ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా..
అంటే..
చలమయ్య వస్తాను..
ఆపైన చూస్తాను..
తొందర పడితే
లాభం లేదయా..
ఇలా రమాప్రభ అన్నా
తొందరపడి
వెళ్ళిపోయాడు అల్లు..!
వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను..అసలు విషయము చెబుతాను..
అన్నా వినకుండా
తుర్రుమన్నాడు రాజబాబు!
వలపుల తాయం పెడితే
నీ వలలో నే పడతానని
ఆశ పెట్టినా ప్రయాస ఓపలేక
జారుకున్నాడు
పిలక పద్మనాభం..!
జత కట్టిన అల్లు,రాజబాబు..
పద్మనాభం సులభంగా
మీదకెళ్ళిపోయినా
ఇప్పటికీ వెలిగిపోతూనే
ఉంది రమా’ప్రభ’..
78 నాటౌట్..కామెడీ కటౌట్!
ఒకటా..రెండా…
1600 సినిమాలు..
హాస్య నటులు ఎందరున్నా
సినిమాకి శోభ ఈ రమాప్రభ
అందాల బొమ్మ నుంచి
చిరంజీవి బామ్మ వరకు
సాగిన విజయ యాత్ర
ఎంతటి బాధనైనా పోగొట్టే
నవ్వుల మాత్ర..,!
విశ్వనాధుని సీత కథలో
రోజారమణి సొగసు
మల్లె కన్న తెల్లనైతే
అంతకంటే చల్లని నవ్వులు
పంచింది రమాప్రభ అమాయకంగా..!
ప్రేమనగర్లో హంస అల్లరి..
అబ్బో నవ్వుల వల్లరి..
కెవి చలం క్యారేజీ..
రాజబాబుతో ప్రేమ బ్యారేజి..
ఉన్ని బట్టల మోజులు..
మించి పెదబాబుతో
దొరసాని ఫోజులు…
నిజం..అవి
రమాప్రభ రోజులు..!
ఆలుమగలులో రాజబాబు
కోరిక వేడిని ..
అతగాడి ప్రేమ దాడిని
భరించలేని పిల్లలకోడిగా
అక్కినేనికి మొరపెట్టుకున్నా..
గోరింటాకులో చలాన్ని
ఏతంతావ్ ఏతంతావ్
అని నిలదీసినా..
రమాప్రభ అంటే
జనాలకి ప్యారు..
లేడీ కమేడియన్లలో
ఆమే సూపర్ స్టారు..!
ముందు వరసలో
గిరిజ..గీతాంజలి..
తర్వాత ఆమెకే
ప్రేక్షకుల అంజలి!
తన కన్న చిన్నవాడైన
శరత్ బాబు అయ్యాడు పతి
ఆ కాపురం వింతకాపురం..
కొన్నాళ్ళకే విడాకులైనా
రమాప్రభ అలసిపోక
అలా పరుస్తూనే ఉంది
నవ్వుల విస్తరాకులు!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286