రైల్వే జోన్‌ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం

రైల్వే జోన్‌ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం

వైఎస్సార్సీపీ నాయకులకు రైల్వే మంత్రి హామీ
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు.
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నాయకులు పీవీ మిధున్‌ రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిధున్‌ రెడ్డి పేర్కొన్నారు.