Suryaa.co.in

Andhra Pradesh National

అందరినీ ఐక్యం చేసేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర

-కుల, మతాల వారీగా బీజేపీ దేశాన్ని విభజిస్తోంది
-దేశం కోసం బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఏమైనా బలిదానాలు చేశారా..?
-ఇందిరా, రాజీవ్ వంటి వారు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు
-ఎఐసీసీ అధ్యక్షునిగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నా
-ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి… మల్లిఖార్జున ఖార్గే

కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం నాకు వచ్చిందని, తనను ఎన్నుకుంటే.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ది కోసం అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని ఆపార్టీ సీనియర్ నేత, ఎఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నాయకులు మల్లిఖార్జన ఖార్గే అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులను ఆయనకలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఆయన పర్యటించారు. ఉదయం హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున ఖార్గే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎపీ తరపున ఎపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ స్వాగతం పలకగా, సీనియర్ నేతలు కెవిపి రామచంద్రరావు, కొప్పుల రాజు, జెడి శీలం, గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలి, తులసీరెడ్డి, హర్షకుమార్ లు వారితో పాటు ఉన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకవచ్చారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎపీ పక్షాన కర్నూలులో ఏర్పాటు చేసే ఎన్నికల కేంద్రంలో 350 మంది పీసీసీ డెలిగేట్లు ఓటు వేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా ఖార్గే సమావేశం అయ్యారు. తన మనసులోని భావాలు, ఆలోచనలను వారికి వివరించారు. ఈ నెల 17న జరిగే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం తాను విజయవాడ వచ్చానని, అందరూ మద్దతు తెలిపాలని, పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని హమీ ఇచ్చారు. అనంతరం మల్లిఖార్జున ఖార్గే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం నాకు వచ్చిందని, తాను ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నానని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలంపాటు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం చేశానని, 2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పుకొచ్చారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉండడానికి నిరాకరించడంతో ఎన్నిక అనివార్యమైందని, అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబం వ్యక్తులు లేకపోవడం బాధాకరమన్నారు. అందరి సూచనల మేరకు అధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా నిలిచానని, ఏపీ నుంచి వచ్చిన వాళ్లు దేశాన్ని నిర్దేశనం చేశారన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలనికి వ్యతిరేకంగా పోరాడే బలం నాకివ్వాలని కోరుతున్నానని, ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లను 50 ఏళ్ల వయసులోపు వారికే ఇస్తామని, యువతను ప్రోత్సహిస్తామని తెలిపారు. రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందని, కుల, మతాల వారీగా బీజేపీ దేశాన్ని విభజిస్తోందని విమర్శించారు. భారత్ తొడో యాత్ర అని విమర్శలు చేయడం సరికాదని, మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. దేశం కోసం బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఏమైనా బలిదానాలు చేయలేదని, ఇందిరా, రాజీవ్ వంటి వారు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారనే విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా ఎపీసీసీ తరపున శైలజానాథ్, కెవీపీలు మల్లిఖార్జున ఖర్గేను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE