నువు వస్తావని బృందావని
ఆశగ చూసేనయ్య కృష్ణయ్యా..
వేణువు విందామని..
రాధను కందామని..
రాధకు నీవేర ప్రాణం..
ఈ రాధకు నీవేర ప్రాణం..
రాధాహృదయం..
మాధవ నిలయం…
ప్రేమకు దేవాలయం..!
అస్సలు వేరుగా
చూడలేని ఇద్దరు..
ఒకరి కోసం
ఒకరు పుట్టిన
రాధాకృష్ణులు..
తాదాత్మ్యతలో
తన్మయత..
చెదరని నిష్ట
ప్రేమకు పరాకాష్ట!
తనను తాను
ప్రేమించుకోలేని కన్నయ్య
రెండుగా విడివడితే
ఆ రూపమే..
ఈ గోపాలుని
ప్రతిరూపమే రాధ..
అలా తీరిన శ్రీకృష్ణుని
విరహబాధ
జగతికి అందిన
సుమనోహర ప్రేమగాధ..!
క్షణమైనా విడిగా ఉండని
ఆ జంట..
యుగాలు మారినా
ప్రేమికుల కన్నుల పంట..
ఆమె వలపే బృందావనం..
అతడి పిలుపే మురళీరవం..!
నారీ నారీ నడుమ మురారి..
హరికి హరికి
నడుమ వయారి..
తానొకడైనా తలకొక రూపై
పరిమళ మొసగెను
రాధామాధవకేళీనటనం..
చూడుమదే చెలియా..
కనులా చూడుమదే..!
బాస చేసి రావేల మదనగోపాల..
నీవు లేని జీవితము తావి లేని పూవు సుమా..
ఇలా అందంగా సాగిన
విరహగీతి రాధ..
మాధవయ్య తక్కువ తిన్నాడా..
రానంత సేపు విరహమా..
నేను రాగానే కలహమా…
రాగానే కలహమా..
ఇలా కవ్వించే కొంటెకృష్ణుడు!
నీ మేన సరసాల చిన్నెలు
అవి ఏ కొమ్మకొనగోటి
ఆనవాళ్ళు..
ఇలా సాగిన రాధమ్మ శంక..
దోబూచులాడితి నీతోనే
అవి ఈ కొమ్మ
గురుతులు కాబోలు
మురళీధరుని సర్దుబాటు..
నేను నమ్మనులే
నీ మాటలు..
అవి కమ్మని
పన్నీటి మూటలు
రాధమ్మ అలుకకి
కన్నయ్య ముక్తాయింపు..
నా మాట నమ్మవే రాధికా
ఈ మాధవుడు నీవాడేగా..
ఎంత మధురమైన
ప్రణయ కలహమో..
ఆ ఇద్దరి గాథ అంత
మనోహర ప్రణయకావ్యం..!
యమునా విహారి కోసం
అతడి నుంచే పుట్టిన రాధ..
యమునా తటినే
తన వాకిటిగా..
ఆ జలము
తన ఆలవాలముగా..
అలలు తన కలలుగా..
కిట్టయ్య ప్రేమనే బాధగా..
ఆ ప్రేమనే తన జీవిత గాధగా
మలచుకున్న ప్రేమైకజీవి..
ప్రేమమూర్తిగా చిరంజీవి..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286