Suryaa.co.in

Editorial

‘నిఘా’కు అందని ‘రాజధాని ఫైల్స్’

– రెండేళ్ల క్రితమే ప్రారంభమైన రాజధాని ఫైల్స్ షూటింగ్
– షూటింగ్ అంతా అమరావతిలోనే
– సీఎం జగన్ నివాసానికి సమీపంలోనే నిరంతరాయంగా షూటింగ్
– దాదాపు 300 మందితో రెగ్యులర్ షూటింగ్
– అయినా పసిగట్టని నిఘా విభాగం
– నిత్యం నిఘా నీడలో అమరావతి
– అయినా బహిరంగంగానే షూటింగ్
– ఎన్నికలకు మూడేళ్ల తర్వాత షూటింగ్
– ఎన్నికలకు ముందు రిలీజ్
– వైసీపీ నేతల ఆశ్చర్యం
– వైఫల్యం వేటు ఎవరిపై?
( మార్తి సుబ్రహ్మణ్యం)

అది అమరావతి. నిత్యం నిఘా ఉండే రాజధాని ప్రాంతం. నిఘా ఒళ్లంతా కళ్లు చేసుకుని.. ఇంకా చెప్పాలంటే, డేగకళ్లతో జల్లెడపట్టే రైతులున్న ప్రాంతం. అన్నింటికీ మించి.. సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతం. అయినా సరే.. దాదాపు రెండున్నరేళ్లు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా, 90 శాతం షూటింగ్ అదే అమరావతిలో తీయడమే ఆశ్చర్యం. మరి నిఘా ఏం చేస్తోంది? ఇదీ ఇప్పుడు వైసీపీ నేతలను ఆశ్చర్యపరుస్తున్న టాపిక్.

రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తున్నారని, అదొక సినిమా వస్తుందని కొద్దిరోజుల క్రితం ఎవరికీ తెలియదు. అంటే ఆ సినిమా ప్రోమో వచ్చేవరకూ, మానవమాత్రుడికి తెలియదు. మానవులకు తెలియదనుకుంటే ఓకే. కానీ ఒళ్లంతా కళ్లు చేసుకుని, అమరావతిని అనునిత్యం జల్లెడ పట్టే, నిఘా దళాలు కూడా కనిపెట్టలేకపోయాయి. అదే వైసీపీ నేతలు నోరెళ్లబెట్టి విస్తుపోతున్న వార్త.

అమరావతిలో ఏళ్ల తరబడి ఉద్యమాలు జరుగుతున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఐదేళ్ల బుడ్డోడి నుంచి, అరవై ఏళ్ల బామ్మ వరకూ అంతా పిడికిలి బిగించి ఉద్యమిస్తున్నారు. శిబిరాల్లో వంతుల వారీగా కూర్చుని, రిలే నిరాహారదీక్షలు నిర్విహిస్తున్నారు. వారికి వివిధ పార్టీలు, వ్యక్తులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. దానితో అమరావతిలో కొత్త ముఖాలు ఎవరు కాలుబెడుతున్నారని నిఘా దళం ఆరా తీస్తోంది. అనుమానితులపై నిఘా పెడుతోంది. సరే.. ఫోన్ల ట్యాపింగ్ సహజమే. ఇక సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలు, సచివాలయానికి వెళ్లే సందర్భాల్లో అయితే చుట్టూ పరదాలే. గ్రామాల్లోకి ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వరు. ఇళ్ల ముందే పోలీసుల పహారా దృశ్యాలు కొన్నేళ్ల నుంచి చూస్తున్నవే.

మరి ఇంత నిఘా ఉండే అమరావతిలో.. ఏకంగా రెండేళ్లపాటు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సినిమానే షూట్ చేయడం ఏమిటో అర్ధం కాక, వైసీపేయులు తల పట్టుకుంటున్నారు. సహంజగా ఒక చిన్న సినిమా తీయాలంటే హీనపక్షం 150 మంది యూనిట్ సభ్యులు కావాలి. జూనియర్ ఆర్టిస్టులు, చిన్నా చితకా ఆర్టిస్టులూ కలిపి మరో 50 మంది వేసుకున్నా, హీనపక్షం 200 మంది ఉండాలి.

ఈ సినిమాలో అమరావతి రైతుల ఉద్యమ శిబిరాలనే చూపించారు కాబట్టి, మరో 50 నుంచి 100 మంది వరకూ భాగస్వాములు కావాలి. మరి అన్నేళ్లపాటు నిర్విఘ్నంగా షూటింగ్ చేస్తుంటే నిఘా దళం ఏం చేస్తోంది? అసలు ఆ సినిమా షూటింగుకు అనుమతి తీసుకున్నారా? ఒకవేళ తీసుకున్నా అంత సుదీర్ఘంగా అక్కడే షూటింగు ఎందుకు జరగుతోంది? దాని మతలబేమిటని, నిఘా దళాలు ఎందుకు ఆరా తీయలేదన్నది వైసీపీ నేతల వాదన.

సహజంగా టైటిల్ చూస్తే.. అది అమరావతి రైతు ఉద్యమానికి పూర్తి దన్నుగా నిలబడి, జగన్ సర్కారుతో కలబడే సినిమాగా, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అంటే ప్రధాని మోడీ శంకుస్థాపన నుంచి.. జగన్ మూడు రాజధానులు, రైతులపై పోలీసుల దాష్టీకాలు, న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర, రైతులకు విపక్షాల మద్దతు వంటి సన్నివేశాలు.. వాటికి సంబంధించిన పాత్రలు ఉంటాయని బుర్ర-బుద్ధి ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

అసలు సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకూ.. ఎక్కడా పబ్లిసిటీ చేయకుండా, గుంభనంగా తన పని ముగించిన నిర్మాత, తెలుగువన్ ఎండి రవిశంకర్‌ను మెచ్చుకోవాల్సిందే. సరే.. ఈ సినిమా విడుదల కాకుండా.. వైసీపీ నేతలు ఎలాగూ కోర్టుకు వెళతారు. ఒక వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్యకు కారణమవుతున్నందున, ఆ సినిమా విడుదల నిలిపివేయాలని కోరతారు. అది వేరే విషయం. కానీ రెండున్నరేళ్లు నిర్విరామంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించిన… సినిమా వాసన కూడా కనిపెట్టలేని నిఘా వైఫల్యం వేటు, ఎవరిపై పడుతుందన్నదే ప్రశ్న.

LEAVE A RESPONSE