదాగా మాట్లాడుకున్న ఇరువురు నేతలు
– గుడివాడ రాజకీయాలపై తీవ్ర ప్రభావం
– టీడీపీ శ్రేణుల్లో స్పష్టంగా కన్పిస్తున్న ఉత్సాహం

గుడివాడ, డిసెంబర్ 19: మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, రావి వెంకటేశ్వరరావుల ఆత్మీయ కలయిక ఇప్పుడు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. విజయవాడలోని 24కే కన్వెన్షన్ లో జరిగిన చెన్నుపాటి వారి వివాహ వేడుకల్లో ఈ ఇద్దరు నేతలు సందడి చేశారు. “రాధా-రావి”లు గంటసేపు సరదాగా మాట్లాడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణకు గుడివాడ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా కన్పిస్తుంటుంది.

రాధాకృష్ణ గుడివాడ వచ్చినా లేక ఆయన ఎక్కడైనా గుడివాడ నేతలను కలిసినా ఆ వార్త పిచ్చపిచ్చగా వైరల్ అవుతుంటుంది. గతంలో జరిగిన అనేక సంఘటనలను ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కొద్దిరోజుల కిందట పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్ లో జరిగిన ఒక వివాహ వేడుకకు రాధాకృష్ణ విచ్చేశారు. రాధాకృష్ణ రాక కోసం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎదురుచూడడం చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా రాధాకృష్ణ, కొడాలి నానిలు కలిసి మాట్లాడుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఈ నేపథ్యంలో కొడాలి నానికి గుడివాడలో ఇప్పుడు రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణలు ఆత్మీయంగా కలుసుకోవడం కూడా తాజాగా రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. గుడివాడకు చెందిన నేతలు కలిసిన ప్రతిసారీ పెద్దఎత్తున జరుగుతున్న చర్చకు రాధాకృష్ణ కేంద్ర బిందువుగా మారడానికి కారణాలు లేకపోలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్ నియోజకవర్గంగా ఉన్న గుడివాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన దాదాపు 25 వేల ఓట్లు ఉన్నాయి.

ఈ ఓట్లే గుడివాడ నేతలను రాధాకృష్ణ వెంటబడేలా చేస్తున్నాయి. మరోవైపు రాధాకృష్ణకు గుడివాడ నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గం నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. సాక్షాత్తు దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు కావడంతో రాధాకృష్ణను పార్టీలతో సంబంధం లేకుండా కాపు సామాజిక వర్గం విపరీతంగా అభిమానిస్తుంటుంది. దీన్ని అనుకూలంగా మల్చుకునేందుకు గుడివాడ నియోజకవర్గంలోని పలువురు రాజకీయ నేతలు విపరీతంగా తహతహలాడుతుంటారు. ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణకు మధ్య ఎంతో కాలంగా ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయినప్పటికీ ఒక్కోసారి కొడాలి నాని, రాధాకృష్ణల మధ్య దూరం పెరిగిందనే వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. వెనువెంటనే కొడాలి నాని, రాధాకృష్ణలు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా మళ్ళీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు తరచుగా రాధాకృష్ణను కలుస్తుండడం గుడివాడ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న రాధాకృష్ణ, రావి వెంకటేశ్వరరావులు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు.

దీంతో రావి కూడా ఏ మాత్రం తగ్గకుండా అవకాశం వచ్చిన ప్రతిసారీ రాధాకృష్ణను ఆత్మీయంగా కలుస్తూ తనదైన శైలిలో స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. గుడివాడ రాజకీయాల్లో గెలుపు, ఓటమిలను ప్రభావితం చేసే శక్తి ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రావి ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు.

రాధాకృష్ణ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండడం రావికి మరింత కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తం మీద రాధాకృష్ణ, రావి వెంకటేశ్వరరావుల ఆత్మీయ కలయిక గుడివాడ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశం కావడం టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.

LEAVE A RESPONSE