– రేట్లు తగ్గిన తర్వాతే చూడండి
– టికెట్ రేటును సమర్ధిస్తూ రాంగోపాల్‌వర్మ ట్వీట్
హైదరాబాద్: టికెట్ రేట్లు ఎక్కువని అనుకునే వారు పుష్ప 2 సినిమా చూడొద్దని రాంగోపాల్ వర్మ సూచించారు. వారం తర్వాతో లేక నెల తర్వాతో టికెట్ ధరలు తగ్గాకే సినిమా చూడాలని.. ఎంటర్టైన్ మెంట్ నిత్యావసరం కాదని, నిత్యావసరాల ధరలు పెరిగినా, లగ్జరీ, బ్రాండెడ్ వస్తువుల ధరలపైనా ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరలపై మాత్రం ఎందుకు ఏడుస్తున్నారని వర్మ మండిపడ్డారు.
డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని వస్తువులలాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి తప్ప, ప్రజాసేవ కోసం కాదని స్పష్టంచేశారు. పుష్ప-2 సినిమా రేట్ల ధరను పెంచడాన్ని గట్టిగా సమర్ధించిన వర్మ, తన వాదనకు మద్దతుగా ఒక కథ చెప్పారు.
అదేమిటంటే.. ‘‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ.1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు”
“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదుఅని ఎవరైనా ఏడిస్తే , అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ సెవెన్‌స్టార్ హోటల్లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమానే’’ అని వర్మ ట్వీట్ చేశారు.
నిత్యావసరాలని బ్రాండింగ్ ఉన్న ఇల్లు, తిండి, బట్టల ధరలే ఆకాశాన్ని తాకుతుంటే నిత్యావసరం కాని పుష్ప 2 సినిమాకు ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువేనని చెప్పారు. రేట్లు ఎక్కువ అని అనుకునే వారు సినిమా చూడడం మానేయొచ్చు లేదా రేట్లు తగ్గాక చూడొచ్చు. వారికి ఆ ఆప్షన్ ఉంది .
సుబ్బారావు హోటల్ చైన్ విషయానికి వస్తే.. ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయిందని చెప్పారు. సుబ్బారావుకు చెందిన ఏ హోటల్ లోనూ కూర్చునేందుకు చోటు దొరకకపోవడమే దీనికి నిదర్శనమని .. పరోక్షంగా పుష్ప 2 సినిమాకు బుకింగ్స్ మొత్తం పూర్తయ్యాయని వర్మ తన ట్వీట్ ముగించారు.