-రాహుల్ గాంధీవన్ని డొల్ల మాటలని తేలిపోయింది
-రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటాం…. మీకెందుకు కడుపు మంట , కళ్ళ మంట
-రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
-రేవంత్ రెడ్డిని ఊరి పొలిమేరలు దాకా తరిమికొట్టండి
-రైతాంగానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు
-విద్యుత్ సౌదా ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : మూడు గంటల విద్యుత్తు చాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే గతంలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ మొత్తం బోగస్ అని తెలంగాణ రైతులకు అర్థమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ మాటలన్నీ డొల్ల అని దీన్నిబట్టి తెలుస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు గ్రామాల్లో తిరగవద్దని డిమాండ్ చేశారు. మూడు పూటలా అన్నం పెట్టే రైతుకు మూడు గంటలే కరెంటు ఇవ్వాలని అంటున్న రేవంత్ రెడ్డిని ఊరి పొలిమేరలుదాకా తరిమి కొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లోని విద్యుత్తు ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… “కాంగ్రెస్ ఉద్దేశాన్ని పిసిసి అధ్యక్షుడు అమెరికాలో బయటపెట్టాడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఎందుకని అడుగుతున్నాడు. మరి 24 గంటల పాటు కరెంటును వ్యాపారవేత్తలకు ఇవ్వాలా ? జూబ్లీహిల్స్ లోని మీ ఇంటికి ఇవ్వాలా ? రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఎందుకు ఇవ్వద్దు? రైతులకు కరెంటు ఇవ్వద్దని ఎందుకు అంటున్నారు మీరు? రైతులు మాట్లాడలేరని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా ? ధైర్యం ఉంటే అదే వ్యాపారవేత్తలకు బందు పెట్టమని చెప్పండి ? ” అని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలియదని ఆరోపించారు. రేవంత్ కు వ్యవసాయఎం ఏం తెలుసు అని అమెరికాలో ఆయన మాట్లాడిన తర్వాత అనేకమంది సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి వెళ్లి రైతులు పాము తేళ్లు కాట్లకు గురయ్యేవారని, ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎక్కడ లేదని తెలిపారు.
కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు కలిపి 60 ఏళ్లు పరిపాలన చేశాయని, ఆ రెండు పార్టీల్లో రేవంత్ రెడ్డి పని చేశారని, రేవంత్ రెడ్డి ఉన్న ఆ పార్టీలో రైతులకు ఎప్పుడు ఏమి చేయలేదని విమర్శించారు. 60 ఏళ్లలో 7 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉత్పత్తి చేసిందని, కానీ గత తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో అదనంగా పదివేల మెగా పట్ల ఉత్పత్తిని సాధించుకున్నామని వివరించారు.
తమ ప్రభుత్వం రైతుల కోసం నిరంతరం కష్టపడి భూ రికార్డులను ప్రక్షాళన చేసి, విద్యుత్తు ఉత్పత్తిని పెంచి, సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నదని తెలిపారు. రూ. లక్ష కోట్లతో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకుందని అన్నారు.
ఒకప్పుడు లోటు విద్యుత్తుతో రైతులు దిగాలుగా ఉండేవారని, ఇప్పుడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. ఇటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో రైతులకు కడుపునిండా ఉచితంగా విద్యుత్తును ఇచ్చుకుంటామని, మీకెందుకు కడుపు మంట అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. మంచి పంటలతో రైతు బాగుంటే కాంగ్రెస్కు ఎందుకు కళ్ళమంట అని నిలదీశారు.
చక్కటి రైతు విధానాలతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వరి పంటలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రెండో స్థానానికి చేరుకున్నామని, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల విధానాల వల్లనే అది సాధ్యమైందని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇతర రాష్ట్రాలు నకలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. రైతుకు వ్యవసాయం పండగ కావాలంటే నీళ్లు, మంచి విత్తనాలు, ఎరువులు, నాణ్యమైన విద్యుత్తు అందుబాటులో ఉండడంతోపాటు పంటను కొనే ప్రభుత్వం ఉండాలని అన్నారు.
గతంలో నాణ్యమైన విద్యుత్తు లేక తెలంగాణ రైతాంగం బోరు బావుల పై ఆధారపడి ఇబ్బంది పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 27.5 లక్షల బోరు బావులపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీటిమట్టం పెరిగి బోర్లు నిండుగా పోస్తున్నాయని, ఆ బోరు మోటార్లకు ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తుందని, దాంతో ఎప్పుడంటే అప్పుడు రైతు బటన్ నొక్కితే నీళ్లు వస్తున్నాయని చెప్పారు.