– ఎందుకు ఎంగిలి పథకాలు?
– దమ్ముంటే టీచర్ల మాదిరిగానే సచివాలయ ఉద్యోగులకు హాజరు పెట్టండి
-సీఎంకు ఎంపీ రఘురామకృష్ణంరాజు సవాల్
“పోలవరం ప్రగతి పైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈ మతిలేని ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పాం… ఈ చెవిటి ప్రభుత్వానికి మళ్లీ మళ్లీ చెప్పాల్సి రావడం మన దురదృష్టకరం, కానీ చెప్పాలి తప్పదు. ఉభయగోదావరి డెల్టా స్టెబిలైజేషన్ మొదలుకొని అక్కడి నుంచి విశాఖ వరకు ఏలేరు కెనాల్ ద్వారా నీటి సరఫరా చేయవచ్చు. కృష్ణా నీటిని పైననే ఆపుకుని రాయలసీమకు మళ్లించవచ్చు. హంద్రీనీవా, సుజల స్రవంతి ద్వారా రాయలసీమను బంగారు మయంగా మార్చుకునే అవకాశం ఉంది. గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తీసుకు వెళ్ళవచ్చు. కొన్ని జిల్లాలు మినహాయించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకుని అవకాశం లభిస్తుంది. పోలవరం పూర్తి చేయడానికి 35 వేల కోట్లు అవసరం అనుకుంటే, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కాలేశ్వరం నిర్మాణానికి నిధులను సొంతంగా సమకూర్చుకున్నట్లుగా, పోలవరానికి 35 వేల కోట్ల నిధులను ఎలా సమీకరించవచ్చున్న దానిపై కార్యాచరణ పథకం రూపొందించాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. గోదావరి నీళ్ల కంటే రాష్ట్రంలో డబ్బే ఎక్కువగా వృధా అవుతుందన్నారు. డబ్బు, నీరు వృధా కాకుండా నీటిని ఆదా చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. డబ్బు వృధా గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమ పార్టీ జాతీయ కార్యదర్శి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ… పోలవరం గురించి గత మూడేళ్లలో ప్రధానమంత్రి తో ఏమైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఎందుకు అంగుళం కూడా ఈ అంశంలో పురోగతి లేదో చెప్పాలని నిలదీశారు.. ప్రత్యేక హోదా అంశం గురించి ఊదరగొట్టాం… ఓట్లను తెచ్చుకొని, జనాలను మోసగించామన్న ఆయన, ప్రత్యేక హోదా గురించి విభజన చట్టంలో స్పష్టత లేదని, కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణం అన్నది తమకెంతో ముఖ్యమని, ఈ విషయమై కేంద్ర జల వనరుల మంత్రి, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి తో ప్రత్యేకంగా సమావేశమై, వారిని మెప్పించి ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తన బుద్ధి గడ్డి తిని గతంలో పోలవరం ప్రాజెక్టు ఏటీఎం అన్నానని, తన మాటలను పట్టించుకోని డబ్బులు ఇవ్వవద్దని అనుకోవడం సమంజసం కాదని ప్రధానమంత్రిని కలిసి అభ్యర్థించాలని సూచించారు. పోలవరం నిర్మాణానికి పెద్ద మొత్తంలో డబ్బులు కావలసి వస్తుందని ఆయన ముందు అంగీకరించాలన్నారు.
2022 జూన్ కూడా పూర్తయింది… అయినా ప్రాజెక్టు పురోగతి మృగ్యం
2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వీడియోను రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. 2022 జూన్ కూడా పూర్తయిందని, అయినా ప్రాజెక్టు పురోగతి మృగ్యమని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తి కాగా, తమ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో మూడు శాతం పనులు కూడా జరగలేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 35 వేల కోట్ల రూపాయలు అవసరమని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించడం, అర్థించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజన కు ముందు జరిగిన ఖర్చుతో తమకు సంబంధం లేదని, 2013, 14 అంచనాల ప్రకారం 20 వేల చిల్లర కోట్లలలో 2920 కోట్ల మినహాయించి, మిగిలిన సొమ్ము చెల్లించామని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. అయినా పోలవరానికి మరో 35 వేల కోట్ల రూపాయలు సహాయం చేయాలంటూ కేంద్రాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖలను రాస్తూనే ఉన్నదని చెప్పారు.
చెప్పింది ఏ ఒక్కటి చేయలేదు
పార్టీ అధ్యక్షుడిగా ఏకపాత్రాభినయం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది చేయకపోతే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు రాజీనామా చేయాలంటూ పేర్కొన్నారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన గతంలో చెప్పింది ఏ ఒక్కటి కూడా చేయలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మధ్య నిషేధం అన్నాం.. విపరీతంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాం, దానిమీదనే బతుకుతున్నాం… అప్పులు తెచ్చుకుంటున్నాం… ఓట్లను కొనుగోలు చేస్తున్నామని ఎద్దేవా చేశారు.. చెప్పింది చేయలేనప్పుడు, చెప్పింది చేయకపోతే రాజీనామా చేయాలన్న తమ పార్టీ అధినేత మాటను ముఖ్యమంత్రి పట్టించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఢిల్లీకి వచ్చి పోరాటం చేస్తారా?, లేకపోతే ప్రజలు అనుకున్నట్లుగానే తమను కేసుల నుంచి బయటపడేయాలని కోరుతారా? , అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా చూడాలని, రఘురామకృష్ణం రాజును డిస్ క్వాలిఫై చేయాలని, అలాగే తాను కష్కో కిష్కో ఇచ్చి నమోదు చేయించిన ఎఫ్ఐఆర్ ల ద్వారా, ఇబ్బందులకు గురయ్యేలా చూడాలని అడుగుతారా? అంటూ నిలదీశారు.
పోలవరం పూర్తి చేయండి.. మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేయాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. పోలవరం పూర్తి చేయమని తాము అడుగుతున్నామని, గొంతెమ్మ కోరిక లేమీ కోరడం లేదన్నారు. పోలవరం పూర్తి చేయకుండా ఉభయగోదావరి జిల్లాలలో ఎన్ని కబుర్లు చెప్పినా, కులాల మధ్య చిచ్చు పెట్టిన… మనకు 20 నుంచి 25% మించి ఓట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. పోలవరం పెనుగండంగా, సుడిగుండంగా మారబోతుందని హెచ్చరించారు. ఆ సుడిగుండంలో పార్టీని నమ్ముకున్న వారు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఉభయగోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, అన్ని స్థానాలలో పార్టీ వాష్ అవుట్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేలుకొని, పార్టీని గోదాట్లో ముంచే ప్రయత్నం చేయవద్దని కోరారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ఆయన, ఎన్నికల ముందు ఎక్కడపడితే అక్కడ నోటికి వచ్చినట్లు మాట్లాడారని… ప్రజలంతా ముందుకొచ్చి రాజీనామా చేయమంటే, ఆ చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, ఆ దత్తపుత్రుడి కుట్రే ఇదంతా అంటే బాగుండదని అపహాస్యం చేశారు.
టైటిల్ మార్చి… నేనెంతో చేశానంటే కుదరదు
ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి, తాను ఎంతో చేశానంటే ప్రజలు నమ్మరని రఘురామకృష్ణంరాజు అన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద వంటి పథకాలు గతంలోనూ ఉన్నాయని, వాటికి పేర్లు మార్చి తానేంతో చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలులో లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలన్నీ పాత పథకాలేనని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016, 17 నుంచి మొదలుకొని 2019 వరకు మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో 1.9 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరగా, 2019, 20 నుంచి మొదలుకొని 22 వరకు కేవలం 1.3 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చేరారన్నారు. కరోనా కష్టకాలంలో ఫీజులు చెల్లించలేక ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 45 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లో చేరారని గణాంకాలు చెబుతున్నాయని, అంటే 1.3 లక్షల మంది విద్యార్థులు కూడా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చేరారని స్పష్టమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అదనంగా ప్రభుత్వ పాఠశాలలో చేరిన వారు ఎవరూ లేరని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించి, 6000 పాఠశాలలను ఎత్తివేసారని అయినా విద్యా రంగంలో పెను మార్పులు తెచ్చామని చెప్పుకోవడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. ఇక వైద్యరంగంలో 16 ఆసుపత్రులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ, ఒక్క ఆసుపత్రి పని ప్రారంభం కాలేదన్నారు. ఫ్యామిలీ డాక్టర్లు ఏమయ్యారో కూడా తెలియదని పేర్కొన్నారు. ఇక ఆరోగ్యశ్రీలో మరో వెయ్యి జబ్బులను చేర్చినట్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడువేల జబ్బులకు చికిత్సలు ఉంటాయా అంటూ ఎద్దేవా చేశారు.
ధైర్యం ఉంటే సచివాలయ ఉద్యోగులకు అటెండెన్స్ యాప్ పెట్టండి
ఉపాధ్యాయులకు అటెండెన్స్ యాప్ ను ప్రవేశపెట్టినట్లుగానే ధైర్యం ఉంటే ప్రవేశపెట్టాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. మాస్టార్లు అంటే అంత లోకువ అంటూ ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వ ఉద్యోగులందరికీ అటెండెన్స్ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఫోన్లు కొనుగోలు చేసి ఇవ్వాలని అన్నారు. ఉపాధ్యాయుల ను ఎత్తివేసి ఎన్నికలలో గ్రామ సచివాలయ సిబ్బందిని వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని, కానీ ఆయన ఎత్తుగడ పారాదని చెప్పారు.
మేము జీవోలు రద్దు చేస్తే బాగుండదు
ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదు అయిన కేసులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడాన్ని న్యాయస్థానం తప్పు పట్టడమే కాకుండా, ఆ జీవోను తాము రద్దు చేస్తే బాగుండదని చురకలు అంటించిందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు రూలింగ్ చాలా స్పష్టంగా ఉన్నదని తెలిపారు. మనమే న్యాయవ్యవస్థను గౌరవించకపోతే, ఇంకా ఎవరు గౌరవిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు పై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ, వాదనలు పూర్తయి ఎనిమిది నెలలు కావస్తున్నప్పటికీ తీర్పు ఎందుకు వెలువరించడం లేదో అర్థం కావడంలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇక మనస్సాక్షి లేని సాక్షి దినపత్రిక అప్పులపతంలో ఐదు రాష్ట్రాలు అంటూ వార్తా కథనం రాసిందని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల లో ఉందని, అందులో 1,50,000 కోట్ల రూపాయల అప్పులే ఉన్నాయని పేర్కొన్నారు. కానీ చేసిన అప్పులను చూపించకుండా, అప్పుల జాబితాలో రాష్ట్రం ఆఖరి జాబితాలో ఉందన్నట్టుగా ప్రచారం చేసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని సాక్షి దినపత్రిక చేస్తుందని విమర్శించారు.