– కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రూ.30 వేల కోట్లు
– రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల స్కాములో రూ.మూడు లక్షల 30 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డికి
– క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు నలుగురికి రూ.15 వేల కోట్ల చొప్పున రూ.60వేల కోట్లు
– మిగిలిన 11 మంది మంత్రులకు రూ.10వేల కోట్ల చొప్పున వారికి రూ.లక్ష 10 వేల కోట్లు ల్యాండ్ లూటీ స్కామ్ ని రుజువు చేస్తా
– రుజువు చేయలేకపోతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం స్వీకరిస్తా
– రుజువు చేస్తే ల్యాండ్ లూటీ మాఫియా డాన్ లా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవికి రిజైన్ చేయాలి
– సవాలుకు జవాబు లేక పారిపోయిన ఉత్తమ్ – మీ పాలసీ పై మీకే నమ్మకం లేకపోతే ఎలా?
– అంటే కుంభకోణం నిజమేనని అంగీకరిస్తున్నట్లే
– మా ఆరోపణలు నిజమేనని ఉత్తమ్ ఒప్పుకున్నట్లే
– హెచ్ ఐ ఎల్ టి పాలసీలో పారదర్శకత ఉంటే మంత్రి ఉత్తమ్ ఎందుకని చర్చకు రాలేదు?
– బీఆర్ఎస్ ఇండస్ట్రియల్ ల్యాండ్ స్కాం కాంగ్రెస్ సర్కారుకు ఆదర్శమా?
– రేవంత్ సర్కారుపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
హైదరాబాద్: హెచ్ ఐ ఎల్ టి పాలసీలో సీఎం రేవంత్, మంత్రులతో పాటు రాహుల్. ప్రియాంక, మల్లిఖార్జున ఖర్గే కి వేల కోట్లు ముట్టబోతున్నాయని తెలంగాణ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి బాంబు పేల్చారు. ఆ మేరకు ఆయన మీడియా ద్వారా రేవంత్ సర్కారుకు ప్రశ్నలు సంధించారు. మహేశ్వర్ రెడ్డి ఏమన్నారంటే.. – హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్ధం కాలేదనడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీ మీడియా పాయింటుకు రమ్మని నేను నిన్న చేసిన సవాలును మంత్రి ఉత్తమ్ ఎందుకు స్వీకరించలేదు.
అంటే హిల్ట్ పాలసీలో పారదర్శకత లేదని రుజువైనట్టే కదా? రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల భూములను రూ.ఐదు వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారు? – హిల్ట్ పాలసీలో ఎలాంటి కుంభకోణానికి అస్కారం లేదంటున్న మంత్రి ఉత్తమ్ గారు … మేము ఆరు రోజులుగా అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు. ఏ ప్రాతిపదికన హిల్ట్ పాలసీని రూపొందించి రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల విలువైన భూములను రూ.ఐదు వేల కోట్లకు ఎందుకు కట్టబెడతున్నారనే ప్రశ్నకు సమాధానమేదీ? కోకాపేటలో ఎకరం ధర రూ.151 కోట్లు. మరి పారిశ్రామిక వాడల్లో భూముల ధర రూ.54 లక్షలా? – కోకాపేటలోని భూములకు HMDA నిన్న శుక్రవారం రెండో విడత నిర్వహించిన వేలంలో ఎకరానికి రూ.151 కోట్ల ధర పలికింది. మొన్న ఎకరం ధర రూ.137కోట్లు.
ఈ లెక్కన హిల్ట్ పాలసీలో భాగంగా 22 పారిశ్రామిక వాడల్లో ఉన్న భూముల ధర సగటున ఎకరం సుమారు రూ.68 కోట్లుగా ఉంటుందని అంచనా. ఆ మేరకు ప్రభుత్వం కన్వర్షన్ చేస్తున్న 9292 ఎకరాలకు మార్కెట్ ధర ప్రకారం వచ్చే మొత్తం రూ.ఆరు లక్షల 29 వేల కోట్లు. ఈ లెక్కలు తప్పని మంత్రి ఉత్తమ్ చెప్పదలచుకున్నారా? ప్రభుత్వం ఈ భూములను ఎకరం రూ.54 లక్షలకే ఇచ్చేయడం లూటీ కాక మరేమిటి? బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఇండస్ట్రియల్ ల్యాండ్ స్కాం కాంగ్రెస్ సర్కారుకు ఆదర్శమా? – హిల్ట్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, దీనిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందంటున్న మంత్రి ఉత్తమ్ … బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని, అక్రమాలను ఆదర్శంగా తీసుకుంటున్నారా చెప్పాలి. బీఆర్ఎస్ చేసిన భూ బాగోతాన్ని కాంగ్రెస్ మంత్రులు ఎందుకు బయట పెట్టడం లేదు?
– బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక భూముల బదలాయింపులలో జరిగిన తప్పిదాలను బయట పెడుతామని మీ క్యాబినెట్ సబ్ కమిటీ సహచరులైన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మాట్లాడారు కదా, మరి ఎందుకని బయటపెట్టడం లేదు. బీఆర్ఎస్ పెద్దలతో మీకున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి. బీఆర్ఎస్ హయాంలో GRID Policy పేరుతో ల్యాండ్ స్కాం జరిగింది కదా! – ఇపుడు రేవంత్ సర్కార్ చేస్తున్న ల్యాండ్ స్కామునే గతంలో బీఆర్ఎస్ సర్కార్ కూడా హైదరాబాద్ GRID పాలసీ (Growth in Dispersion) చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అంగీకరించారు.
అజామాబాద్, కూకట్పల్లి, హఫీజ్‌పేటలోని పారిశ్రామిక భూములకు ఫ్రీ హోల్డ్ పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వమే యాజమాన్య హక్కులు కల్పించిందని, ఈ మేరకు 2023 ఆగస్టు 20న జీవోను జారీచేశారని శ్రీధర్‌బాబు తెలిపారు. బీఆర్ఎస్ సర్కారు ఇలా ఫ్రీ హోల్డ్ పేరిట ఎకరాకు రూ.50 నుంచి రూ.60కోట్లకు ఉన్న విలువైన భూములను ఎకరాకు రూ.10 కోట్లకే కట్టబెట్టారని, ఇలా వందల కోట్ల ప్రభుత్వ భూములను అప్పటి మంత్రి కేటిఆర్ తన వారికి అప్పనంగా కట్టబెట్టి ప్రజాధనాన్నికొల్లగొట్టారని శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ అపుడు GRID Scam కు పాల్పడితే కాంగ్రెస్ ఇప్పుడు HILT Scam కు స్కెచ్ వేసింది! – అంటే అపుడు బీఆర్ఎస్ సర్కార్ GRID పాలసీ తెచ్చి పారిశ్రామిక వాడల్లోని భూముల ఓనర్లకు ఫ్రీ హోల్డ్ ఇస్తూ భూ దోపిడీకి పాల్పడింది. కాబట్టి ఇపుడు తాము చేస్తే తప్పేంటనే ధోరణిలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడడం సిగ్గుచేటు.
నాడు గ్రిడ్ పాలసీతో బీఆర్ఎస్ వందల ఎకరాల పారిశ్రామిక భూములను కొల్లగొడితే. నేడు కాంగ్రెస్ సర్కార్ హిల్ట్ పాలసీ ద్వారా ఏకంగా 22 పారిశ్రామిక వాడలనే మింగిస్తోంది. అంటే కాంగ్రెస్ సర్కార్ అవినీతి అనకొండ. ఇండిస్ట్రియల్ ల్యాండ్ లూటీ ఎపిసోడుకు బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్ ఇపుడు తలుపులు తెరవడం కాదు, ఏకంగా గోడలనే కూల్చేసింది. దొంగల పాలన పోయి గజదొంగల పాలన వచ్చింది. అంటే రాష్ట్రంలో గొర్రెలను తినేటోడు పోయి బర్రెలను తినేటోడు వచ్చిండన్నమాట. హెచ్ ఐ ఎల్ టి పాలసీ పై క్యాబినెట్ మీటింగ్ లో అసలు లోతైన చర్చ జరుగుతుందా?
– అసలు ఈ పాలసీపై ఈ నెల 17న జరిగిన క్యాబినెట్ మీటింగులో కూడా లోతైన చర్చ జరగలేదు. దీనిపై ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్టు పాలసీని మంత్రులకు సర్కులేట్ చేసి, వారు చదివాక మళ్లీ వెనక్కి తీసుకున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ఎంత పకడ్బందీగా ఈ రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల కుంభకోణానికి స్కెచ్ వేసారో స్పష్టమవుతోంది. హెచ్ ఐ ఎల్ టి పాలసీ జీవో -27లో సబ్ కమిటీ ప్రస్తావనే లేదు ఎందుకని ? – ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను పెంచే క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన కసరత్తు మేరకే ఈ హిల్ట్ పాలసీ వచ్చిందని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు. మరి అదే నిజమైతే ఈ నెల 22న ప్రభుత్వం జారీ చేసిన జీవో-27లో TGIIC చేసిన సిఫారసుల మేరకు అని ఎందుకు పేర్కొన్నారు. మరి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసుల మేరకు అని జీవోలో ఎందుకు స్పష్టత ఇవ్వలేదు. ఆ నలుగురు మంత్రులు దుష్టచతుష్టయం, వారికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలి.
– జీవో-27లో అసలు క్యాబినెట్ సబ్ కమిటీ ప్రస్తావనే లేదు. ఎందుకంటే అసలు క్యాబినెట్ సబ్ కమిటీ ఏనాడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అంశాన్ని చర్చించలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ చేసిన రూ.వేలకోట్ల డబ్బుమూటలకు ఆశపడిన నలుగురు మంత్రులు దుష్టచతుష్టయం గా మారిపోయి క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించామంటూ అబద్దాలు చెబుతున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు పేరుతో రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల స్కాముకు పాల్పడిన ఈ దుష్టచతుష్ట యానికి లై డిటెక్టర్ టెస్టులు నిర్వహిస్తే వీరి బండారం, రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల ల్యాండ్ లూటీ స్కామ్ బయటపడుతుంది పరిశ్రమలను తరలించి ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమనడం ప్రభుత్వ విధానమా? – హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకే పరిశ్రమలను నగరం బయటకు పంపుతున్నట్లు మంత్రి ఉత్తమ్ గారు చెప్పారు. సరే, పరిశ్రమలను ఎక్కడికి తరలిస్తున్నారో, వాటికి ఎక్కడ భూములను కేటాయించారో ఎందుకని చెప్పడం లేదు. అంటే ఈ పరిశ్రమలను మూసేసి వాటి ఓనర్లను ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోమంటు న్నారా.
ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం. పరిశ్రమలను ఫ్యూచర్ సిటీలో రీ లొకేట్ చేయొచ్చు కదా? – కాలుష్యమే ప్రధాన కారణమైతే మనుగడలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయట, ఫ్యూచర్ సిటీలో ఉన్న వేలాది ఎకరాల్లో రీ లోకేట్ చేయొచ్చు కదా … ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 9292 ఎకరాల భూమిని ప్రభుత్వమే స్వాధీనపరుచుకోవచ్చు కదా.
అలా చేయకుండా S.R.O. వ్యాల్యూలో 30 శాతానికే ల్యాండ్ కన్వర్షనుకు అనుమతివ్వడం స్కాము కాక మరేంటి? పరిశ్రమల పొల్యూషన్ పై ఎన్విరాన్మెంటల్ స్టడీ రిపోర్ట్ ఏది? – మరి ఈ 22 పారిశ్రామిక వాడల్లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి. వాటి వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయనే అంశంపై నిపుణుల నివేదిక ఏమైనా ప్రభుత్వం వద్ద ఉందా? ఎన్విరాన్ మెంటల్ స్టడీ ఏమైనా చేసారా? ఏ ప్రాతిపదికన ఈ పరిశ్రమలన్నీ కాలుష్య కారకాలని ప్రభుత్వం నిర్ధారించింది.
పరిశ్రమల భూముల్లో అపార్ట్మెంట్లు నిర్మించ వచ్చని ఏ నిపుణుల కమిటీ చెప్పింది? – మరి 50 ఏళ్లుగా ఈ పరిశ్రమలు విడుదల చేస్తున్న రసాయనిక వ్యర్ధాలు భూమిలో ఇంకిపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నిర్మించి నివాసానికి అనుమతించినట్టయితే విషతుల్యమైన భూగర్భ జలాల వల్ల అక్కడ నిర్మించే అపార్ట్మెంట్లలో నివసించే ప్రజలకు అనారోగ్య సమస్యలు రావా? ఇలాంటి అంశాలపై లోతైన అధ్యయనం ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఎలాంటి ఎన్విరాన్మెంటల్ స్టడీ చేయకుండా కాలుష్యకారక పరిశ్రమల స్థానంలో నివాసాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది. ఇది ప్రజారోగ్యంతో చెలగాటం కాదా? రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల విలువైన భూములను రూ.ఐదు వేల కోట్లకే కట్టబెట్టడం ల్యాండ్ లూటీ కాక మరేమిటి? – పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూముల్లో నిర్మాణాలు చేసుకోవచ్చంటూ, వాటిని ఆ ల్యాండ్ ఓనర్లకే అడ్డికి పావుశేరు ధరలకే ఎందుకు కట్టబెడుతున్నారు. రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల విలువైన భూములను కేవలం రూ.ఐదు వేల కోట్లకే కట్టబెట్డడం కుంభకోణం కాక మరేంటి.
ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ స్కాం.. క్విడ్ ప్రో కో స్కాం – జూబ్లీహిల్స్ ప్యాలెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యాంగ్ ముందుగానే 22 పారిశ్రామికవాడల్లో రెక్కీ నిర్వహించి, అక్కడున్న సంస్ధలకు చెందిన వారితో అగ్రిమెంట్లు కుదుర్చుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి HILT పాలసీని క్యాబినెటులో ఆమోదించారు. ఇది ముమ్మాటికీ Insider Trading Scam. ఇది క్విడ్ ప్రో కో స్కాం. ఈ స్కాములో సీఎం ది ప్రధాన వాటా. మంత్రులకు, గాంధీ ఫ్యామిలీకి వాటా ఉంది. – రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల కుంభకోణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా మొత్తం క్యాబినెటుకు, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు భాగస్వామ్యం ఉంది. రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల స్కాములో రూ.మూడు లక్షల 30 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డికి, క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు నలుగురికి రూ.15 వేల కోట్ల చొప్పున రూ.60వేల కోట్లు, మిగిలిన 11 మంది మంత్రులకు రూ.10వేల కోట్ల చొప్పున వారికి రూ.లక్ష 10 వేల కోట్లు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు చెరో రూ.50వేల కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రూ.30 వేల కోట్లు ముట్టనున్నాయి.
రేవంత్ రెడ్డి సీఎం గా కాకుండా ల్యాండ్ లూటీ మాఫియా డాన్ లా వ్యవహరిస్తున్నారు. – కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ల్యాండ్ కన్వర్షన్ కాదు, ల్యాండ్ లూటీకి పాల్పడుతోంది. రాష్ట్రాన్ని ల్యాండ్ లూటీ మాఫియా రాజ్యమేలుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ల్యాండ్ లూటీ మాఫియా డాన్ లా, మంత్రులు ల్యాండ్ లూటీ గ్యాంగ్ స్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే హిల్ట్ పాలసీని టేకప్ చేయాలి. జీవో 27ను రద్దు చేయాలి. – హిల్ట్ పాలసీలో ఎలాంటి అవినీతి లేదంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలి. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే హిల్ట్ పాలసీని అమలు చేయాలి.
ఈ పాలసీని అమలు చేసేందుకు జారీ చేసిన జీవో-27ను తక్షణమే రద్దు చేయాలి. హిల్ట్ పాలసీ ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సవాలుకు మంత్రులు, సీఎం సిద్దమా? – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే కాదు, దుష్టచతుష్టయమైన క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులకు సవాల్ చేస్తున్న, వారు నలుగురు కలిసి వచ్చినా సరే, విడి విడిగా వచ్చినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే బహిరంగ చర్చకు సిద్దం. హిల్ట్ పాలసీ రూ.ఆరు లక్షల కోట్ల మేర అవినీతికి ఆస్కారమున్న ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేస్తాను. రుజువు చేయలేకపోతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను. మరి హిల్ట్ పాలసీ భారీ ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేస్తే దుష్టచతుష్టయంతో పాటు ల్యాండ్ లూటీ మాఫియా డాన్ లా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవికి రిజైన్ చేయాలి.