Suryaa.co.in

Features

సంస్కరణే జీవితం!

కొన్ని ఆచారాలపై పోరాటం..
వాటి కోసం సంఘాన్ని ఎదిరించే ధైర్యం..
కొందరికే సాధ్యం..
అలాంటి పటిమ..
అందుకు
అవసరమైన వాక్పటిమ రాజారామ్మోహనుడి సొంతం..
దురాచారం దూరాచారం చెయ్యడమే నైజం..
ఎదిరించడమే ఆయన ఇజం!

భర్త పోతే అదే చితిపై సతి..
ఆ నీచ సంప్రదాయం పేరు సతీసహగమనం..
పెనిమిటి ముసలాడై
ఆయువు తీరి
అసువులు బాస్తే..
ముక్కుపచ్చలారని బాలిక
ఇంకా బతికితే
తన పేరు వితంతువు..
తననూ చితి ఎక్కిస్తే
సహగమనం..
ఉంటుందా అంతకు మించి
తిరోగమనం!

అలాంటి రాక్షస సంప్రదాయం నుంచి ఆడపిల్లకు రక్ష..
తప్పిన బలవంతపు మరణశిక్ష
అదే రాజా
రామ్మోహనుడి దీక్ష..
అక్కడితో ఉడికే రక్తం చల్లారేనా..
దుర్మార్గంపై కసి తీరేనా..
మళ్లీ మొదలైన రణనినాదం
ఈసారి మరో సంస్కరణ..
చాందసవాదుల తిరస్కరణ..
మగవాడెంతటి ముసలాడైనా
మళ్లీ పెళ్లికి అర్హత ఉంటే
బ్రతుకే తెలియని
బాల వితంతువుకెందుకు లేదా హక్కంటూ..
ఎగరేస్తే
తిరుగుబాటు బావుటా
ఈసారి ఆ ఘనకార్యం పేరు
వితంతువివాహం..
లక్ష్యం పసి మొహాల్లో
అందమైన వెలుగు..
చిన్నతల్లి నుదుటిన
కాసంత బొట్టు..
జీవితంపై నమ్మకాన్ని పెంచే
తాళిబొట్టు..!

స్త్రీ విద్య..
ఆడపిల్ల జీవితాన
తొలి సంధ్య..
అందుకోసమూ
పోరు సల్పిన రాజా
మడమ తిప్పని ఖలేజా..
మొత్తంగా
రాజా రామ్మోహన్ రాయ్ కి
పోరాటమే జీవితం..
సంస్కరణే ఇంగితం..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE