Suryaa.co.in

Andhra Pradesh

దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరణ జగన్ పాలనకు నిలువెత్తు నిదర్శనం

– 77ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో దళితుల పట్ల చిన్న చూపు దారుణం
– వైసీపీ అరాచక పాలనలో దళిత వర్గం అణగారిపోతోంది
– ఈ దుశ్చర్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి
– దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
– ఘటనపై స్పందించని మంత్రులు దళితులందరికీ క్షమాపణలు చెప్పాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

తిరుపతిజిల్లా, పుత్తూరు మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రోలక్షమ్మ దేవాలయంలోకి దళితులను ప్రవేశించకుండా అడ్డుకున్న ఘటనను తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77ఏళ్లు గడిచినా తిరుపతి జిల్లా, పుత్తూరు మండలంలో కులవివక్ష పడగ విప్పడం అత్యంత బాధాకరం. దళితులకు ఆలయ ప్రవేశం లేదని నిరాకరించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి దినంగా తెలుగుదేశంపార్టీ భావిస్తోంది.

ప్రపంచ దేశాల్లోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఖ్యాతి గడించింది. మన రాజ్యాంగం భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తోంది. ఎవరికి నచ్చిన మతాన్ని అయినా అనుసరించే ప్రాథమిక హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. కానీ తిరుపతి జిల్లా, పుత్తూరు మండలం, గొల్లపల్లి గ్రామ దళితులకు రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు వర్తించకపోవడం దుర్మార్గం. ఈ గ్రామ దళితుల పట్ల కుల వివక్ష చూపి ఆలయ ముఖ ద్వారానికి తాళం వేసుకుని పూజారులు వెళ్లిపోవడం అత్యంత ఘోరమైన చర్యగా టీడీపీ భావిస్తోంది.

కులాలను బట్టి ఆలయ ప్రవేశం నిర్ణయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అవమానం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు సమాచారం ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం కులవివక్షను ప్రోత్సహించడమే. జిల్లా మేజిస్ట్రేట్ వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన కలెక్టర్ తీరు అన్యాయం. అదేవిధంగా మంత్రి ఆర్కే రోజా, ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి కూడా ఈ ఘటనపై నేటికీ స్పందించకపోవడం కులవివక్షను పాలకులే పెంచి పోషిస్తున్నారనడానికి నిదర్శనం.

వైసీపీ పాలనలో దళితులు అనునిత్యం వివక్షకు గురవుతున్నారు. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి, మంత్రి హోదాలో దళితులు ప్రభుత్వం చేతిలో అవమానాలకు గురయ్యారు. టీటీడీ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి ఓ ప్రెస్ మీట్ నిర్వహించి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామిని నిలబెట్టి దళిత జాతిని అవమానించారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కార్యక్రమంలో దళిత మంత్రి పినిపె విశ్వరూప్ కు కుర్చీ వేయకుండా క్రింద కూర్చోబెట్టి దళిత జాతిని కించపరిచారు. వైసీపీ పాలనలో దళిత మంత్రులు, దళితులు తీవ్రంగా వివక్షకు గురవుతున్నారు. దీన్ని దళిత జాతి ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి ఉండబోదని, దీనికి రెట్టింపు దళితులు చెల్లిస్తారని హెచ్చరిస్తున్నాం.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి, ఆ కమిషన్ సూచించిన సిఫార్సులను వైసీపీ ప్రభుత్వం అవలంభించకపోవడం దళితుల పట్ల చిన్నచూపు చూడడమే. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రులు, ఇతర అధికార యంత్రాంగం మొత్తం ఏకమై దళితులపై వివక్షపూరితంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. ఈ ఘటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం.

దళితులపై ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న పూజారులు, ఈ ఘటనతో ముడిపడి ఉన్న సంబంధిత వ్యక్తులు, వీరి వెనుక ఉన్న వైసీపీ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసు నమోదు చేసి తగు చర్యలు చేపట్టాలి. జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించాలి. దళితులు స్వేచ్ఛగా తమకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి అవసరమైన చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE