– అధికారాలు లేని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
– సొంత కమిటీ కూడా స్వేచ్ఛగా వేసుకోలేని నిస్సహాయత
– కమిటీ కూర్పులో రాజు గారు, రెడ్డిగారిదే హవా
– ‘పురందేశ్వరి జాబితా’ను పట్టించుకోని దయనీయం
– అడ్డం తిరిగిన మేడం ప్రధాన కార్యదర్శుల జాబితా
– బైరెడ్డి శబరి స్థానంలో వ్యూహాత్మకంగా దయాకర్‌రెడ్డి
– దయాకర్‌రెడ్డి రాకతో శబరి- విల్సన్ అవుట్
– ఇష్టం లేకుండానే భరత్‌జీ సిఫార్సుతో తపన చౌదరికి పదవి
– సీనియర్లకు ప్రమోషన్ ఇప్పించలేని దుస్థితి
– పాత వారికి జోనల్ ఇన్చార్జి పదవులివ్వాలనుకున్న మేడం
– ఆ ఇద్దరి జోక్యంతో తారుమారైన మేడం కమిటీ జాబితా
– సోము కమిటీని నడిపించిన వారి చేతికే కొత్త కమిటీ పగ్గాలు
– సంఘటనా మంత్రి, మాజీ సంఘటనా మంత్రిదే హవా
– బడుగులకు బీజేపీలో దక్కని పదవులు
– కొత్త కమిటీపై పురందేశ్వరి అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘కొండంత రాగం తీసి పిచ్చగుంటలో పాటపాడినట్లు’ అన్నది తెలంగాణలో ఒక సామెత. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నియమించిన కొత్త కమిటీ కూడా, అంతే ఉందన్నది పార్టీ నేతల వ్యాఖ్య. పురందేశ్వరి ఏపీ కమల దళపతిగా వచ్చిన తర్వాత, చాలా దూకుడుగా వ్యవహరించారు. జగన్ సర్కారుపై కత్తి దూశారు.
ఆమె దూకుడు చూసిన పార్టీ శ్రేణులు, కొత్త కమిటీ వచ్చిన తర్వాత పార్టీ పంచకల్యాణి గుర్రంలా పరిగెడుతుందని అంచనా వేశారు. కానీ కొత్త సీసాలో పాత సారా మాదిరిగా, అసలు మేడం కంటే సోము వీర్రాజు బెటర్ అన్న భావన అతి తక్కువ రోజుల్లోనే వచ్చిన వైచిత్రి.
బీజేపీలో కులప్రభావం ఉండదు. కానీ ఏపీలో ఇప్పుడది పాత మాట అంటున్నారు. తాజా కమిటీ కూర్పు తర్వాత, ఏపీ బీజేపీకి కమ్మ వర్గానికి చెందిన పురందేశ్వరి అధ్యక్షురాలయినప్పటికీ… రెడ్ల హవా నడుస్తుందని పార్టీ వర్గాలకు స్పష్టమయింది. ఇప్పుడు ఏపీ బీజేపీలో ఇదే హాట్ టాపిక్.
తాజా కమిటీ కూర్పు చూసిన పార్టీ సంప్రదాయవాదులు, పురందేశ్వరి నాయకురాలిగా సక్సెస్ కాలేరన్న భావనకు వస్తున్న విచిత్ర పరిస్ధితి నెలకొంది. నిజానికి పురందేశ్వరి అధ్యక్షురాలిగా నియమితురాలైన తర్వాత, కొత్త నేతలను కమిటీలోకి తీసుకోవాలని భావించారట. సోము వీర్రాజు కమిటీలో పనిచేసిన వారెవరినీ తీసుకోకుండా.. వారికి జిల్లా అధ్యక్ష, జోనల్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని భావించినట్లు సమాచారం.
అందుకే అధికార ప్రతినిధిగా పనిచేసిన భానుప్రకాష్‌రెడ్డిని కొనసాగించకుండా, ఆయనను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. విష్ణువర్దన్‌రెడ్డి వంటి నేతలకు జోనల్ ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వడం ద్వారా, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఆ ప్రకారంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్‌డి విల్సన్, రాయలసీమ నుంచి బైరెడ్డి శబరి, విశాఖకు చెందిన కాశిరాజుకు ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా నేత-కేంద్ర లేబర్‌బోర్డు చైర్మన్ జయప్రకాష్‌కు ఉపాధ్యక్ష పదవి, లంకా దినకర్‌కు మీడియా ఇన్చార్జి ఇవ్వాలని భావించి, ఆ మేరకు ఒక జాబితా తయారు చేశారట.
ఈలోగా గతంలో సంఘటనా మంత్రిగా పనిచేసి, ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సీనియర్ నేత పురందేశ్వరికి ఫోన్ చేసి.. గుంటూరు జిల్లాకు చెందిన బిట్రా పేరు సిఫార్సు చేయడంతో, ఆయన పేరును ప్రధాన కార్యదర్శి జాబితాలో చేర్చినట్లు సమాచారం. హెడ్‌క్వార్టర్ ఇన్చార్జిగా కృష్ణా జిల్లా నేత చిగురుపాటి కుమారస్వామికి ఇవ్వాలని పురందేశ్వరి భావించగా, ఆ ప్రయత్నం కూడా ఫలించలేదంటున్నారు.
ఇక కాశిరాజు సీనియర్ నాయకుడు. దానితోపాటు పురందేశ్వరి వియ్యంకుడికి మిత్రుడు. గతంలో పురందేశ్వరి పోటీ చేసినప్పుడు కాశిరాజు.. ఆమెకు దన్నుగా నిలిచినందున, ఆయన పేరు ప్రధాన కార్యదర్శికి పంపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏలూరుకు చెందిన తపన చౌదరి పేరు, ఆరెస్సెస్ సీనియర్ నేత భరత్‌జీ సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భరత్‌జీ కుటుంబంలో ఇటీవల సంభవించిన ఒక విషాదఘటన కార్యక్రమంలో, తపన చౌదరి అన్నీ తానై చూశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానికితోడు సంఘ్‌కు చెందిన ప్రముఖులకు, రాజమండ్రిలోని తన హోటల్‌లో అన్ని సౌకర్యాలు కల్పించేవారని చెబుతున్నారు. అయితే పురందేశ్వరి ఆయనకు ఆ పదవి ఇవ్వడం ఇష్టం లేకున్నా, భరత్‌జీ సిఫార్సును కాదనలేకపోయారంటున్నారు.
గత అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోతానని తెలిసినా, వైసీపీకి ఎదురొడ్డి నిలిచి పోరాడిన సురేష్‌కు యువమోర్చా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాల్సింది. అదేవిధంగా ఎస్సీ మోర్చాకు ముని సుబ్రమణ్యంకు ఇవ్వాలని భావించారు. కానీ అన్ని సెల్స్‌ను సంఘటనా మంత్రి మధకర్‌రెడ్డి జోక్యం చేసుకుని, పురందేశ్వరి అనుకున్న వారికి రాకుండా, సోము వర్గం సూచించిన వారికి ఇచ్చేలా చేశారన్న చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది.
తిరుపతి జిల్లా అధ్యక్ష పదవినే సమర్ధవంతంగా చేయలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్న దయాకర్‌రెడ్డికి, ఏకంగా ప్రధాన కార్యదర్శి పదవి లభించడం వెనుక మధుకర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్న చర్చ జరుగుతోంది. ఆయనకు ఆ పదవి లభించడం వెనుక.. మధుకర్‌రెడ్డి-విష్ణువర్దన్‌రెడ్డి చక్రం తిప్పారన్న ప్రచారం జరుగుతోంది.
దీనితో నెల్లూరుకు చెందిన విల్సన్‌కు దక్కాల్సిన ప్రధాన కార్యదర్శి దక్కకుండా పోయింది. పక్క పక్క జిల్లాలయిన తిరుపతి-నెల్లూరు నుంచి ఇద్దరికి ప్రధాన కార్యదర్శి ఇవ్వరన్న లాజిక్‌తో, విల్సన్ అధికార ప్రతినిధికి పరిమితం కావల్సివచ్చింది. అసలు దయాకర్‌రెడ్డిని తెరపైకి తెచ్చి, ఆయనకు ప్రధాన కార్యదర్శి ఇప్పించిన రెడ్డి వర్గం- ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. అటు శబరి-ఇటు విల్సన్‌ను దెబ్బకొట్టారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. కేంద్రమంత్రి గడ్కరీని విమర్శించారన్న ఒక వీడియోను సోషల్‌మీడియాకు విడుదల చేసిన ఒక రెడ్డి ప్రముఖుడు.. శబరి స్థానంలో తన వర్గీయుడైన దయాకర్‌రెడ్డిని తెలివిగా నియమించుకున్నారని, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒత్తిడితో, విష్ణువర్దన్‌రెడ్డి తిరిగి కొత్త కమిటీలో స్థానం లభించినట్లు ప్రచారం జరుగుతోంది.
అసలు గత కమిటీలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా పనిచేసిన వారందరికీ జిల్లా అధ్యక్ష, జోనల్ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని, పురందేశ్వరి భావించినట్లు చె బుతున్నారు. ఆమేరకు ఆమె ఒక జాబితాకూడా రూపొందించినట్లు సమాచారం. అయితే వాటిని మాజీ -తాజా సంఘటనా మంత్రులు రంగంలోకి దిగి, తమ వర్గీయులకు పదవులు ఇప్పించుకోవడం ద్వారా, మేడమ్ జాబితాను తారుమారు చేశారంటున్నారు.
కన్నా లక్ష్మీనారాయణను తప్పించి.. సోము వీర్రాజును అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో చక్రం తిప్పిన మాజీ సంఘటనా మంత్రి, మళ్లీ ఇప్పుడు రంగప్రవేశం చేసి పాత కమిటీ వారందరినీ మళ్లీ కమిటీలో చేర్పించి.. పురందేశ్వరిని డమ్మీని చేశారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకు మధుకర్‌రెడ్డి సహకారం-ఆమె ప్రతిఘటనాలోపం కూడా ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పాత సంఘటనా మంత్రి తన వర్గీయులందరినీ, తిరిగి కొత్త కమిటీలో చేర్పించారంటున్నారు. కమిటీ నియామకాల్లో మధుకర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో.. ‘స్పా’ ప్రభావమే ప్రధాన కారణంగా, పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అసలు బడుగు బలహీన వర్గాలకు దామాషా నిష్పత్తి ప్రకారం, స్థానం లభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో బీసీవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు సరైన ప్రాధాన్యం లేదంటున్నారు. తూర్పు కాపు, వడ్డెర, మత్స్యకార, వైశ్య, బ్రాహ్మణ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక జనాభాలో అధిక శాతం ఉన్న కాపులకు, సరైన ప్రాధాన్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇచ్చిన వారికి జనంలో బలం లేదంటున్నారు.
జనంలో బలం లేని కాపు, కమ్మ నేతలను నియమించిన నాయకత్వం.. పార్టీలో మొదటి నుంచీ పనిచేస్తున్న ఆ వర్గ నేతలను విస్మరించడంపై, అదే కమ్మ-కాపు వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కీలక నేతల సిఫార్సుతో ఆ రెండు కులాల కోటాలో, పదవులు దక్కించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే వీటిని ప్రతిఘటించి, సమర్ధులకు స్థానం కల్పించడంలో అధ్యక్షురాలిగా పురందేశ్వరి విఫలమయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. కమిటీ కూర్పులో తనకు జాతీయ నాయకత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా.. మోహమాటం-లౌక్యం- సంఘ్ నేతలతో ఘర్షణ ఎందుకన్న ముందు చూపు ప్రద ర్శించిన పురందేశ్వరి.. ఆదిలోనే నాయకురాలిగా విఫలమయ్యారన్న వ్యాఖ్యలు, ఆమె సొంత సామాజికవర్గంలోనూ వినిపిస్తున్నాయి.
నిజానికి కో ఇన్చార్జి సునీల్ దియోథర్-సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డిని మార్చకుండా, కొత్త అధ్యక్షులు సాధించేదేమీ లేదన్న విషయం బహిరంగ రహస్యమేనంటున్నారు. పాత కమిటీలో సోము వీర్రాజు-సునీల్ దియోథర్-మధుకర్‌రెడ్డి- విష్ణువర్దన్‌రెడ్డి ఒక జట్టుగా పనిచేసిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు, ఈ బృందం ఇష్టపడదన్న ముద్ర పార్టీ వర్గాల్లో ఉందన్నది బహిరంగమేనంటున్నారు. వీరికి పూర్వ సంఘటనా మంత్రి ఒకరు, ఢిల్లీ నుంచి తెరచాటు మద్దతు నిచ్చేవారన్నది పార్టీలో అందరికీ తెలుసంటున్నారు.
అలాంటిది మధుకర్‌రెడ్డిని మార్చాలని.. పురందేశ్వరి పార్టీ జాతీయ నాయకత్వానికి సూచించకపోవడమే, ఆశ్చర్యంగా ఉందంటున్నారు. నిజానికి సంఘటనా మంత్రుల నియామకం పూర్తిగా సంఘ్‌దే అయినప్పటికీ.. కొత్తగా వచ్చిన తాను స్వేచ్ఛగా పనిచేయాలంటే, పాతవారిని తొలగించడం తప్పదని ఆమె అభ్యర్ధించే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా పురందేశ్వరి కమిటీ విషయంలో ,పాముచావకుండా-కర్ర విరగని తన సహజ తెలివి ప్రదర్శించారంటున్నారు.
అయితే పురందేశ్వరి విషయంలో.. తాము వేసిన అంచనాలు తప్పని తేలిపోయాయని, పదవులు రాని నేతలు పెదవి విరుస్తున్నారు. పార్టీ నడిచేందుకు ఆర్ధిక వనరులు సమకూర్చే వారు కమిటీలోకి వచ్చినందున, ఆమెకు ఆర్ధిక భారం తప్పినట్లేనన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటితో పోలిస్తే అధికారాలు లేవన్న అవమానం, పెద్ద విషయం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
పోరాడి నేతలను కాపాడుకోలేని పురందేశ్వరి వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ఆమెకు ఎవరూ దన్నుగా నిలబడరని స్పష్టం చేస్తున్నారు. సోమువీర్రాజుపై వ్యక్తిగత విమర్శలు ఎన్ని ఉన్నా, తన వెంట నిలిచిన వారికి పదవులు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బహుశా ఈ కారణంగానే.. పురందేశ్వరి కంటే సోము బెటర్ లీడర్ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లు స్పష్టమవుతుంది.